04/14/19 8:34 PM

ఈవీఎంలు అంటే చంద్రబాబు భయపడటానికి కారణం ఇదే

EVM Tampering Possible, Chandrababu Sensational Allegation

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై యుద్ధం ప్రకటించారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అని నినదిస్తున్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఢిల్లీ బాట పట్టిన చంద్రబాబు బీజేపీయేతర పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తున్నారు. ఈవీఎంల గురించి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఈవీఎంలతో ఫలితాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. మైక్రో కంట్రోలర్, చిప్స్ ద్వారా ఈవీఎంలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. అందుకే మళ్లీ బ్యాలెట్ పద్దతిని పాటించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బీజేపీయేతర పక్షాలు సమావేశమయ్యాయి. ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలలో లోపాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆప్ అధినేత కేజ్రీవాల్, కాంగ్రెస్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ప్రపంచలోని చాలా దేశాలు ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్ కు వచ్చాయని గుర్తు చేశారు. జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ పేపర్ వాడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటప్పుడు భారత్ లో మాత్రం ఈవీఎంలు ఎందుకు వాడాలి అనే రీతిలో చంద్రబాబు మాట్లాడారు.

 

వీవీ ప్యాట్ స్లిప్పుల్లో 50శాతం లెక్కించాల్సిందే అని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయినా దేశం కోసం పోరాడుతున్నానని.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనేది తన తపన అని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో వేలాది మెషీన్లు మొరాయించాయని.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేయలేదని చంద్రబాబు చెప్పారు. అయినా ప్రజలు ఓట్లేసి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారన్నారు. తెలంగాణలో 25 లక్షల ఓటర్లను తొలగించారని, అక్కడ జరిగిన ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ ‘సారీ’ చెప్పి చేతులు దులుపుకుందని చంద్రబాబు విమర్శించారు. తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఇబ్బంది తప్పలేదని, ఏపీలో ఎన్నికల నిర్వహణ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.

 

వీవీ ప్యాట్ స్లిప్స్ 7 సెకన్లకు బదులు 3 సెకన్లే ఉన్నాయని, ఇది ఎలా మారిపోయిందని ప్రశ్నిస్తే, ఈసీ దగ్గర సమాధానం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఈసీ కాపాడలేకపోతోందని విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీ దిశానిర్దేశంలో కాకుండా.. స్వతంత్రంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ప్రజల్లోకి వెళ్లి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.

 

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడమే తమ ప్రధాన డిమాండ్ అని ప్రతిపక్ష పార్టీల నేతలు అన్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి.. వీవీ ప్యాట్‌ స్లిప్పులను 50 శాతం లెక్కించాలని కోరారు. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించామన్నారు. అయితే వీవీ ప్యాట్ స్పిప్పులు లెక్కించడానికి ఆరు రోజులు పడుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చిందని మండిపడ్డారు. దీనిపై మళ్లీ రివ్యూ పిటిషన్‌ వేస్తామన్నారు.

 

బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపకపోతే… కనీసం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దేశప్రజలకు ఈవీఎంలపై నమ్మకం లేదన్నారు. ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఈవీఎంలలో అనేక లోపాలున్నాయని అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలన్న ఆయన… జర్మనీలో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నారని గుర్తు చేశారు. 21 పార్టీలు బ్యాలెట్ విధానం కోరుతున్నాయని అన్నారు. 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కించడానికి 6 రోజులు ఎందుకు పడుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. బ్యాలెట్ పేపర్ల లెక్కింపునకి ఒకప్పుడు రెండు రోజులే టైమ్ పట్టేదని, ఇప్పుడు స్లిప్పులకి అన్ని రోజులు ఎందుకు పడుతుందని నిలదీశారు.

Tags : ap cm chandrababuap electionsballot paperBJPecevmevm malfunctionEvm tamperingmodino evmvvpat slips

Also read

Use Facebook to Comment on this PostMenu