01/4/19 1:10 PM

వైసీపీలోకి పవన్ ప్రాణమిత్రుడు.. కారణం అదేనా

Comedian Ali To Join YSR Congress Party

ఊహాగానాలకు తెరపడింది. అనుమానాలు తొలగిపోయాయి. వైసీపీలోకి వెళ్లడం కన్ఫమ్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 9న ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో అలీ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. గతేడాది డిసెంబర్ 28న వైసీపీ అధినేత జగన్‌ను అలీ ఎయిర్‌పోర్టులో కలిశారు. దీంతో వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. అలీ కూడా ఈ వార్తల్ని తోసిపుచ్చలేదు. చివరకు అదే నిజం అయ్యింది.

 

2014లో కూడా టీడీపీ నుంచి పోటీ చేయాలని అలీ ఆశపడ్డారు. కానీ అప్పటి రాజకీయ పరిణామాలతో కుదరలేదు. తర్వాత జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. పవన్‌తో కలిసి నెల్లూరులో రొట్టెల పండుగకు వెళ్లడంతో.. జనసేన తరపున అలీ పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. రాజమండ్రి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. చివరకు అలీ జగన్‌కు జైకొట్టారు. అంతేకాదు పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధమని ప్రకటించారు. మరి పుట్టి పెరిగిన రాజమండ్రి నుంచి బరిలోకి దిగుతారా లేదా గుంటూరు నుంచి పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అలీని పార్టీలో చేర్చుకునేందుకు జగన్ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది.

 

మెగా ఫ్యామిలీతో అందునా పవన్ కళ్యాణ్‌తో అలీకి మంచి రిలేషన్‌షిప్ ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ ఉన్నాడు. తన సినిమాలో అలీ లేకుంటే ఏదో వెలితి ఉంటుందని పాత్ర ఉన్నా లేకపోయినా అలీ కోసమే ఓ ప్రత్యేక రోల్ క్రియేట్ చేస్తామని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. అలీ అంటే తనకు ఒక రకమైన సెంటిమెంట్ అని కూడా చెప్పేవారు. ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. దీంతో జనసేన పార్టీ పెట్టగానే అలీ అందులో చేరతారనే వార్తలొచ్చాయి.

 

అయితే వైసీపీలో చేరాలని అలీ తీసుకున్న నిర్ణయం ఇటు సినీ అటు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అలీ వైసీపీలో చేరాలనే నిర్ణయం వెనుక లెక్కలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి జగన్, పవన్ సహకరించుకోవాల్సి వస్తే వారి మధ్య అలీ వారధిగా పనిచేసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఇందుకు కారణం పవన్‌తో అలీకి ఉన్న సానిహిత్యమే అంటున్నారు. మరి అలీ చేరిక ఎవరికి ఎంతవరకు లాభం చేకూరుస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

మొత్తంగా వైసీపీలో సినీ గ్లామర్ పెరుగుతోందని చెప్పాలి. ఇప్పటికే ప్రమఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృథ్వీ, కృష్ణుడు, భానుచందర్ జగన్‌కు మద్దతు తెలిపారు.

Tags : ali with jaganap politicscomedian ali to join ysrcpjanasenapawan kalyan

Also read

Use Facebook to Comment on this PostMenu