08/25/19 8:43 PM

నవ్యాంధ్ర రాజధాని రగడ : బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ

Four Capitals For Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజధాని చుట్టూ నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజధానిని తరలించాలని అధికార పార్టీ నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అమరావతి వద్దు దొనకొండ ముద్దు అంటున్నారు. లేదు లేదు రాజధానిగా అమరావతిలోనే కంటిన్యూ చెయ్యాలని టీడీపీ, బీజేపీ, జనసేన డిమాండ్ చేస్తున్నాయి. మునిగిపోయే ప్రాంతంలో రాజధాని సేఫ్ కాదనే లాజిక్ ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు పోరాటం చేస్తున్నారు. సీఎం జగన్ మాత్రం ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చెయ్యలేదు. రాజధానిగా అమరావతినే కంటిన్యూ చేస్తారా? లేక కొత్త కేపిటల్ ని అనౌన్స్ చేస్తారా? అనేది దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంత నవ్యాంధ్ర రాజధాని ఏది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

 

రాజధాని గురించి ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంతే.. మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేషన్ కొత్త డిమాండ్ తెచ్చారు. ఏపీకి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ బాంబు పేల్చారు. అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని, ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే సీఎం జగన్‌ బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని చెప్పారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. విజయనగరం, గుంటూరు, కాకినాడ, కడప జిల్లాలను రాజధానులుగా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీజీ చెప్పారు. ఈ విషయం బీజేపీ అధిష్ఠానమే తనకు తెలిపిందన్నారు. అధికార పార్టీ వైసీపీ ఆలోచన ప్రకారం నవ్యాంధ్రకు ఒకటి కాకుండా 4 రాజధానులు ఉండే అవకాశం ఉందన్నారు. రాజధానుల ప్రతిపాదన నూటికి నూరుశాతం నిజమని ఆయన బల్లగుద్ది చెప్పడం విశేషం. రాజధాని ఒకేచోట కాకుండా వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు టీజీ చెప్పారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు.

 

పోలవరం టెండర్ల విషయంపైనా టీజీ స్పందించారు. టెండర్ల రద్దు.. రివర్స్ టెండర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ సర్కార్ సంప్రదించలేదన్నారు. రీ టెండర్లతో పోలవరం నిర్మాణ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందని.. అదే జరిగితే జగనే టీడీపీ అధినేత చంద్రబాబుకు లైఫ్ ఇచ్చినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చెట్టాపట్టాలపైనా టీజీ తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ ని ఎంత తక్కువ నమ్మితే జగన్ రాజకీయ జీవితానికి అంత మంచిదని టీజీ హితవు పలికారు.

 

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. టీజీ కామెంట్స్ లైట్ తీసుకోవడానికి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే టీజీ వెంకటేష్ ఆషామాషీ నాయకుడేమీ కాదు. సీనియర్ నేత పైగా పలుకుబడి ఉన్న లీడర్. బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారు. ఈ క్రమంలో 4 రాజధానుల అంశం నిజమే అయి ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. పైగా.. అభివృద్ధిని ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలకు సమంగా పంచాలన్నది సీఎం జగన్ ఉద్దేశ్యం. దీంతో ఆయన 4 రాజధానుల ప్రతిపాదన చేసి ఉండొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా టీజీ వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అంశం కొత్త చర్చకు దారితీసింది.

Tags : amaravatiandhra pradesh capitalbjp mpcm jagan mohan reddydonakondafour capitalstg venkatesh

Also read

Use Facebook to Comment on this PostMenu