03/23/19 12:50 PM

బాబుగారు.. పవన్‌ను టార్గెట్ చేయడానికి కారణం అదేనా..?

Cm chandrababu fires on pawan kalyan

సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్లేస్ ఏదైనా, సందర్భం ఏదైనా.. వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ క్రిమినల్ అని, అవినీతి పరుడు అని విమర్శిస్తున్నారు. జగన్ కు ఓటు వేస్తే మీ మరణశాసనం మీరే రాసుకున్నట్టు అని హెచ్చరిస్తున్నారు. జగన్ ను గెలిపిస్తే రాష్ట్రం నాశనం అవుతుందని అంటున్నారు. ఇలా ఛాన్స్ చిక్కితే చాలు.. జగన్ ను ఏకిపారేస్తున్నారు. పనిలో పనిగా కేసీఆర్, మోడీలపై విరుచుకుపడుతున్నారు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఒక్క మాట కూడా ఎందుకు అనడం లేదు? అనే ప్రశ్నలు తలెత్తాయి. జగన్ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు, పవన్ మధ్య లోపాయికారి ఒప్పందం నిజమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి జనసేన పార్టీని కానీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కానీ చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదు. ఎన్నికల తర్వాత జనసేనతో కలిసి పని చేసే అవకాశం వస్తుందేమో అనే భావనతోనే చంద్రబాబు.. పవన్ విషయంలో మెతక వైఖరి అవలంభిస్తున్నారని… ఆయనను ఎక్కువగా విమర్శించడం లేదని ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన కుమ్మక్కయ్యాయని వైసీపీ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకి తెలిసిందో ఏమో కానీ.. పవన్ కళ్యాణ్‌పై విమర్శలను పెంచాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఫస్ట్ టైమ్ పవన్ ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు చేశారు.

 

నర్సీపట్నం ఎన్నికల ప్రచారంలో జగన్‌తో పాటు పవన్ కళ్యాణ్‌పైనా చంద్రబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు, జగన్ ఇద్దరితోనూ సమానదూరం పాటిస్తానని పవన్ కళ్యాణ్ ఎలా అంటారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌తో నాకు పోలిక పెడతారా అంటూ నిలదీశారు. పవన్ ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. నేర‌స్థుల వైపు ఉంటారో, అభివృద్ది ప‌క్షాన ఉంటారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మీరు ఎవరికైనా భయపడతారేమో కానీ… నేను ఎవరికీ భయపడనని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. చంద్ర‌బాబు అనుభ‌వం ఏపికి ఉప‌యోగ‌ప‌డ‌లేదంటున్న ప‌వ‌న్.. త‌న‌కు ఉన్న అనుభ‌వం ఏ పాటిదో చెప్పాల‌ని చంద్రబాబు నిల‌దీశారు. జ‌గ‌న్ అక్ర‌మాల గురించి ఆయ‌న పక్క‌నే ఉండే మాజీ జేడి ల‌క్ష్మీనారాయ‌ణ ప్రజలకు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

 

చంద్రబాబు.. పవన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నిజంగానే చంద్రబాబు.. పవన్ పై సీరియస్ అయ్యారా? లేక ఇదంతా వ్యూహంలో భాగమేనా? అనే సందేహాలు కలుగుతున్నాయి. పవన్ తో ఉన్న లోపాయికారి ఒప్పందం గురించి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకే చంద్రబాబు పవన్ ను విమర్శించారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరి ఏది వాస్తవమో? ఏది అవాస్తవమో? తెలియాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Tags : ap cm chandrababuap elections 2019election campaignjanasenapawan kalyanTDPys jaganysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu