02/14/19 12:02 PM

నో డౌట్: గెలుపు ఖాయం అంటున్న చంద్రబాబు

CM CHANDRABABU FULL CONFIDENCE ON VICTORY

ఏపీలో ఎన్నికల సమయం వచ్చేసింది. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. రెండోసారి అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతుంటే..ఈసారి ఎలాగైనా సీఎం కావాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. తన సత్తా ఏంటో చూపించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తపన పడుతున్నారు. మరి అంతిమంగా ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి. సీఎం చంద్రబాబు మాత్రం గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందని చంద్రబాబు ధీమాగా ఉన్నారు.

 

చంద్రబాబు కాన్ఫిడెన్స్‌కి కారణం సంక్షేమ పథకాలే అని తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్‌ కింద ఏడాదికి రూ.24 వేలు, పసుపు కుంకుమ కింద ఒక్కో మహిళకు రూ.20 వేలు, రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఈ మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్‌కు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఆ పథకాలే టీడీపీని గెలిపిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీల నేతలతో చర్చలు సక్సెస్ అయ్యాయని, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందే బీజేపీయేతర పక్షాల కూటమి ఉంటుందన్నారు. ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌‌లో చంద్రబాబు పలు అంశాలపై స్పందించారు.

 

అన్నదాత సుఖీభవ పథకం ఒక చరిత్ర అని చంద్రబాబు అభివర్ణించారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలనుకోవడం చారిత్రక నిర్ణయమన్నారు. రైతు సాయానికి కేంద్రం ఎన్నో షరతులు విధించిందని, కానీ మనం దానికంటే మెరుగ్గా చేశామని, ఏపీలో రైతులందరికీ ఇస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు కూడా మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నో కష్టాల్లో కూడా ఇన్ని కార్యక్రమాలు జరిగింది ఒక్క ఏపీలోనే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కాపులకు రిజర్వేషన్లని చెప్పి మోసగించింది వైఎస్ అని, జగన్‌కు కాపు రిజర్వేషన్లతో సంబంధం లేదని చంద్రబాబు మండిపడ్డారు. కులాలను రెచ్చగొట్టే కుట్రలు వైసీపీ చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

 

తనను దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను రాష్ట్రం కోసం పోరాడుతుంటే.. బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయన్నారు. ఓ వైపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం..మరోవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ.. ఇవన్నీ మీరిచ్చిన ప్రోత్సాహంతోనే అని చంద్రబాబు అన్నారు. మోడీ పాలనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు.

 

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడటంపైనా చంద్రబాబు స్పందించారు. ఆమంచి లాంటి వ్యక్తులు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు. చీరాలలో పార్టీ బలంగా ఉందని, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు అని చంద్రబాబు అన్నారు. పార్టీని అంటి పెట్టుకుని ఉన్నది కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఆశయం కోసం పనిచేసేది వారేనని కితాబిచ్చారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.700 కోట్లు ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. తనపై కుల ముద్ర వేయాలని చూడటం దారుణమని చంద్రబాబు ధ్వజమెత్తారు. అవకాశవాదులకు టీడీపీలో స్థానం లేదని, కొందరు పోతే జరిగే నష్టం కన్నా.. లాభాలే ఎక్కువ అని చంద్రబాబు అన్నారు.

Tags : annadata sukhibhavaap cm chandrababuap electionsconfidence on victorypawan kalyanPensionsTDPwelfare schemesys jagnaysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu