05/18/19 8:31 AM

చంద్రగిరి రీ-పోలింగ్ పై చంద్రబాబు నిప్పులు

Conspiracy Behind Chandragiri Re Polling

ఏపీలో రిజల్ట్స్ ముందు హైడ్రామా నడుస్తోంది. ఫలితాలు రావడానికి కొన్ని రోజుల ముందు రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కారణం రీపోలింగ్. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 19వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. దీనిపై టీడీపీ, వైసీపీ మధ్య వివాదం నడుస్తోంది.

 

రీపోలింగ్ పై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. రీపోలింగ్ పై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కుట్ర ఉందని, ఈసీకి లంచం ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ఫిర్యాదు చేయడంతోనే ఈసీ రీపోలింగ్ కు ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు. ఎన్నికలు ముగిసిన నెల రోజుల తర్వాత వైసీపీ చెప్పిందని రీపోలింగ్ నిర్వహించడం కరెక్ట్ కాదని అంటున్నారు. రీ పోలింగ్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. రీ పోలింగ్ పై ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోకుండా వైసీపీ ఫిర్యాదులను మాత్రమే ఈసీ పరిగణలోకి తీసుకుంటోందని అరోరా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇలాంటి ఎన్నికల సంఘాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. రీ పోలింగ్ పై ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. వైసీపీ ఫిర్యాదు చేస్తే 5 చోట్ల రీ పోలింగ్ ఎలా నిర్వహిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన నెల రోజుల తర్వాత రీ పోలింగ్ కు ఎలా నిర్ణయం తీసుకుంటారు అని సీఈసీని అడిగారు. ఇది అన్యాయం, అక్రమం అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

 

పోలింగ్ జరిగిన తర్వాత రోజు రిటర్నింగ్ అధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా రీపోలింగ్ ప్రకటన చేస్తారని, కానీ, నెలరోజుల తర్వాత ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేస్తే ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్ కు ప్రకటన చేయడం దారుణమని చంద్రబాబు అన్నారు. కొన్ని చోట్ల రీపోలింగ్ జరపాలని టీడీపీ విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయాలను చూశానని, కానీ ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. మోడీ, అమిత్ షా ల కనుసన్నల్లోనే ఈసీ నడుచుకుంటోందని, ఈసీ పనితీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిరావడం విచారించాల్సిన విషయం అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

చంద్రగిరిలో రీపోలింగ్ జరగడం వెనుక కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి ధర్మారెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ ఆరోపిస్తోంది. ధర్మారెడ్డిపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఒత్తిడి మేరకే రీపోలింగ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ధర్మారెడ్డి ఈసీ కార్యాలయానికి వచ్చినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, ఆయన ఈసీకి లంచం ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డికి ధర్మారెడ్డి చాలా దగ్గరని టీడీపీ ఆరోపిస్తోంది. ధర్మారెడ్డి ఎన్నికల సంఘాన్ని ఎన్నిసార్లు కలిశారు… ఏఏ అధికారులతో ఆయన ఎన్నిసార్లు మాట్లాడారు… ఎవరెవరికి ఎంత లంచాలు ఇచ్చారనే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని టీడీపీ నేతలు చెప్పారు.

 

చంద్రగిరి రీ పోలింగ్ అంశం ఏపీని కుదిపేస్తోంది. తాము చేసిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా వైసీపీ ఫిర్యాదులపై వెంటనే ఈసీ స్పందిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ సచివాలయంలో టీడీపీ నేతలు సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంని కలిశారు. నరసరావు పేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 19 కేంద్రాల్లో రీ-పోలింగ్‌కు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై తాము ఇప్పటికే ఈసీని కోరినా.. తమ విజ్ఞప్తిపై ఈసీ ఇంతవరకూ స్పందించలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూస్తుంటే వైసీపీ ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడుకుని సీఎస్ కు ఫిర్యాదు చేసినట్లు అనిపిస్తోందని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో దశలవారీగా రీ-పోలింగ్ జరిపిన దాఖలాలు లేవని గుర్తుచేశారు.

 

రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించడం వెనుక బీజేపీ, వైసీపీ కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల రోజే నియోజకవర్గంలో చాలా ఈవీఎంలు పని చేయలేదని, వాటి మరమ్మతు కోసం ఆరు గంటల సమయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఒక ఈవీఎం బాగు చేయడానికి అన్ని గంటలు అవసరమా? అని ప్రశ్నించారు. ఇదంతా కుట్రలో భాగంగానే భావించాలని అంటున్నారు.

 

రీపోలింగ్ వెనుక కుట్ర ఉందని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. రీపోలింగ్ అంటే చంద్రబాబుకి, టీడీపీకి ఎందుకు భయమో చెప్పాలని అన్నారు. చంద్రబాబు గారూ, రీపోలింగ్ అంటే మీకెందుకు భయం? రీపోలింగ్ జరపడం అప్రజాస్వామికమా? లేక, రిగ్గింగ్ చేయడం అప్రజాస్వామికమా? చంద్రగిరిలో దళితులను ఓటెయ్యనివ్వకుండా వారి ఓట్లన్నీ మీరే వేయడం అప్రజాస్వామికమా? లేక, చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీ అరాచకాలకు అడ్డుపడడం అప్రజాస్వామికమా? అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. చంద్రగిరి అసెంబ్లీ స్థానంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రజాస్వామికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

Tags : BJPchandrababuchandragirielection commissionre pollingsunil aroraTDPYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu