08/21/19 8:53 PM

ఏపీ రాజధానిని ఫిక్స్ చేసిన జగన్..? సాక్ష్యం ఇదిగో..

Donakonda New Capital Of Andhra Pradesh

ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు డ్రోన్ రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు టాపిక్ మారిపోయింది. రాజధాని మార్పు గురించి డిస్కషన్ మొదలైంది. ఏపీ రాజధాని మార్పు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతి కాదు దొనకొండ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. వైసీపీకి చెందిన కీలక నాయకులు ఇస్తున్న స్టేట్ మెంట్లు, అమరావతిలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే రాజధాని మార్పు ఖాయమే అనిపిస్తోంది.

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించబోతున్నారనే చర్చ.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. అమరావతిలో ఎక్కడి పనులు అక్కడ ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు… ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని.. చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నీళ్లన్నింటినీ బిగపట్టి ఒక్కసారిగా వదిలి.. రాజధాని గ్రామాల్లోకి నీరు వచ్చేలా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు టీడీపీ నేతలు చేశారు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్‌లో రాజధానికి జగన్ సర్కార్ చేసిన కేటాయింపులు, తాజాగా అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాజధానిని మార్చాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశాయి.

 

తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి, రాజధాని అంశాన్ని పర్యవేక్షిస్తున్న బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు డిస్కషన్ కు దారితీశాయి. ఏపీ రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదు అని బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, దీనిపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని బాంబు పేల్చారు. నిర్మాణ వ్యయం అమరావతిలో ఎక్కువ అవుతుందని మరో చోట అయితే తక్కువగా ఉందని.. దానికి తోడు అమరావతిలో ముంపు సమస్యలు ఉన్నాయని బొత్స చెప్పుకొచ్చారు. దీంతో ఏపీ రాజధాని షిఫ్ట్ అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

 

ఇక దొనకొండ విషయానికి వస్తే.. ప్రకాశం జిల్లాలో కోడుగుడ్డు ఆకారంలో ఉంటుంది. దీని చుట్టూ ఖాళీ భూములు.. దగ్గరలో సముద్రం, పచ్చదనం.. ఇక చెప్పనవసరం లేదు. దీంతో.. నేతల కళ్లు దానిపై పడ్డాయి. దొనకొండ ఏపీకి రాజధాని అవుతుందో.. లేదో పక్కన పెడితే.. వైసీపీ నేతల భూముల కొనుగోళ్లు మాత్రం ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఖాళీగా ఉన్నాయని కొంటున్నారో.. లేక దీన్నే.. రాజధానిని చేద్దామని కొంటున్నారో.. తెలీదు కానీ.. మరికొన్ని రోజుల తర్వాత.. ఖాళీ భూమి మాత్రం కనబడదని మాత్రం చెప్పొచ్చు. ఇప్పుడు దొనకొండలోని ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా పలుకుతోంది. మరికొన్ని రోజుల్లో.. ఇది 4 రెట్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట.

 

ఏపీలోకి కొత్త ప్రభుత్వం వచ్చాక.. చాలా మంది నేతలు.. ఏపీలో సుస్థిరంగా స్థిరపడాలని ప్లాన్లు వేస్తున్నారు. దీనిలో భాగమే.. దొనకొండలో భూములను కొంటున్నారనే పుకారు.. షికారు చేస్తోంది. సీఎం జగన్.. దీనిని త్వరలోనే రాజధానిగా ప్రకటిస్తారు.. అందుకే.. నేతలందరూ ఇక్కడ భూములు కొంటున్నారని మరో వార్త కూడా జోరుగా వినిపిస్తోంది. అందులోనూ.. ప్రకాశం జిల్లా.. రాయలసీమకు దగ్గర కూడా ఉంటుంది.

 

అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచే దొనకండలో భూములు కొనేందుకు వైసీపీ నేతలు ఆసక్తి చూపారట. తమ అనుచరులను పంపి… దొనకొండలో రియల్టర్లతో బేరసారాలు నడిపారట. హైదరాబాద్ నుంచే కాదు… విజయవాడ నుంచి కూడా చాలా మంది వైసీపీ నేతలు… దొనకొండలో ఎన్ని ఎకరాలు కొనుక్కోవాలనే అంశంపై ఎవరికి వాళ్లు లెక్కలేసుకున్నారని తెలుస్తోంది. దాంతో ఆటోమేటిక్‌గా ఎన్నికల నాటి నుంచి దొనకొండలో భూముల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే దొనకొండను రాజధానిగా మార్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంత రచ్చ జరుగుతున్నా.. సీఎం జగన్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. ఈ వార్తలు అబద్దం అని క్లారిటీ ఇవ్వలేదు.. అవును దొనకండే రాజధాని అని నోరు విప్పి చెప్పనూ లేదు.

 

ఏపీ రాజధానిగా దొనకొండనే ఎందుకు కోరుకుంటున్నారు అనే వివరాల్లోకి వెళితే.. రాయలసీమ ప్రజలకు అమరావతి కంటే దొనకొండ చాలా దగ్గర. అమరావతి చుట్టూ ఆల్రెడీ టీడీపీ నేతలు భూములు కొనేసుకున్నారని మండిపడుతున్న వైసీపీ… రాజధాని విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దొనకొండకు దగ్గర్లోనే రాజధానిని నిర్మిస్తారనే ప్రచారం ఊపందుకోవడానికి మరో కారణం కూడా ఉంది. 2014లోనే వైసీపీ నేతలు దొనకొండలో కొన్ని భూములు కొనుక్కున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్మి అప్పులు చేసి మరీ వేల ఎకరాల్లో భూములు కొనేశారు. తీరా టీడీపీ పవర్ లోకి రావడం, అమరావతిని రాజధానిగా అనౌన్స్ చెయ్యడం జరిగిపోయాయి. దీంతో 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే… దొనకొండ పేరు జోరుగా వినిపించడం మొదలైంది. ఈసారైనా తమకు న్యాయం జరిగేలా సీఎం జగన్ చేస్తారని వైసీపీ నాయకులు నమ్మకం పెట్టుకున్నారు. చూడాలి మరి.. ప్రచారమే నిజమైతే… ఏపీ రాజధాని అమరావతి బదులు… దొనకొండ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

 

అదే సమయంలో మరో వాదనా తెరపైకి వచ్చింది. అమరావతి వద్దు, దొనకొండ వద్దు.. తిరుపతిని రాజధాని చెయ్యాలనే డిమాండ్ వినిపిస్తున్నారు రాయలసీమ నేతలు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని దొనకొండకు మార్చడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కేంద్రంతో ఇప్పటికే జగన్ చర్చలు కూడా జరిపారని ఆయన చెప్పారు. రాజధాని విషయంలో సీఎం జగన్‌ తొందరపడటం సరికాదని, రాజధానికి దొనకొండ ఆమోదయోగ్యం కాదని అన్నారు. అన్ని వనరులున్న తిరుపతిని రాజధానిగా చేయాలని చింతా మోహన్‌ ప్రతిపాదించారు. జగన్ సర్కార్ రాజధానిపై అనుసరిస్తున్న వైఖరితో భూములిచ్చిన రైతుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎటు చూసినా తిరుపతి రాజధానిగా బెస్ట్ అన్నారు. పైగా అందరి ఆమోదం కూడా ఉందన్నారు.

Tags : amaravatiap capitalbotsachandrababuchangecm jagandonakondaTDPtirupatiysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu