04/17/19 12:11 PM

150 సీట్లు ఖాయం : ప్రతి ఒక్కరు టీడీపీకే ఓటు వేశామని చెబుతున్నారు

Devineni Uma Fires On Jagan

ఏపీలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఏపీ మంత్రి దేవినేని ఉమ వైసీపీ అధినేత జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే(11వ తేదీ) జగన్ తన ఓటమిని అంగీకరించారని చెప్పారు. తాను ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానన్న విషయాన్ని దేవుడే నిర్ణయిస్తాడని జగన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. 11వ తేదీన మధ్యాహ్నం తర్వాత ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యాన్ని తాను చూశానని, వైసీపీ వస్తే ఘోరం జరుగుతుందన్న ఆందోళన ఓటర్లలో కనిపించి, వారంతా టీడీపీకి మద్దతుగా నిలిచారని, అందువల్లే పోలింగ్ శాతం పెరిగిందని ఉమ చెప్పారు.

 

హైదరాబాద్ లో ఉంటూ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ దొంగలు దొంగలు కలిసిపోయారని ఉమ ఆరోపించారు. బీజేపీ సహకారంతో జగన్ హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారని ఉమ మండిపడ్డారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. సీఎం సార్ అంటేనే జగన్ పలుకుతున్నారని విమర్శించారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని.. సైకిల్ కి ఓటేశామని ప్రతి ఇక్కరూ చెబుతున్నారని, సైకిల్ బ్రహ్మాండంగా పరిగెడుతోందని ఉమ అన్నారు. టీడీపీకి 150 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితికి దిగజారిందన్నారు. ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిశోర్ చివరికి జగన్ చేతిలో సీఎం నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 11న సాయంత్రమే ఓటమిని అంగీకరించిన జగన్.. మే 23న కౌంటింగ్ వరకూ క్యాడర్ ను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారని విమర్శించారు. చంచల్ గూడ జైలుకి వెళతారా? లేక చర్లపల్లి జైలుకి వెళతారా? అని తేల్చుకోవాల్సింది జగనేనని స్పష్టం చేశారు. జగన్ మానసిక స్థితి ప్రమాదకరంగా మారిందన్నారు. ఎన్నికల ఫలితాలను చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరన్నారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు జగన్ అబద్ధాలు చెప్పి వచ్చారని, బీజేపీ సహకారంతో రాష్ట్రంపై కుట్రలు చేయాలంటే చెల్లదని హెచ్చరించారు. వీవీప్యాట్ స్లిప్ 7 సెకన్లు కనిపించాల్సి ఉండగా, 3 సెకన్లలోనే మాయం కావడం వెనుక ఈసీ హస్తముందని ఆయన ఆరోపించారు.

 

సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌ను కలిసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపైనా మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కలిసిపోయి చంద్రబాబుపై కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రిటైర్డ్ ఐఏఎస్‌ల సంఘం గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేసింది. జగన్‌ కేసులో నిందితుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా ఎలా నియమిస్తారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌‌ను కోరింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్‌లు ఐవైఆర్‌ కృష్ణారావు, అజయ్‌ కల్లం, గోపాల్‌ రావు, భట్టాచార్య తదితరులు గవర్నర్‌ను కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.

 

నరసింహన్‌ను జగన్ కలిసిన కొన్ని గంటల్లోనే రిటైర్డ్ ఐఏఎస్‌లు కూడా కలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని దేవినేని ఉమ ప్రశ్నించారు. ‘ఆర్థిక నేరగాడు, ఆర్థిక ఉగ్రవాది జగన్ ఇవాళ చెప్తే రేపు అధికారులు బదిలీ అవుతున్నారు. శ్రీకాకుళం కలెక్టర్‌, ఎస్పీ, కడపలో కేసు విచారణ చేస్తోన్న ఎస్పీ, ఇంటెలిజెన్స్ డీజీ, చీఫ్ సెక్రటరీ, సీఐలు ఇలా అందరినీ మార్చారు. అప్పుడు ఈ రిటైర్డ్ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు. అప్పుడేమైపోయారు ఈ రిటైర్డ్ ఐఏఎస్‌లు. హైదరాబాద్‌లో కాలక్షేపం చేస్తూ, చక్కగా కుటుంబాలతో సేదదీరి, ఇవాళ గవర్నర్ దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి మీద, మా మీద బురదజల్లుతారా. ఎంత దుర్మార్గం. ఏం చేస్తున్నారు మీరు’ అంటూ ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్మార్గాలు, కుట్రలు కుతంత్రాలు చేసేవారికి మీరు సహకరిస్తున్నారంటే ప్రజలు మీకు కూడా బుద్ధి చెబుతారు అని ఉమ వార్నింగ్ ఇచ్చారు.

 

ప్రభుత్వం 40 మందికి డీఎస్సీ ప్రమోషన్లు ఇస్తూ.. ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని జగన్ చేసిన ఆరోపిణలను దేవినేని ఉమ ఖండించారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. ఆ 40 మంది పేర్లు, ఏ సామాజిక వర్గానికి చెందినవాళ్లో.. అన్ని వివరాలతో సహా మీడియా ముందు పెట్టాలని జగన్‌కు సవాల్ చేశారు. ఎవరు ఎప్పుడు ప్రమోషన్ ఇచ్చారో మొత్తం మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. మీడియాపై నమ్మకం లేకపోతే.. అవినీతి పత్రిక అయిన సాక్షిలో వివరాలు రాయాలన్నారు. స్పీకర్ కోడెలే చొక్కా చింపుకున్నారని జగన్ అన్నారని.. చొక్కాలు చింపుకోవడం, క్రిమినల్ వ్యక్తిత్వం వైసీపీ నేతలకే ఉంటుందని దేవినేని ఉమ మండిపడ్డారు.

Tags : ap cmap elections 2019cmdevineni umaTDPYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu