04/19/19 7:15 PM

ప్రధాని మోడీ హెలికాప్టర్ తనిఖీ చేయడం నేరమా?

EC Suspends IAS Officer For Checking PM Modi Chopper1 copy

కేంద్ర ఎన్నికల సంఘం తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు ఈసీపై భగ్గుమంటున్నాయి. ఇదెక్కడి న్యాయం అని నిలదీస్తున్నాయి. ప్రధానికి ఓ న్యాయం.. మాకు మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడొచ్చా, నిబంధనలను బ్రేక్ చేయొచ్చా అని నిలదీస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ప్రధాని మోడీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిపై వేటు పడింది. ఎన్నికల సంఘం ఆ అధికారిపై సీరియస్ అయ్యింది. ఏదో పెద్ద నేరం చేసినట్టు అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.

 

ప్రధాని మోడీ ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ కి చెందిన అధికారి తనిఖీ చేశారు. ఆయన హెలికాప్టర్‌లోని లగేజీని కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి మొహమ్మద్‌ మొహసిన్‌ చెక్ చేయించారు. ఈ సోదాలపై ఈసీ సీరియస్ అయ్యింది. వెంటనే విచారణ కమిటీని నియమించింది. ఎస్పీజీ రక్షణ ఉన్న ప్రధాని వంటి వీవీఐపీలకు తనిఖీ నుంచి మినహాయింపు ఉంటుందని తేల్చింది. ఈసీ ఆదేశాలను మొహిసిన్ ఉల్లంఘించారని, ప్రొటోకాల్ ని బ్రేక్ చేశారని కమిషన్ నివేదిక ఇచ్చింది. దీంతో ఆ అధికారి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెబుతూ, సస్పెన్షన్ వేటు వేసింది. సోదాల సమయంలో మోడీ 15 నిమిషాల పాటు వేచిచూసినట్లు తెలుస్తోంది.

 

ఎన్నికల వేళ నగదు ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఈసీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసింది. మంత్రులు, ముఖ్యమంత్రుల వాహనాలు, హెలికాప్టర్లను వీరు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే కర్నాటక సీఎం కుమారస్వామి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ లను అధికారులు తనిఖీ చేశారు. హెలికాప్టర్‌లోని వారి లగేజీని చెక్ చేశారు. ఎన్నికల వేళ ఎంతటి ముఖ్యమైన నేతలనైనా తనిఖీ చేస్తామని, అక్రమాలు జరగకుండా ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అదే రీతిలో ఈసీ నిబంధనలను మొహసిన్ ఫాలో అయ్యారు. ఏకంగా ప్రధాని చాపర్ లో లగేజీని తనిఖీ చేశారు. ముఖ్యమంత్రుల చాపర్లను తనిఖీ చేసినప్పుడు పట్టించుకోని ఈసీ.. ప్రధాని విషయానికి వచ్చేసరికి సీరియస్ అయ్యింది. ఏదో పెద్ద అపరాధం జరిగిపోయినట్టు ఆ అధికారిపై వేటు వేసింది.

 

ప్రధాని చాపర్ తనిఖీ చేసిన అధికారిపై వేటు వేయడం రాజకీయంగా దుమారం రేపింది. ఈసీ తీరుని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి కులం రంగు పులిమారు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ముస్లిం కాబట్టి.. మోడీ కక్ష కట్టి ఈసీకి చెప్పి మరీ సస్పెండ్ చేయించారని ఆరోపిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, విమర్శలు ఎలా ఉన్నా.. ఆ ఐఏఎస్ అధికారి మరీ అంత అమాయకుడేమీ కాదని, ఎన్నికల నిబంధనలు తెలియనివాడేమీ కాదని అంటున్నారు. ఆ చాపర్ లో ఉన్నది ప్రధాని అని, చెక్కింగ్స్ చేయడం తప్పు కాదనే విషయం అతడికి తెలుసు అంటున్నారు. అయినా ఆ అధికారిపై వేటు వేయడం బాధాకరం అని వాపోతున్నారు. నీకు నియమ నిబంధనలు తెలియవు, ప్రొటోకాల్ తెలియదు అని చెబుతూ ఆ అధికారిపై ఈసీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు.. ఈసీ.. ప్రధాని మోడీ జేబు సంస్థలా మారిపోయిందని ప్రతిపక్ష నాయకులు, ప్రజలు అనుకుంటున్నారు.

 

ప్రధాని వాహనం తనిఖీ విషయంలో ఈసీ నిబంధనల్లో ఎలాంటి మినహాయింపు లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్న అధికారిక వాహనాల్ని తనిఖీ చేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయని, దీని ప్రకారం సోదాల నుంచి ప్రధాని వాహనానికి మినహాయింపేమీ లేదని చెప్పింది. అసలు ఎస్పీజీ రక్షణలో ఉన్నవారిని చెకింగ్స్ నుంచి మినహాయించాలి అనే నిబంధనే లేదని విపక్షాలు చెబుతున్నాయి. మరి ఈసీ కొత్తగా ఈ రూల్ ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియడం లేదన్నాయి. ఈసీ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశాయి. ఆ ఐఏఎస్ అధికారి అలానే చేశాడని.. అలాంటప్పుడు విధుల నుంచి సస్పెండ్ చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. ఎస్పీజీ రక్షణలో ఉన్న వారిని మినహాయించాలి అంటే.. ఆ రూల్ అందరికీ వర్తింప జేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే దేవెగౌడ, కుమారస్వామి, సోనియా, రాహుల్, ప్రియాంక తదితరుల చాపర్లనూ వదిలేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. SPG భద్రత ఉన్న నేతలను వ్యక్తిగతంగా తనిఖీ చేయరాదు అనే నిబంధన ఉంది కానీ.. ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేయకూడదనే నిబంధన మాత్రం లేదంటున్నారు. ప్రధాని చాపర్ ని తనిఖీ చేసిన అధికారిని ఎందుకు సస్పెండ్‌ చేశారు? దేశానికి ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు? అని కాంగ్రెస్‌ ఈసీని ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం.. అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదని చెబుతున్నారు.

 

ఇప్పటికే మోడీ చాపర్ నుంచి ఓ బ్లాక్ బాక్సుని తరలించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ బ్లాక్ బాక్స్ లో ఏముందో చెప్పాలని విపక్షాలు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నా.. ప్రధాని మాత్రం నోరు విప్పలేదు. మోడీ తన హెలికాప్టర్‌లో ఏం తీసుకెళ్తున్నారనేది దేశం మొత్తానికి తెలియాల్సి ఉందని, దీనిపై ఈసీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మొత్తంగా ఈసీ చూపుతున్న వివక్షత మరోసారి బయటపడిందని అంటున్నారు.

Tags : BJPblack boxcheckingchopperCONGRESSecias suspensionMohammed Mohsinpm modi

Also read

Use Facebook to Comment on this PostMenu