09/29/19 6:40 PM

నన్ను, నా తమ్ముడిని చూశాకైనా దూరంగా ఉండండి : రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi Sensational Comments On Politics

సినీ తారలు రాజకీయాలకు పనికి రారా. సినిమాల్లో స్టార్లుగా వెలుగొందిన వారు రాజకీయాల్లో సక్సెస్ కాలేరా? సినీ రంగానికి చెందిన వారు పాలిటిక్స్ కి దూరంగా ఉంటేనే మంచిదా? టాలీవుడ్ మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి, మాజీ పార్టీ అధినేత చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. చిరంజీవి మాటలు హాట్ టాపిక్ గా మారాయి. జనసైనికుల్లో గందరగోళం నింపాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనలో పడిపోయారు. ఇంతకీ చిరంజీవి ఏమన్నారంటే.. సినీ తారలు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది అని సలహా ఇచ్చారు.

 

ప్రస్తుత రాజకీయాలు ధన, కుల ప్రవాహంలో ఉన్నాయని.. ఎంతటి స్టార్లు వచ్చినా తట్టుకోవడం కష్టమని.. సో రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటర్ అని కమల్ హాసన్, రజనీ కాంత్‌లకు చిరంజీవి చెప్పారు. అందుకు తనతో పాటు తన తమ్ముడు పవన్ కూడా నిదర్శనమని.. తమను చూసి అయినా రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన మార్చుకోవాలని తమిళ హీరోలకు చిరంజీవి సలహా ఇచ్చారు.

 

టాలీవుడ్ లో చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన స్థానాన్ని ఇప్పటి ఏ హీరోలు భర్తీ చేయలేరన్నది జగమెరిగిన సత్యం. అయితే రాజకీయాల్లో మాత్రం ఆయన అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉండగా.. రాజకీయాలపై తన తోటి హీరోలైన రజనీ కాంత్, కమల్ హాసన్‌లకు చిరు సంచలన సలహా ఇచ్చారు. కుదిరితే రాజకీయాలకు దూరంగా ఉండండి అంటూ అడ్వైజ్ చేశారు.

 

తమిళనాడుకి చెందిన ఓ ప్రముఖ మేగజైన్‌కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు చిరంజీవి. అందులో రాజకీయాల గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో తాను నంబర్ 1 గా కొనసాగుతున్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. డబ్బు వల్లనే నా సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయాను అని స్పష్టం చేశారు. అంతేకాదు తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ కూడా ఇటీవల ఎన్నికల్లో అలానే ఓడిపోయాడు అని చిరు వివరించారు. పవన్ కూడా రెండు చోట్ల పోటీ చేశాడు. ఒకటి విశాఖ గాజువాకలో మరొకటి.. సొంతూరు భీమవరం. రెండు చోట్లా పవన్ ఓటమి చెందాడు. దీంతో.. పాలిటిక్స్‌లో నిలవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని చిరు అన్నారు. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మాత్రం రజనీ కాంత్, కమల్ హాసన్ ఆ సవాళ్లన్నింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చిరు అన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ హాసన్ పార్టీ కొన్ని స్థానాలైనా గెలుస్తుందని భావించాను, కానీ ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేనిదని చిరంజీవి తెలిపారు.

 

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరు.. 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన పార్టీ 18 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఆ ఎన్నికల్లో తన స్వస్థలం పాలకొల్లు, తిరుపతి నుంచి చిరు పోటీ చేయగా.. తిరుపతి నుంచి గెలిచారు. సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

 

రాజకీయాల్లోకి రావొద్దని చిరంజీవి ఇచ్చిన సలహాలకు కమల్ హాసన్ స్పందించారు. చిరుకి షాక్ ఇచ్చారు. గెలుపు ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల్లో మార్పు కోసం చైతన్యం కోసం వచ్చానని వివరించారు. అంతేకాదు.. ఇకపై తనకెప్పుడూ సలహాలు ఇవ్వొద్దని చిరుని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం వల్లే ప్రజల ఆలోచనా ధోరణి పై అవగాహన పెరిగిందని కమల్ చెప్పారు.

 

సినీ తారలు రాజకీయాల్లో సక్సెస్ కాలేరు అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దీని గురించి జనసేనలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చిరంజీవి సలహా పవన్ కి కూడా వర్తిస్తుందా అని అంతా చర్చించుకుంటున్నారు. పవన్ కూడా రాజకీయాలకు దూరం అవుతారా అని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే పాతికేళ్లు రాజకీయం చేయడానికి వచ్చాను అని పవన్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే.

 

సినీ తారలు రాజకీయాలకు పనికి రారా అంటే.. అలాంటిదేమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ సినీ స్టార్ నుంచి పొలిటికల్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆయన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తమిళనాడులో చూస్తే సినీ తారలు ఎంజీఆర్, జయలలిత ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యారో తెలుస్తుంది. సినీ తారలుగా ఓ వెలుగొందిన వారు.. పాలిటిక్స్ లోనూ సత్తా చాటారు. ముఖ్యమంత్రులు అయ్యారు. రాష్ట్రాన్ని పరిపాలించారు. సో.. చిరంజీవి చెప్పింది కరెక్ట్ కాదనే వాళ్లు ఉన్నారు. ఇకపోతే.. రాజకీయాల్లో రాణించాలంటే.. ఓర్పు, సహనం కావాలి. అధికారం, పదవులు అంత ఈజీగా దక్కవు. 10, 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ధైర్యం సడలకూడదు. ఇందుకు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు సీఎం జగన్.. నిదర్శనం. ఈ ముగ్గురు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా వారిలో ధైర్యం సడలలేదు. చివరికి అనుకున్నది సాధించారు. కానీ.. సినీ తారలు మాత్రం.. సినిమాల్లో హిట్స్ లాగే.. ఇన్ స్టెంట్ విజయాలు కోరుకుంటున్నారు. ఇలా వచ్చామో లేదో అలా అధికారం కావాలని కలలు కంటున్నారు. అందుకే రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు అని విశ్లేషకులు అంటున్నారు.

Tags : chiranjeeviCinema StarsJayalalithaKamal HaasanMGRntrpawan kalyanpoliticsrajinikanth

Also read

Use Facebook to Comment on this PostMenu