10/25/19 1:46 PM

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : బీజేపీ జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చిందా

Haryana, Maharashtra Assembly Results, Shock For BJP

6 నెలల్లోనే సీన్ మారిపోయింది. ఓట్ల శాతం తగ్గింది. సీట్ల సంఖ్య కూడా డౌన్ అయ్యింది. దిగ్గజాలు ఓడిపోయారు. అత్యధికమంది మంత్రులు ఓటమి చవిచూశారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు పార్టీలకు కొత్త పాఠం నేర్పాయి. మరీ ముఖ్యంగా బీజేపీకి షాక్ ఇచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ కి బూస్టింగ్ ఇచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో కలవరం, ఆందోళన నింపాయి. బీ అలర్ట్ అంటూ కమలనాథులకు సందేశాన్ని పంపాయి.

 

మోడీ చరిష్మా తగ్గిందా అనే అనుమానం కలగక మానదు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే. కమలనాథులు కూడా ఒకింత అప్ సెట్ అయ్యారు. ప్రాంతీయ లక్ష్యాలను జాతీయ భావాలతో గెలవచ్చు అన్న బీజేపీ నేతల అతివిశ్వాసానికి ఎదురుదెబ్బ తగిలింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ ఎన్నికలైనా ఎగరేది మన జెండానే అని గర్వంగా చెప్పుకున్న నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది.

 

మహారాష్ట్రలో శివసేనతో జట్టుకున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ అయితే దక్కించుకుంది. కానీ గతంతో పోలిస్తే బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది. ఓటింగ్ శాతం కూడా తగ్గింది. శివసేన మాత్రం తన సీట్లు నిలుపుకుంది. సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని ఆ పార్టీ నాయకులు కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. కట్ చేస్తే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, బీజేపీ నేతల జోస్యాలు ఫెయిల్ అయ్యాయి. బీజేపీ సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని అనుకున్న బీజేపీ నేతల ఆశలపై నీళ్లు చల్లారు ఓటర్లు. ఇప్పుడు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం కమలనాథులు కొంత జీర్ణించుకోలేకపోతున్నారు.

 

ఇక హర్యానాలో బీజేపీ పరిస్థితి మరీ దారుణం. రెండోసారి అధికారం చేపట్టాలని చూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. హర్యానాలో హంగ్ వచ్చింది. 40 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఈ సంఖ్య సరిపోదు. గతంలో పోలిస్తే బీజేపీ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. చాలామంది మంత్రులు ఓడిపోయారు. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అని చెప్పడానికి హర్యానా ఫలితమే నిదర్శనం అని విపక్షాలు అంటున్నాయి. కట్టర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలపడానికి ఈ ఫలితం అద్దం పడుతుందని అంటున్నారు.

 

మహారాష్ట్రంలో బీజేపీ గెలిచినా.. ఇబ్బందులు తప్పేలా లేవు. శివసేన రూపంలో బీజేపీ ముందు బిగ్ చాలెంజ్ ఉంది. పెద్దగా బలం లేకున్నప్పుడే శివసేన నేతలు బీజేపీకి చుక్కలు చూపించారు. ఇప్పుడు బలం కూడా తోడైంది. దీంతో ఏకంగా సీఎం పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే సీఎం పీఠం పంచుకోవడం బీజేపీకి ఇష్టం లేదు. అలా అని శివసేనను కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం. మరిప్పుడు బీజేపీ నేతలు ఏం చేస్తారో చూడాలి.

 

మహారాష్ట్రంలో బీజేపీ సొంతంగా 150 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనాలు వేశారు. కానీ చాలా దూరంలో ఆగిపోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 124 సీట్లు గెలిచింది. అప్పటితో పోల్చుకుంటే ఈసారి సీట్లు తగ్గాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శివసేన వ్యూహాలు రచిస్తోంది. మహారాష్ట్రలో సీఎం పదవి 50-50 అనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అంతేకాదు.. ఫస్ట్ ఛాన్స్ తమకే ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తోంది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ 23 ఎంపీ సీట్లు గెల్చుకుంది. ఆ ఫలితాలతో పోల్చుకుంటే 150 అసెంబ్లీ సీట్లు తేలిగ్గా గెల్చుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ 100 సీట్ల దగ్గర ఆగిపోవడం ఆందోళనలో పడేసింది. సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే బీజేపీ ఓటింగ్ శాతం తగ్గింది, సీట్లు కూడా తగ్గాయి.

 

బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే.. కాంగ్రెస్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి బూస్టింగ్ ఇచ్చాయి. మహారాష్ట్రలో ఊహించని విధంగా కాంగ్రెస్ సీట్లు దక్కించుకుంది. రాహుల్ గాంధీ విదేశీ టూర్ లో ఉన్నా, కాంగ్రెస్ లో విబేధాలు తార స్థాయికి చేరినా, స్టార్ క్యాంపెయినర్లు లేకపోయినా.. కాంగ్రెస్ కు బాగానే సీట్లు దక్కాయి. మహారాష్ట్రంలో కాంగ్రెస్ పట్టుమని పది సీట్లు అయినా గెలుస్తుందా అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే..46 స్థానాలతో సత్తా చాటింది. సరిగ్గా ప్లాన్ చేసినట్టు అయితే.. మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేవని పార్టీ నేతలు అంటున్నారు.

 

మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు కమలనాథులను ఆలోచనలో పడేశాయి. అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటాయి. మోడీ చరిష్మా తగ్గిందా అనే అనుమానాలను రేకేత్తించాయి. ఇప్పటికైనా బీజేపీ నేతలు తీరు మార్చుకోకుంటే ముందు ముందు మరిన్ని ఎదురుదెబ్బలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఫలితాలతో మోడీ, అమిత్ షా ఆలోచనలో పడ్డారు. ఫలితాలపై సమీక్ష జరుపుతున్నారు. తప్పులు సరిదిద్దుకునే పనిలో ఉన్నారు.

 
అదే సమయంలో కాంగ్రెస్ లో నూతనోత్సాహం నింపాయి. ప్రతిపక్షంలో ఉన్నాం, పరాభావాలను మోస్తున్నాం అని బాధ పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు దక్కింది. పోయింది అనుకున్న బలం, పోరాడేందుకు అవసరమైన శక్తి వచ్చింది. మొత్తంగా మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు పార్టీలకు కొత్త పాఠం నేర్పాయని చెప్పకతప్పదు

Tags : amit shahASSEMBLY ELECTIONSBJPCONGRESSharyanamaharashtramodiShiv sena

Also read

Use Facebook to Comment on this PostMenu