10/4/19 8:18 PM

ఏపీ సీఎం జగన్ మతంపై వివాదం

Controversy On AP CM Jagan Religion

ఏపీ సీఎం జగన్ ది ఏ మతం? ఆయన హిందువా? కాదా? సీఎం జగన్ ఏమని చెప్పుకుంటున్నారు? ఏపీలో రాజకీయం కాని అంశం ఏదీ లేదు. నిత్యం ఏదో ఒక టాపిక్ పొలిటికల్ యాంగిల్ తీసుకుంటోంది. ఇప్పుడు సీఎం జగన్ మతం గురించి చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే. మ్యాటర్ ఏంటంటే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించకుని సీఎం హోదాలో శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు జగన్. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. దీన్ని ప్రతిపక్షం వాళ్లు అస్త్రంగా చేసుకున్నారు. సీఎం జగన్ మతం గురించి డిస్కషన్ కు తెరలేపారు.

 

జగన్ హిందువు కాదు క్రిస్టియన్ అనేది చంద్రబాబు వాదన. ఓ క్రిస్టియన్.. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలిస్తారా? అని చంద్రబాబు మండిపడుతున్నారు. హిందువు కాని వ్యక్తి పట్టువస్త్రాలు ఇవ్వడం హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది అనేది చంద్రబాబు వాదన. తిరుమల ఆలయంలో ప్రవేశానికి అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. క్రిస్టియన్‌గా చెప్పుకుంటున్న సీఎం జగన్‌ తిరుమల శ్రీవారికి పట్టుస్త్రాలు సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. తిరుమల వేంకటేశ్వరస్వామి కంటే జగన్ అతీతుడా అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో అసలు తిరుమలలో ఏం జరిగింది…జగన్ నిబంధనలను ఉల్లఘించారా..ఇవి రాజకీయ ఆరోపణలా అనే చర్చ మొదలైంది.

 

గతంలో రాజశేఖరెడ్డి పైనా…ఇప్పుడు జగన్ పైనా టీడీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. కాగా, జగన్ పలుమార్లు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అక్కడి సంప్రదాయలకు అనుగుణంగా వ్యవహరించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో శ్రీవారిని భక్తుడిగా వైఎస్ కొలిచేవారని..ఇప్పుడు జగన్ సైతం ప్రతీ పనికి ముందు శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాతే ఆరంభిస్తున్నారని చెప్పుకొచ్చారు.

 

ఇది ఇలా ఉంటే.. సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి మరణించి ఏడాది కూడా కాలేదని..రక్త సంబంధీకులు మరణిస్తే ఏడాది వరకు దేవుడికి సంబంధించిన పవిత్ర ఉత్సవాల్లో పాల్గొనకూడదనే చర్చ సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఏడాది పూర్తి కాకుండానే శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు అందించటం సరైనదేనా అనే డిస్కషన్ తీసుకొచ్చారు.

 

కాగా, జగన్ తల్లి విజయమ్మ.. ఎన్నికల ప్రచారం సమయంలో చేతిలో బైబిల్ పెట్టుకుని తిరిగారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ సోదరి భర్త అనిల్ క్రిస్టియన్ అని, మత ప్రబోధకుడు అని చెబుతున్నారు. వారు హిందువులే అయితే.. ఇలా ఎందుకు చేస్తారని అడుగుతున్నారు. జగన్ హిందువు కాదు.. క్రిస్టియన్ అని వాదిస్తున్నారు. ఒక వేళ హిందువే అయితే..ఈ విషయాన్ని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు, తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు.

 

అసలు జగన్ ది ఏ మతం అని అంశాన్ని టీడీపీ నేతలు హైలైట్ చేశారు. జగన్ ని ఇరుకునపెట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. రాజకీయ లబ్ది కోసం టీడీపీ నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు బీజేపీ మత పరమైన అంశాలతో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుండగా.. మరోవైపు టీడీపీ సైతం ఇటువంటి అంశాలను ప్రస్తావించటం ద్వారా జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టే వ్యూహాలు అమలు చేస్తోంది.

Tags : ap cm jagancastechandrababuchristianHINDURELIGIONtirumala

Also read

Use Facebook to Comment on this Post



Menu