12/2/18 11:19 PM

ఎయిర్‌పోర్టును మూసేయండి.. హైటెక్ సిటీని కూల్చేయండి.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు

Demolish Hitech City, Balakrishna Sensational Comments

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఎంట్రీతో ప్రచార పర్వం మరింత రసవత్తరంగా మారింది. బాలయ్య బాబు డైలాగులతో రెచ్చిపోతున్నారు. చంద్రబాబుని అంటారా? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏకంగా కేసీఆర్‌కే సవాల్ విసిరారు. ప్రజాకూటమి అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తున్న బాలయ్య.. బావ చంద్రబాబుని వెనకేసుకొచ్చారు. మా బావనంటే ఊరుకుంటానా? అని ఎదురుదాడికి దిగారు. టీఆర్ఎస్ నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

 

తెలంగాణలో చంద్రబాబు పేరు వినిపించకుండా చేయాలంటే శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలని, హైటెక్ సిటీని కూల్చి వేయాలని, ఫ్లైఓవర్లను తొలగించాలని బాలకృష్ణ అన్నారు. ఈ పనులు చేసే దమ్ముందా? అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు బాలయ్య బాబు. శేరిలింగంపల్లిలో రోడ్ షో లో టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ గురించి కేసీఆర్‌ కాకమ్మ కబుర్లు చెబుతున్నారన్న బాలయ్య.. తెలుగుదేశం పార్టీయే లేకుంటే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చేవారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై కుళ్లు జోకులు వేయొద్దని హెచ్చరించిన బాలయ్య.. చంద్రబాబు చరిత్రను చెరిపేయాలనుకుంటే అది అయ్యే పనికాదని తేల్చి చెప్పారు. చంద్రబాబు కట్టిన కట్టడాల్లో మీటింగ్‌లు పెట్టుకుంటూ చంద్రబాబునే విమర్శిస్తారా? అని ఫైర్ అయ్యారు.

 

”చంద్రబాబు చరిత్రను తుడిపేయాలంటే హైటెక్‌ సిటీని మూసేయాల్సి ఉంటుంది…. అలాచేసే దమ్ము టీఆర్‌ఎస్‌కు ఉందా? చంద్రబాబును వద్దనుకుంటే శంషాబాద్ ఎయిర్‌పోర్టును మూసివేయాల్సి ఉంటుంది… అలా మూసేసి చూడండి ఏమవుతుందో? చంద్రబాబు చరిత్రను మాయం చేయాలంటే హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లను మాయం చేయాల్సి ఉంటుంది. అలా చేసే దమ్ముందా బిడ్డా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు బాలయ్య.

 

రాళ్లలో ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు అని బాలయ్య గొప్పగా చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును తెచ్చిన చంద్రబాబును ఔటాప్ డేట్‌ చేయాలనుకుంటే అంతకు మించిన ఔట్ అండ్ ఔట్ కమెడియన్లు మరొకరు ఉండరన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల గల్లీ బుద్దులు చూస్తుంటే తనకు జాలేస్తోందన్నారు బాలకృష్ణ. సైనా నెహ్వాల్‌, పీవీ సింధూలను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని కితాబిచ్చారు. హైదరాబాద్‌కు దీటుగా సైబరాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. మాహిష్మతి సామ్రాజ్యానికి భల్లాల దేవుడే ప్రభువు అయినా…. ప్రజల గుండెల్లో మాత్రం బాహుబలే ఉంటారని…. చంద్రబాబు ఒక బాహుబలి అని బామ్మర్ధి బాలకృష్ణ కితాబిచ్చారు. టీఆర్‌ఎస్‌ది లాటరీ అయితే చంద్రబాబుది హిస్టరీ అని చెప్పారు. గత ఎన్నికల్లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నుంచి టీడీపీ టికెట్ మీద గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నయవంచకులకు గుణపాఠం చెప్పాలని, భవిష్యత్తులో మరొకరు ఇలా చేయకుండా బుద్ధి చెప్పాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

 

సామాజిక న్యాయం కోసం పోరాడింది టీడీపీయే అని బాలకృష్ణ అన్నారు. సమాజంలో అసమానత రూపు మాపేందుకు కృషి చేసింది, తెలుగుజాతి గౌరవాన్ని, ఉనికిని కాపాడింది.. టీడీపీయే అన్నారు. తెలుగువారిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిందన్నారు. అలాంటి పార్టీ జెండా తెలంగాణ నిండా ఎగరాలని, టీడీపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని, ప్రజా కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా కుటుంబపాలనకు చరమగీతం పలకాలని బాలయ్య పిలుపునిచ్చారు.

Tags : balakrishnabalakrishna challenge to kcrHitech cityKCRkukatpallynandamuri balakrishnaSerilingampallytelangana election campaigntrs

Also read

Use Facebook to Comment on this PostMenu