03/24/19 12:56 PM

పవన్ గారు.. మరీ అంత కాన్ఫిడెన్స్ మంచిది కాదేమో..

I Will Be Next CM Of AP, Pawan Kalyan Confidence

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో త్రిముఖ పోరు నెలకొంది. ఇన్నాళ్లు టీడీపీ, వైసీపీ మధ్యే వార్ నడిచింది. ఇప్పుడు జనసేనాని కూడా ఎంట్రీ ఇచ్చారు. సీఎం రేసులో నేను కూడా ఉన్నా అంటున్నారు పవన్ కళ్యాణ్. దీంతో ఎన్నికల సమరం మరింత ఆసక్తికరంగా మారాంది. రెండోసారి సీఎం కావాలని చంద్రబాబు పట్టుదలగా ఉంటే.. ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. నాకేం తక్కువ.. నేనెందుకు చీఫ్ మినిస్టర్ అవ్వకూడదని పవన్ కూడా రేసులోకి వచ్చారు. ఈ త్రిముఖ పోరులో కాబోయే సీఎం ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

 

ఇదిలా ఉంటే.. కాబోయే సీఎం నేనే అని జనసేనాని పవన్ కళ్యాణ్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. శనివారం విజయవాడలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా తానే ప్రమాణస్వీకారం చేస్తానని పవన్ చెప్పారు. విజయవాడలో రౌడీలు, గూండాల అరాచకాలు పెరిగిపోయాయని, అధికారంలోని రాగానే వారి తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో భూకబ్జాలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు.

 

విజయవాడతో తనకు ఎంతో అనుబంధం ఉందని, రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతమని పవన్ అన్నారు. రాష్ట్రంలో ఏ మార్పు జరగాలన్నా విజయవాడ నుంచే మొదలవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడింది కూడా విజయవాడ నుంచి వెళ్లిన నాయకులే అని పవన్ పేర్కొన్నారు. ఇంత కష్టపడి తెలంగాణకు విముక్తి కలిగిస్తే.. తెలంగాణ నాయకులు మాత్రం ఆంధ్రోళ్లను దగాకోరులు, దోపిడీదారులుగా తిడుతుంటే జగన్ స్పందించడం లేదన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ అయితే ఏకంగా హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేశారని ఎద్దేవా చేశారు. నేడు ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి హైదరాబాద్ నడిబొడ్డున మాట్లాడే దమ్మున్న నాయకుడు పవన్‌ కళ్యాణ్ మాత్రమేనని స్పష్టం చేశారు.

 

ప్రత్యేక హోదా గురించి ధైర్యంగా పోరాడిన ఏకైక పార్టీ జనసేనే అని పవన్ అన్నారు. విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం వైఎస్ జగన్‌కు లేదని విమర్శించారు. వైసీపీకి ఓటేసి రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెట్టొద్దని సూచించారు. కేసీఆర్, జగన్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నందునే వైసీపీ తెలంగాణలో పోటీ చేయడం లేదన్నారు. ఒకే సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్‌ అంటే తనకెంతో అభిమానమని, అయితే ఒకే ఒక్క సంతకంతో ఏపీకి చెందిన బీసీలను ఓసీలుగా మార్చేయడం మాత్రం తనను బాధించిందన్నారు. ఈ అంశంపై కేసీఆర్‌ను జగన్ ఎందుకు నిలదీయడం లేదని పవన్ ప్రశ్నించారు.

 

మొత్తంగా ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు మాత్రమే కాదు.. పవన్ కూడా కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఆంధ్రోళ్లను ద్రోహులు, దోపిడీదారులు అని తిట్టిన వారితో జగన్ చేతులు కలపడం కరెక్ట్ కాదంటున్నారు. ఇకపోతే.. కాబోయే సీఎం అని పవన్ అనడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు.. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని అంటున్నారు. పవన్.. ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అని వైసీపీ నాయకులు అంటున్నారు.

Tags : chandrababucmjanasenaKCRpawan cmpawan kalyantrsys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu