08/17/19 12:02 PM

కరకట్టకు వరద ముప్పు రావడానికి కారణం ఎవరు? దీని వెనుక బిగ్ స్కెచ్ ఉందా?

Conspiracy To Change AP Capital

ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. చంద్రబాబు నివాసం చుట్టూ రాజకీయం నడుస్తోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడం, కరకట్టను ఆనుకుని ఉన్న నిర్మాణాలరే వరద ముప్పు పొంచి ఉంచడం హాట్ టాపిక్ గా మారింది. ఉండవల్లిలో కరకట్టను ఆనుకుని ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నివాసాన్ని కూడా వరద నీరు తాకింది. వరద ప్రవాహం ఇలానే పెరిగితే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక చంద్రబాబు ఇంటి విజువల్స్ ను డ్రోన్ కెమెరాలతో షూట్ చెయ్యడం దుమారం రేపింది. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం జరుగుతోంది. చంద్రబాబుకి ప్రాణహాని తలపెట్టేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తే.. అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.

 

చంద్రబాబుకి ప్రాణహాని తలపెట్టడంతో పాటు ఏపీ రాజధానిని మార్చేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. జగన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి వరద ముప్పు వెనుక అధికార పార్టీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని, రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారని.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపణలు చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం సీఎం జగన్ కి ఇష్టం లేదని.. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని ఉమా విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల దగ్గర 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారాయన. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఆరోపించారు.

 

చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని దేవినేని ఉమ విమర్శించారు. వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి సీఎం ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించారాయన.

 

ఇక్కడ వర్షం పడలేదని.. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదని ఉమా అన్నారు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్ అని విమర్శించారు. రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారని, శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారని ఉమా విమర్శలు గుప్పించారు.

 

సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. కావాలనే ప్రకాశం బ్యారేజి గేట్లు ముందే ఎత్తలేదని కొందరు విమర్శిస్తున్నారు. “బ్యారేజి నిల్వ 3 టీఎంసీలు అయితే అందులో 1.5 టీఎంసీ పూడిక పోతే మిగిలేది 1.5 టీఎంసీ సామర్ధ్యం. భారీ వరద వస్తుందని ముందే తెలుసు. నాగార్జున సాగర్ నిండ బోతున్నది అని తెలుసు అందుకే గేట్లు అన్ని ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు, దిగువన ఉన్న పులిచింతల కూడా నిండుకుండలా ఉంది అక్కడ నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఈ విషయం వారం రోజులు గా అందరికి తెలుసు. అధికారులకు ముందే తెలుసు. కానీ ఇప్పటికే పట్టిసీమ జలాలతో నిండుగా ఉన్న ప్రకాశం బ్యారేజి గేట్లు నిన్నటి వరకు ఎందుకు ఎత్తలేదు? నీరు కిందకి ఎందుకు వదలలేదు.? రోజుకి 4 నుంచి 6 లక్షల క్యూసెక్ ల నీటిని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందు గానే ప్రకాశం బ్యారేజీని కొద్దిగా ఖాళీ చేసి పైనుంచి వచ్చే నీటిని వచ్చినది వచ్చినట్టుగా కిందకి వదిలితే బ్యారేజి మీద వత్తిడి తగ్గేది. ముంపు ఉండేది కాదు. కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినాపర్లేదు అని రెండు రోజులు ఆలస్యంగా గేట్లు ఎత్తిన కారణం కేవలం రాజకీయం. పైనుంచి వస్తున్న భారీ వరద కారణంగా ముంపు కలగాలి. ఆ ముంపుకి లోతట్టు ప్రాంతాలు మునగాలి. ప్రజావేదిక స్థలం, చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపుకి గురి కావాలి. చూసారా మునిగిపోయే ప్రాంతంలో రాజధాని కట్టారని. చంద్రబాబు ఉంటున్న ఇల్లు కట్టిన ప్రజావేదిక మునిగి పోయింది అందుకే రాజధాని ఇక్కడ వద్దు అన్నది.. అనే విష ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది” అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 

“ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ప్రభుత్వం ఎదురు చూసింది. కానీ, ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ఏరియా ని టచ్ చేయలేవు. ఈలోపు కేంద్ర జల శాఖ నుండి.. బ్యారేజీ గేట్లు ఎత్తనందుకు అక్షింతలు పడ్డాయి. ఇంత క్రూరమైన ఆలోచన ఎందుకు? అమరావతి కి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేయాలి. అమరావతి మునగాలంటే ఇంకా 23 అడుగులు మట్టం పెరగాలి.. అది జరిగే పని కాదు” అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 

చంద్రబాబు ఇల్లు మునిగిపోవడానికి, రాజధాని మార్చేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. అక్రమాలు, అన్యాయాలు, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా సహా టీడీపీ నేతలవి నరం లేని నాలుకలని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరిస్తే చంద్రబాబు భద్రతకు ముప్పు అంటూ గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరద ఉధృతికి ఒకవేళ చంద్రబాబు ఇల్లు మునిగిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ నేతలు విమర్శలు చేసేవారన్నారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద పరిస్థితిని తెలుసుకోవడానికి డ్రోన్‌ కెమెరా వినియోగిస్తే టీడీపీ నేతలకు వచ్చిన బాధ ఏమిటని ప్రశ్నించారు.

 

టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టు శ్రీశైలంతో సహా మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిన తర్వాతే కిందకు నీళ్లు వదలడం మొదలుపెట్టి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి 12 లక్షల క్యూసెక్కులను కిందకు వదలాల్సి ఉంటుందని, అదెంత ప్రమాదకరమో తెలియదా అని నిలదీశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ఇంట్లో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారా? వరద ప్రవాహాన్ని అంచనా వేసేందుకు డ్రోన్లతో చిత్రీకరిస్తే ఆయనకు ఎందుకు అంత ఉలికిపాటు అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

 

రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారడంతో రైతులు, ప్రజలు ఆనందంగా వేడుకలు చేసుకుంటుంటే, టీడీపీ నేతలు మాత్రం ఏడుపు మొహాలు వేసుకుని నిందలు వేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న మాజీ సీఎం చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని, సామాజిక బాధ్యతతో వ్యవహరించి వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.

Tags : ap capitalchandrababuchandrababu housecm jaganconspiracydrone camerasfloodkrishna riverprakasam barriage

Also read

Use Facebook to Comment on this PostMenu