11/12/18 11:30 AM

ఓట్ల కోసం చంద్రబాబు దిగజారిపోయారా..?

Kidari Sravan Kumar Minister Post

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబువి చౌకబారు రాజకీయాలు అని, ఓట్ల కోసం దిగజారిపోయారని కొందరు విమర్శిస్తుంటే.. చంద్రబాబు చేసిన దాంట్లో తప్పేమీ లేదని మరికొందరు అంటున్నారు. ఇంతకీ వివాదానికి దారితీసిన విషయం ఏంటంటే ఏపీ కేబినెట్ విస్తరణ. మంత్రివర్గాన్ని విస్తరించిన చంద్రబాబు ఇద్దరు కొత్తవాళ్లను కేబినెట్‌లోకి తీసుకున్నారు. అందులో ఒకరు సీనియర్ నేత ఫరూక్ కాగా మరొకరు మావోయిస్టుల చేతిలో చనిపోయిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ కుమార్.

 

ఫరూక్ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ కిడారి శ్రవణ్ కుమార్‌కు మంత్రిపదవి ఇవ్వడంపైనే కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అసలు ఏ అర్హత ఉందని కిడారి శ్రవణ్‌కు మంత్రిపదవి ఇచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారు. తండ్రిని మావోయిస్టులు హత్య చేశారనే ఒకే ఒక్క సాకుతో ఎలాంటి అర్హత, అనుభవం లేకపోయినా కొడుక్కి మంత్రి పదవి ఇవ్వడం అత్యంత చౌకబారు రాజకీయం అని విమర్శిస్తున్నారు. కిడారి శ్రవణ్ ఏమైనా ఎమ్మెల్యేనా? ఎమ్మెల్సీనా? పోనీ సీనియర్ నాయకుడా? కనీసం టీడీపీ కార్యకర్తా? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసమే చంద్రబాబు ఇలా చేశారని మండిపడుతున్నారు. తమది ఆదివాసీ సానుకూల ప్రభుత్వం అనే మేసేజ్ పంపి తద్వారా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఇలా దిగజారిపోయారని విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగుని ప్రజలు గమనిస్తున్నారని.. వాళ్లు తీసుకునే నిర్ణయం ఏది ప్రజల కోసమో ఏది ఓట్ల కోసమో తెలుసుకోలేని అమాయకులు అనుకుంటే పొరపాటు అవుతుందని హెచ్చరిస్తున్నారు. మరీ ఇంత చౌకబారు రాజకీయాలు అత్యంత ప్రమాదకరం అంటున్నారు.

 

అదే సమయంలో కిడారి శ్రవణ్‌కు మంత్రిపదవి ఇవ్వడం తప్పేమీ కాదనే వారూ లేకపోలేదు. శ్రవణ్ విద్యావంతుడు అని వారు చెబుతున్నారు. శ్రవణ్ ఐఐటీ చదివాడని, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడని వివరిస్తున్నారు. అంతేకాదు అతడికి ఎలాంటి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ లేదంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోలిస్తే చాలామందికంటే కిడారి శ్రవణ్ బెటర్ అనేవాళ్లూ లేకపోలేదు. ఇక పరిపాలన అనుభవం విషయానికి వస్తే.. అనుభవం అనేది ఏదో ఒకచోట మొదలవ్వాల్సిందే కదా అని బదులిస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయ నేతల్లో ఎంతమంది ప్రముఖులు తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి కొనసాగట్లేదని ప్రశ్నిస్తున్నారు. పైగా కిడారి తండ్రి ఎమ్మెల్యే అని, ఆ కుటుంబం ఆ పార్టీలోనే ఉందని.. తండ్రొక పార్టీ, తల్లొక పార్టీ తనొక పార్టీలో లేరని పాయింట్ అవుట్ చేస్తున్నారు. సీనియర్ అయితేనో, ఎమ్మెల్యే అయితేనో మంత్రి పదవి ఇవ్వాలి అనే రూల్ ఎక్కడా లేదంటున్నారు.

 

ఇక కొంతమంది గతాన్ని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు ఇలా చేయడం కొత్తేమీ కాదంటున్నారు. గతంలో పరిటాల రవి భార్య పరిటాల సునీత, భూమానాగిరెడ్డి కూతురు అఖిలప్రియ విషయంలోనూ ఇదే జరిగిందంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వారిద్దరికి మంత్రిపదవులు కట్టబెట్టారని చెబుతున్నారు.

 

మొత్తంగా చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టేవారు ఎంతమంది ఉన్నారో.. సమర్థించే వారూ అంతమందే ఉన్నారు. చంద్రబాబు నిర్ణయం కరెక్టా? కాదా? అనేది కాలమే నిర్ణయించాలి.

Tags : ap cm chandrababu naiducabinet postkidari sarveswara raokidari sravan kumarTDPvote bank politics

Also read

Use Facebook to Comment on this Post



Menu