03/22/19 12:53 PM

ఏపీ ఓటర్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Dont vote For Jagan, ap cm chadnrababu warns voters

ఎన్నికల వేళ ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు మోసకారి అని జగన్ అంటే.. జగన్ క్రిమినల్ అని చంద్రబాబు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా విమర్శలకు సమయం కేటాయిస్తున్నారు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్ అడుగుతుంటే.. జగన్ కు అవకాశమిస్తే మరణశాసనం రాసుకున్నట్టే అని చంద్రబాబు అంటున్నారు.

 

ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన సీఎం చంద్రబాబు.. ప్లేస్ ఏదైనా, సందర్భం ఏదైనా.. జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈసారి తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే మెరుగైన పాలన అందిస్తానని జగన్ అంటుంటే.. జగన్ వస్తే మొత్తం దోచుకుంటాడని చంద్రబాబు అంటున్నారు.

 

విజయనగరం జిల్లా సాలూరు, చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. జగన్ పై నిప్పులు చెరిగారు. వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రంలో అభివృద్ది ఆగిపోతుందని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతాయని ఆరోపించారు. నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ ని చూస్తే పరిశ్రమలు పారిపోతాయి అని అన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌లను జగన్ జైలుకు తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీలో యువత కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తుతుంటే వైసీపీలో యువతకు సారా పోయిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

 

”జగన్ జైలుకు తీసుకుపోతారని అందరికీ భయం. నన్ను చూస్తే అనుమతులు సులభంగా వస్తాయని, పెట్టుబడులు పెడితే ఇబ్బందులు ఉండవని, వాటాలు అడగబోమని అందరూ నా దగ్గరికి వస్తారు. జగన్ మాత్రం వాటాలు తీసుకోవడమే కాదు… జైలుకు తీసుకెళ్తారు. ఇంతకు ముందు చాలా మందిని జైలుకు తీసుకెళ్లారు. వైసీపీకి సహకరిస్తే మీకు తెలియకుండా మిమ్మల్ని నేరాల్లో ఇరికించి జైల్లో పెట్టిస్తారు. జాగ్రత్త. అది పనికిమాలిన పార్టీ. నేరాల చిట్టా” అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

 

‘బాబాయ్‌ని ఇంత దారుణంగా చంపేసి, ఎవరో చంపేసినట్టు నాటకాలు ఆడుతున్నారు. ‘ముందు నాటకం, తర్వాత నేనే (చంద్రబాబు) చంపానని బూటకం. ఆ తర్వాత డ్రైవర్‌ను రమ్మంటే చంపేశాడని లెటర్ రాశారట. దీన్ని ఎవరైనా నమ్ముతారా? జగన్ అధికారంలోకి వస్తే రేపు జనాన్ని చంపేసి గుండెపోటని చెప్పి రోడ్ల మీద పడేస్తారు. నేను చీఫ్ క్రిమినల్ అంట. ఎప్పుడైనా నా జీవితంలో ఒక్క కేసైనా ఉందా? వారి జీవితంలో ఎప్పుడూ కేసులే. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే మీకు రక్షణ ఉంటుందా? ఆడబిడ్డలు బయటకు వస్తే ఇంటికి రాగలరా? పులివెందుల లాగా వీధికొక రౌడీ, పూటకో రౌడీ తయారవుతారు’ అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

జగన్ తో కేసీఆర్, మోడీ చేతులు కలిపారని.. నన్ను దెబ్బకొట్టేందుకు ముగ్గురు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో వెయ్యి కోట్ల రూపాయలు జగన్ కి పంపించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ డబ్బుతో టీడీపీ నాయకులను కొంటున్నారని అన్నారు. తెలంగాణలో ఆస్తులు ఉన్న లీడర్లను కేసీఆర్ భయపెడుతుంటే.. ఐటీ దాడులతో మోడీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఓటుకు రూ.5వేలు ఇచ్చి కొనేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారని అన్నారు. ఒక్కసారి జగన్ కు అవకాశం ఇస్తే మొత్తం దోచేసుకుంటాడని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రం శాశ్వతంగా అంథకారం అయిపోతుందన్నారు.

 

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా టీడీపీనే గెలిపించాలని చంద్రబాబు కోరారు. మీ భవిష్యత్తు నా భరోసా అని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాబోయే 17 రోజులు అత్యంత కీలకమైనవని.. 25 ఎంపీ సీట్లు, 150కి పైగా అసెంబ్లీ సీట్లలో టీడీపీ గెలవాలని చంద్రబాబు టీడీపి నేతలతో అన్నారు. వైసీపీ, బీజేపీ బరితెగింపు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఫ్రస్టేషన్‌తో బీజేపీ, ఫాక్ష్యన్ ధోరణితో వైసీపీ తప్పుమీద తప్పులు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. నేరాలు-ఘోరాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని.. అభివృద్ధి-సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. నేరాల్లో తప్ప పాలనలో జగన్‌కు అనుభవం లేదన్నారు.

Tags : ap elections 2019cm chandrababucriminaldevelopmentTDPvotersYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu