12/2/18 8:55 PM

కాంగ్రెస్ ఓడిపోతుంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Congress Defeat, CM Chandrababu Tongue Slip Again

ఆయన అపార రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. రాజకీయాల్లో సీనియర్ పొలిటిషియన్. అడ్మినిస్ట్రేషన్‌లో మంచి పట్టున్న లీడర్. ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవాన్ని గడించారు. ప్రస్తుతం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి స్పీచ్ ఇస్తే ఎలా ఉండాలి. మాటలు తూటాల్లా పేలాలి. డైలాగులు బుల్లెట్‌లా దిగాలి. మాటలతో ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేయాలి. విమర్శనాస్త్రాలతో విరుచుకుపడాలి. కానీ ఆయనేమో పదే పదే తడబడుతున్నారు. నోరు జారి చులకన అవుతున్నారు. ఏదో చెప్పబోయి మరేదో చెప్పేసి అభాసుపాలవుతున్నారు. తాను కన్‌ఫ్యూజ్ అవ్వడమే కాకుండా పార్టీ శ్రేణులను కూడా కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో చెప్పలేదు కదూ.. ఆయనే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

 

అవును.. బాబుగారు మళ్లీ తడబడ్డారు. ఆ వెంటనే పొరపాటుని సరిదిద్దుకున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం అనే సంగతి బాబుగారు మర్చిపోయారో? మరో కారణమో కానీ.. ”కాంగ్రెస్ ఓడిపోతుంది” అని అనేశారు. ఆ వెంటనే తప్పుని సరిదిద్దుకున్నారు. బీజేపీ ఓడిపోతుంది అని చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరఫున ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. రోడ్ షోలో ప్రసంగించారు. ఈ సమయంలో బీజేపీ ఓడిపోతుందని చెప్పడానికి బదులు కాంగ్రెస్‌ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తప్పుని సరిదిద్దుకున్నారు. కాగా, చంద్రబాబు నోరుజారిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

 

తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, రోడ్‌షోలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఓడిపోతుందని చంద్రబాబు అనడం విశేషం. ‘‘ఆరు నెలల్లో మళ్లీ పార్లమెంటు ఎన్నికలు వస్తాయి. రేపు మీరంతా ఓట్లేసి ప్రజాకూటమిని గెలిపిస్తే.. సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి..’’ అనేసిన చంద్రబాబు ఆ వెంటనే నాలుక కరుచుకున్నారు. ఆ వాక్యం పూర్తి కాకముందే తన మాటలో దొర్లిన తప్పుని గ్రహించి సరిదిద్దుకున్నారు. ‘‘బీజేపీ ఓడిపోయి.. కాంగ్రెస్‌తో కలిసి కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని మళ్లీ కవర్ చేశారు..

 

ఇక ఇటీవల ఖమ్మంలో మహాకూటమి ఎన్నికల ప్రచార సభలోనూ చంద్రబాబు ఇలాంటి మిస్టేకే చేశారు. తెలంగాణ జన సమితి అనబోయి.. జనసేన అనేశారు. తెలంగాణలో జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు. తమ కూటమిలో తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, జనసమితి కూడా ఉందని చెప్పబోతూ.. పుసుక్కున జనసేన అనేశారు. అయితే వెంటనే తన తప్పుని గ్రహించిన చంద్రబాబు.. తెలంగాణ జనసేన అని చెప్పి తన మాటను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. తమ కూటమిలో ఉన్న పార్టీ పేరే తెలియకపోతే ఎలా? అని బాబుగారిపై విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చంద్రబాబుని ఎంతగా కలవరపెడుతుందో దీన్ని బట్టి అర్థం అవుతుందని సెటైర్లు కూడా పేలాయి.

 

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడింది. అలాంటిది వైరాన్ని, సైద్దాంతిక విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారు. దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యాంటీ బీజేపీ కూటమి ఏర్పాటు చేస్తానంటూ చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారు. పైకి కలిశారు కానీ.. లోన మాత్రం బాబుగారికి ఇంకా కాంగ్రెస్ అంటే కోపంగానే ఉన్నట్టు ఉంది. అందుకే.. కాంగ్రెస్ ఓడిపోతుంది.. అని చంద్రబాబు అనేసి ఉంటారు అని నెటిజన్లు అనుకుంటున్నారు.

 

మొత్తంగా కీలక సభల్లో టంగ్ స్లిప్ కావడం బాబుగారికి కామన్ అయిపోయింది. అసలు ఈ బాబుగారికి ఏమైందబ్బా? అని జనాలు చర్చించుకుంటున్నారు. కీలక సమయాల్లో ఇలా నోరు జారి పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఏం మేసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.

Tags : ap cmchandrababu mistakechandrababu naiduchandrababu tongue slipcongress defeatTDPtelangana elections

Also read

Use Facebook to Comment on this PostMenu