07/13/18 3:39 PM
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది..!

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి.. రాహుల్ గాంధీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాహుల్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపిన కిరణ్.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి కృషి చేస్తామన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఉంటుందని, తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విభజన హమీలు అమలవుతాయని కిరణ్ పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రధాని చెప్పిన మాట చట్టంతో సమానం అన్నారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపై ఉందన్న కిరణ్.. విభజన హామీలను అమలు చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ను వదిలి వెళ్లిన నేతలతోనూ తాను మాట్లాడుతున్నానని, రాహుల్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి ప్రయత్నం చేస్తామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
గురువారం ఢిల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరాతో కలసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం పార్టీలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. పార్టీలో చేరే ముందు కిరణ్ కుమార్ రెడ్డి.. కోస్తాంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ కీలకనేతలతో మంతనాలు జరిపారు. వారితో చర్చల అనంతరం కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా రోశయ్య పనిచేశారు. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ అధిస్టానం రోశయ్యను పదవి నుంచి తప్పించి స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అనంతరం తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపడంతో, రాజీనామ చేసి సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీ ని స్థాపించి 2014 ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
Tags : former Andhra cmkiran kumar reddykiran kumar reddy rejoins congressrahul gandhi