02/4/19 12:38 PM

మోడీని టార్గెట్ చేసేందుకు చంద్రబాబు చేతికి మరో అస్త్రం

CM Chandrababu Target PM Modi

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోడీ మధ్య వార్ మరింత ముదిరింది. సెంటర్ వర్సెస్ స్టేట్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ దీక్షకు కూర్చోవడం దేశ రాజకీయాలను వేడెక్కించింది. దీదీ దీక్షకు పలువురు రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా మమతకు మద్దతుగా నిలిచారు.

 

ఏపీకి తీరని అన్యాయం చేశారని ప్రధాని మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబుకి.. మోడీని టార్గెట్ చేసేందుకు మరో అస్త్రం దొరికినట్టయ్యింది. ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారు. కేంద్రం ప్రతీకార రాజకీయాలకు ఇదే నిదర్శనం అని దేశానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని తీరుని ఎండగట్టేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు.

 

కోల్‌కతాలో జరుగుతున్న పరిణామాలపై పార్లమెంటులో ప్రస్తావించాలని టీడీపీ ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోకుండా.. నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారులు చేస్తున్న నిర్వాకంపై పార్లమెంటులో నిలదీయాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు పెట్టి బీజేపీ నేతలు ఆనందిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీకి లొంగిపోయిన వారిపై ఉన్న కేసులను ఎత్తివేస్తున్నారని… ఆ పార్టీని ఎదిరించిన వారిపై కేసులు పెట్టడం లేదా, పాత కేసులను తిరగదోడటం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేందుకు ప్రధాని మోడీ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించడం కూడా బీజేపీ కుట్రలో భాగమేనని చెప్పారు. ఇప్పుడు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. సీబీఐ తీరుపై మండిపడిన బాబు.. కేంద్రం చర్యలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు మోడీ-అమిత్ షా ద్వయం కంకణం కట్టుకుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. రాష్ట్రాలను భయపెట్టే చర్యలను మానుకోవాలని హితవు పలికారు.

 

మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశలు సన్నగిల్లడం వల్లే బీజేపీ ఇటువంటి పనులకు దిగజారుతోందని చంద్రబాబు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలా అశాంతి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మమతకు తామంతా అండగా ఉంటామని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మమతకు మద్దతిస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అవుతాయని చంద్రబాబు అన్నారు.

 

శారదా చిట్‌ఫండ్ స్కాంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు వెళ్లారు. అయితే వారిని కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు వారిని నిర్భందించారు కూడా. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారిస్తారని కోల్‌కతా పోలీసులు ఎదురుదాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. సీబీఐ అధికారులు వచ్చారని తెలుసుకున్న సీఎం మమత కోపంతో ఊగిపోయారు. కేంద్రం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ రాజ్యాంగ పరిరక్షణ పేరుతో సత్యాగ్రహ దీక్షకు కూర్చుకున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి ఆమె దీక్షలో ఉన్నారు.

Tags : amit shahap cm chandrababu naiduattack on jagancbi vs policekolkata cpmamata banerjee dharnapm modisaradha chit fund scamTDPys jaganysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu