06/28/19 7:29 PM

అన్నంత పని చేసిన సీఎం జగన్ : చంద్రబాబు ఇంటికి కూల్చివేత నోటీసులు

Crda Issue Notices To Chandrababu House

ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నంత పని చేశారు. మాజీ సీఎం చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నారు. అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్న జగన్.. ముందుగా తన ప్రతాపం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చూపించారు. కృష్ణా నది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక అక్రమకట్టడం అని తేల్చిన ప్రభుత్వం.. దాన్ని కూల్చేసింది. ఇప్పుడు చంద్రబాబు ఇంటిపై గురి పెట్టింది. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమకట్టడం అని తేల్చిన సీఆర్డీఏ అధికారులు.. ఆ ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు. లింగమనేని రమేష్ పేరుతో నోటీసులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం చంద్రబాబు ఇంటికి వెళ్లిన సీఆర్డీఏ అధికారులు ఇంటి గోడకు నోటీసులు అంటించారు.

 

అధికారులు వారం రోజులు టైమ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా ఎలా నిర్మిస్తారని నోటీసుల్లో ప్రశ్నించారు. దీని వెనుక కారణాలు ఏంటీ.. ఎందుకు కరకట్టపై కట్టారనేది కూడా వెల్లడించాలని కోరారు. వన్ వీక్ లో వివరణ ఇవ్వాలని.. లేదంటే భవనాలు తొలగిస్తామని తేల్చి చెప్పారు. చంద్రబాబు నివాసానికి అంటించిన నోటీసుల్లో.. అనుమతి లేకుండా 10 తాత్కాలిక షెడ్లు నిర్మించారని.. చట్టపరమైన అనుమతి లేకుండా మొదటి అంతస్తు, గదుల నిర్మాణం జరిగిందని వెల్లడించారు. అలాగే భవనం, స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్ నిర్మాణంపైనా అభ్యంతరాలు తెలిపారు. నదికి 100 మీటర్లలోపు ఈ నిర్మాణం ఉందన్నారు. సీఆర్డీఏ సెక్షన్ 115 (3) ప్రకారం నోటీసులు పంపారు. భవనాల నిర్మాణానికి సంబంధించి సంజాయిషీ సంతృప్తికరంగా లేకపోతే కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

 

కృష్ణా కరకట్ట వెంట ఉన్న అక్రమ కట్టడాల‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఇంటితో పాటు 20 ఇళ్ల యజమానులకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసిన తరుణంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇది ముందే గ్రహించిన చంద్రబాబు ఇప్పటికే కొత్త ఇల్లు వెతికే పనిని నేతలకు అప్పగించారు.

 

ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ కట్టడాలకు అధికారులు ఈ నోటీసులు ఇస్తున్నారు. అలాగే కరకట్ట వెంబడి 100 మీటర్లలోపు 50 అక్రమ కట్టడాలు గుర్తించారు. వారికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. మొత్తంగా చంద్రబాబు ఇల్లు ఖాళీ చెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది.

 

Tags : ap cm ys jaganchandrababuchandrababu houseCRDAillegalnoticeTDP

Also read

Use Facebook to Comment on this Post



Menu