09/6/19 9:24 PM

యాదాద్రి శిలలపై కేసీఆర్, కారు బొమ్మలు : వెల్లువెత్తిన విమర్శలు

CM KCR Pictures On Yadagirigutta Temple Pillars Controversy

తెలంగాణ ప్రాంతంలో కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం పునర్ నిర్మిస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. దేశంలోనే ప్రత్యేకంగా ఉండాలనే ఆలయాన్ని పునర్ నిర్మించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దగ్గరుండి మరీ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు బానే ఉంది. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే కేసీఆర్ సంకల్పాన్ని ప్రశంసించాల్సిందే. ఇకపోతే.. యాదాద్రి ఆలయం వివాదంలో చిక్కుకుంది. రాజకీయంగా దుమారం రేపుతోంది. యాదాద్రి రాతి స్తంభాలు, శిలలపై సీఎం కేసీఆర్ చిత్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కారు గుర్తు చిత్రాలనూ పొందుపరిచార. అలాగే టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను పొందుపరుస్తుండటం ఇప్పుడు వివాదానికి దారితీసింది. రాజుల కాలం నాటి నిర్మాణ రీతులను పుణికి పుచ్చుకుని ఆలయాన్ని తీర్చిదిద్దుతున్న ఈ ఆలయంలో శిల్పాల మీద కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు కేసీఆర్‌ కిట్‌, తెలంగాణ హరితహారం తదితరాలూ చెక్కడం విమర్శలకు తావిచ్చింది.

 

అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపై సీఎం కేసీఆర్‌ చిత్రం ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ప్రభుత్వ పథకాలు, తెలంగాణ పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, జాతీయ పక్షి నెమలి లాంటి చిహ్నాలు రాతి స్తంభాలపై కొలువుదీరాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. విపక్షాలు కేసీఆర్ సర్కార్ ని కడిగేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. ‘సారు.. కారు.. సర్కారు పథకాలు’ రాబోయే వెయ్యేళ్ల పాటు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఒకరు ఎద్దేవా చేస్తే.. ఎవరి చరిత్ర వారే రాసుకుంటే అది చరిత్ర కాదు.. ఎవరి శిల్పం వారే చెక్కుకుంటే అది శిల్పం కాదు అని మరొకరు ఎద్దేవా చేస్తున్నారు.

 

పురాతన ఆలయాలపై చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలకు సంబంధించిన అంశాలతో పాటు ఆ కాలపు నిర్మాణ రీతులు, అప్పట్లో వాడిన నాణేలు, వ్యవసాయ పద్ధతులు, ఆచరించిన ధర్మాలు, వినియోగించిన సాధనాలను రాతి స్తంభాలపై చెక్కడం ఆనవాయితీ. శతాబ్దాల కాలం నాటి చారిత్రక నిర్మాణాల గోడలు, రాతి స్తంభాలపై చిహ్నాలు, బొమ్మలు ఆనాటి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలోనూ ఇదే పద్ధతిని అవలంబించాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన స్తపతి ఆనందసాయి నేతృత్వంలో యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

 

అష్టభుజి ప్రాకార మండప రాతిస్తంభాలపై ప్రస్తుతం చలామణీలో లేని రెండు, మూడు, ఐదు, ఇరవై పైసల నాణేలు చెక్కించారు. వీటితో పాటు బతుకమ్మ పండుగను ప్రతిబింబించే చిత్రం, నాగలి దున్నే రైతు లాంటి బొమ్మలను చెక్కించారు. ప్రాకార మండపానికి దక్షిణం వైపున ఉన్న రాతి స్తంభాలపై తెలంగాణ ఆధునిక చరిత్ర, రాష్ట్ర అధికారిక చిహ్నంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను చెక్కుతున్నారు.

 

ఇంతవరకు బానే ఉన్నా.. ఆలయానికి రాజకీయ రంగు పులమడం ఏమీ బాగోలేదని అంటున్నారు. కేసీఆర్, పార్టీ గుర్తు చెక్కడం కరెక్ట్ కాదంటున్నారు. ఆలయంలోని రాతి స్తంభాలపై సంస్కృతి, సంప్రదాయాలతో పాటు రాజకీయ అంశాలను కూడా పొందుపరుస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఈ స్తంభాలపై కేసీఆర్‌ చిత్రం, టీఆర్‌ఎస్‌ గుర్తు, ప్రభుత్వ పథకాలు చెక్కాలని స్వయంగా సీఎం కేసీఆర్ సూచించారా? లేదా ఆలయ శిల్పులు అత్యుత్సాహంతో వాటిని ఏర్పాటు చేస్తున్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

 

దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సీఎం కేసీఆర్ ముఖచిత్రాన్ని శిల్పాలుగా చెక్కిన స్తంభాలను ఆలయంలో అమర్చడాన్ని ఖండించారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం తెలంగాణలో భవ్యమైన గుడి అని.. అది ఏ పార్టీదీ కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆలయ స్తంభాలపై కేసీఆర్, కారు పార్టీ చిత్రాలను చెక్కినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయానికి తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అది టీఆర్‌ఎస్ పార్టీది కాదన్నారు. గుడి అభివృద్దికి టీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు పెట్టడం లేదన్నారు. ప్రజల సొమ్ముతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని.. అటువంటప్పుడు… ఆలయ స్తంభాలపై కేసీఆర్ చిత్రం, కారు బొమ్మ పెట్టడం తప్పు అన్నారు. కారు బొమ్మే కాదు.. అసలు ఏ పార్టీ బొమ్మ కూడా ఉండకూడదు అని స్పష్టం చేశారు. ఇలాంటి పనులు సిగ్గుచేటు అన్నారు.

 

ఒకవేళ యాదాద్రి స్తంభాలపై టీఆర్‌ఎస్ పార్టీ బొమ్మ పెడితే.. అదే విధంగా అన్ని పార్టీల చిహ్నాలు చెక్కించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇవాళ యాదాద్రిలో చేసింది చాలా తప్పు అన్నారు. వెంటనే ఆ చిత్రాలు తీసేయకపోతే ప్రజలతో కలిసొచ్చి మేమే తొలగిస్తాము అని రాజా సింగ్ హెచ్చరించారు. మొత్తంగా ఆధ్యాత్మికం వెల్లివిరియాల్సిన చోట రచ్చ రచ్చ జరుగుతోంది. యాదాద్రి శిల్పాల కేసీఆర్ చిత్రం వివాదానికి దారి తీసింది. మరి దీనిపై సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇది తప్పు అని అంటారా లేక ఒప్పు అని సమర్థిస్తారో చూడాలి.

Tags : controversyengravedkcr photopillarsTelanganatempletrs symbloyadadri

Also read

Use Facebook to Comment on this PostMenu