03/12/19 1:09 PM

చంద్రబాబుకి గుడ్ న్యూస్: టీడీపీలోకి ఎంపీ బ్యాక్

Good News For Chandrababu, MP Back To TDP

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చేరికలు, వలసలతో రాజకీయం వేడెక్కింది. అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైసీపీలోకి నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వరుస పెట్టి ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లడం టీడీపీ శ్రేణులను కలవరపెట్టింది. ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక సతమతం అవుతున్నారు. అడ్డుకట్ట వేయలేకపోయినా.. వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు, నాయకులకు గాలం వేసే పనిలో పడ్డారు.

 

ఈ క్రమంలో చిత్తూరు జిల్లా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన టీడీపీలో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడే ఆలోచనపై అనుచరులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. కొంతకాలంగా మదనపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డికి బదులు మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఫరూక్‌కు టికెట్ ఇచ్చే అంశంపై వైసీపీలో చర్చ కొనసాగుతుంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు ఖరారైనట్లుగా తెలుస్తుంది. మైనార్టీ అభ్యర్థికి మదనపల్లె టికెట్ ఇచ్చేందుకు వైసీసీ సిద్ధమైంది. దీనికి సంబంధించి అక్కడ కేడర్‌కు కూడా జగన్ స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో తిప్పారెడ్డి టీడీపీకి వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను టీడీపీ నుంచి మదనపల్లె బరిలోకి దింపేందుకు టీడీపీ శ్రేణులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

 

టీడీపీతో పోలిస్తే… ఎన్నికల వేళ వైసీపీలోకి వలసల జోరు ఊపందుకుంది. ఈ మధ్యకాలంలో అధికార పార్టీకి చెందిన అనేకమంది నాయకులు జగన్ గూటికి క్యూకట్టారు. మరి ఇలాంటి సమయంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే… టీడీపీలోకి వస్తుండటంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

మరోవైపు టీడీపీని వీడి వైసీపీలో చేరిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తిరిగి సొంత గూటికి రావాలని అనుకుంటున్నారట. ఈ సారి ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన రవీంద్రబాబు… విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. వైసీపీ తరపున తనకు పాయకరావుపేట సీటు లభిస్తుందని ఆశించి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు ఆయనకు పాయకరావుపేట టికెట్ లభించే అవకాశాలు లేవని తెలుస్తోంది. వైసీపీ తరపున పాయకరావుపేట ఎమ్మెల్యే టికెట్ గొల్ల బాబూరావుకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో… రవీంద్రబాబు పరిస్థితి డోలాయమానంలో పడిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.

 

వైసీపీలో టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న పండుల రవీంద్రబాబు… తిరిగి టీడీపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన రాకను టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

 

పార్టీని వీడి పోతూ పోతూ.. ఎంపీ రవీంద్రబాబు బాంబు చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేసేలా మాట్లాడారు. టీడీపీలో కులతత్వం పెరిగిపోయిందని రవీంద్రబాబు ఆరోపించారు. కులాలవారీగా చంద్రబాబు దగ్గర ఆర్మీలు ఉన్నాయని.. ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంవారితో తిట్టిస్తారని.. ఒక్క సామాజిక వర్గానికే ఆయన న్యాయం చేస్తారని ధ్వజమెత్తారు. ఓ దళితుడిగా లోక్‌సభలో గళం విప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాలేదని.. హోదా ఉద్యమాన్ని ఆయనే నీరుగార్చారని విమర్శించారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీని తిడుతున్నారని.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో కలవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబుని, టీడీపీని ఇన్ని మాటలు అన్న రవీంద్రబాబుని.. ఆ పార్టీ మన్నిస్తుందా.. తిరిగి టీడీపీలోకి వస్తాను అంటే ఆహ్వానిస్తుందా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags : chandrababudesai tippa reddymadanapallepandula ravindra babuTDPys jaganysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu