01/21/18 8:52 PM

మనల్ని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదు..!

Untitled-1 copy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ్ముళ్లలో జోష్ నింపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని టీడీపీ ఆయన అన్నారు. ఇక గతానికి వినూత్నంగా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకులు ప్రణాళికలు రచించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికలంటే గతంలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి ఉండేవని, ఇప్పుడు అలా లేదని, నేతల పనితీరునే ప్రజలు ప్రమాణంగా తీసుకుంటున్నారని చెప్పారు. నాయకుల పనితీరు బాగుంటే ప్రజలు నిరంతరం ఆదరిస్తారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ ఒకరోజు వర్క్ షాప్ జరిగింది. ఇందులో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.

అదే సమయంలో కొందరు నాయకులకు చంద్రబాబు హెచ్చరికలు పంపారు. చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలకు ఇకపై కష్టకాలమేనని, పనిచేయకపోతే వారికి ఇబ్బందులు తప్పవన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపిస్తే పనిచేయకపోతే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మూడు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోని పరిస్థితిలో ‘నేను వచ్చి మీ దగ్గర నిరాహారదీక్ష చేస్తా, అప్పుడైనా మీపై ఒత్తిడి పెరుగుతుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ గతంలో ఇదే పద్ధతిని అనుసరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

 

ఇక హైదరాబాద్ అభివృద్ధి అంశం గురించి చంద్రబాబు ప్రస్తావించారు. హైదరాబాద్ కు మనం చేసిందేమీ లేదని కొందరు అంటున్నారని, 1995కు ముందు .. ఆ తర్వాత హైదరాబాద్ ఎలా ఉందో పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరోక్షంగా సూచించారు చంద్రబాబు.

 

ఇక కేంద్రంతో వ్యవహరించాల్సిన తీరుపైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం హామీల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై స్పందించిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే పనులు జరగవని అన్నారు. అయితే, విభజన సమస్యల పరిష్కారంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పడకుండా సహనంతో నిధులు సాధించే ప్రయత్నం జరుగుతోందని వివరించారు.

Tags : ap cmchandrababu naiduhyderabadKCRTDPwork shop

Also read

Use Facebook to Comment on this Post



Menu