08/16/19 8:02 PM

జగన్ ప్రభుత్వం ప్లాన్ ఏంటి? చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరాల కలకలం

Conspiracy To Kill Chandrababu

ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వరదల ప్రభావం రాజకీయాలపైనా పడింది. వరదలు అధికార, ప్రతిపక్షం మధ్య చిచ్చు రాజేసింది. పొలిటికల్ వార్ కి తెరలేపింది. వరదలకు రాజకీయాలకు సంబంధం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ.. సంబంధం ఉంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణా నది కరకట్టను ఆనుకుని ఉన్న నిర్మాణాలకు వరద ముంపు ఏర్పడింది. వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో.. ఆ నీరు నిర్మాణాల్లోకి ప్రవేశిస్తోంది. ఈ నిర్మాణాల్లో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం కూడా ఉండటం రాజకీయ దుమారానికి కారణమైంది. వరద నీరు చంద్రబాబు నివాసాన్ని కూడా తాకింది. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస చుట్టూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికార పక్షం నాయకులు చంద్రబాబు నివాసాన్ని టార్గెట్ చేశారు. అది అక్రమకట్టడం అని దాన్ని కూల్చేయాలని చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఊహించనిరీతిలో వరదలు వచ్చాయి. దీంతో చంద్రబాబుని ఇరుకున పెట్టేందుకు జగన్ పార్టీ నేతలకు మరింత బలం వచ్చింది.

 

తాజాగా జరిగిన పరిణామం వైసీపీ, టీడీపీ నేతల మధ్య చిచ్చు రాజేసింది. చంద్రబాబుని చంపేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు మట్టుబెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు, డ్రోన్ కెమెరాలతో కనిపించడం.. చంద్రబాబు నివాసాన్ని వీడియోలు తీయడం కలకలం రేపింది.

 

ప్రస్తుతం లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు కానీ ఆయన కుటుంబసభ్యలు కానీ లేరు. ఈ సమయంలో ఆ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు డ్రోన్లతో ఫోటోలు, వీడియోలు తీయడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు ఇంటి దగ్గరికి వచ్చారు. నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు ఇంటిని ఫోటోలు, వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ ముఖ్య నేతలు సైతం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

 

చంద్రబాబు ఇంటి దగ్గర డ్రోన్ వ్యవహారం తెలిసి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వీరికి పోటీగా వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ విషయం తెలుసుకున్న టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్, వర్ల రామయ్య, ఆలపాటి రాజా అక్కడికి చేరుకుని వైసీపీ శ్రేణుల అత్యుత్సాహంపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇది తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కాగా, చంద్రబాబు ఇంటిపై డ్రోన్లతో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించడం టీడీపీ శ్రేణుల్లో పలు అనుమానాలకు దారితీసింది. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటి? మాజీ సీఎం చంద్రబాబుని మట్టుపెట్టే కుతంత్రమా? అనే సందేహాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నార. చంద్రబాబు ఇంటిపై డ్రోన్లను ఉపయోగించిన ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం అక్కడికి వచ్చారు. దీంతో ఆందోళన ఉధృతం కాగా పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు తరిమికొట్టారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరి కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రోన్ల సాయంతో చంద్రబాబు ఇంటిని వీడియోలు ఫోటోలు తీయడంపై తమ్ముళ్లు భగ్గుమంటున్నారు.

 

చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు ఇంటిని డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించాలని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఇదంతా భౌతికంగా నష్టం కలిగించాలనే ప్రయత్నమే అని విమర్శలు చేశారు. చంద్రబాబు ఇంటిపై బాంబులు వేయాలని చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ఇంట్లో పనిచేసే కిరణ్‌కు చంద్రబాబు ఇంటికి డ్రోన్లను పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాడని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వరద పరిస్థితులను చంద్రబాబు ఇంటి నుండి పర్యవేక్షిస్తారా అని ప్రశ్నించిన వర్ల రామయ్య చంద్రబాబు ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.

 

చంద్రబాబు ఇంటి మీద డ్రోన్ కెమెరా ఉయోగించటంపై అక్కడి సెక్యూరిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే తెలుగు యువత నేతలు రంగంలోకి దిగారు. చంద్రబాబు నివాసం హై సెక్యూరిటీ జోన్ అని..అనుమతి లేకుండా డ్రోన్ ఎందుకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. డ్రోన్ కెమెరా వినియోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ నివాసంలో ఉండే కిరణ్ అనే వ్యక్తి ఆదేశాల మేరకే తాము డ్రోన్ వినియోగించామని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇంతలోనే ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది. తామే డ్రోన్ వినియోగించి..నీటి లెక్కలు చెప్పాలని కోరామని..వరద పరిస్థితి అంచనా కోసమే వినియోగించామని స్పష్టం చేసింది.

 

టీడీపీ నేతల వెర్షన్ ఇలా ఉంటే.. అధికార పార్టీ నేతల వెర్షన్ మరోలా ఉంది. చంద్రబాబుకి ప్రాణహాని తలపెట్టేందుకు కుట్ర జరుగుతోందన్న టీడీపీ నేతలు ఆరోపణలను వైసీపీ నేతలు కొట్టిపారేశారు. అసలు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేవన్నారు. ఆ అవసరం కూడా తమకు లేదన్నారు. నీటి లెక్కలు తెలుసుకునేందుకే డ్రోన్ కెమెరాలు వాడామని వివరించారు. ఈ మాత్రం దానికే టీడీపీ నేతలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డ్రోన్ కెమెరాలతో వీడియో తీస్తే.. ఎక్కడ చంద్రబాబు అక్రమాలు బయటపడతాయోననే భయంతోనే టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని వైసీపీ నేతలు సీరియస్ అయ్యారు. డ్రోన్ కెమెరాల వెనుక ఎవరి హస్తం లేదన్నారు. ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు జరగడం లేదని స్పష్టం చేశారు.

 

మొత్తంగా మరోసారి రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నిజంగా దీని వెనుక సీఎం జగన్ హస్తం ఉందా? చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందా? లేక నిజంగానే నీటి లెక్కల కోసం డ్రోన్ కెమెరాలు వాడారా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

 

Tags : chandrababuchandrababu houseconspiracydronefloodkarakattakillys jaganysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu