08/28/19 1:08 PM

అమరావతిలో భూఅక్రమాలు : ఆధారాలతో సహా బట్టబయలు

Insider Trading In Amaravati

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. రాజధాని మార్పు చుట్టూ తిరుగుతున్న వ్యహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. టీడీపీ హయాంలో రాజధానిలో జరిగిన భూఅక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమే అని తేలింది. అమరావతి ప్రాంతంలో ఏ రాజకీయ నాయకుడికి ఎన్నెన్ని ఎకరాల భూములు ఉన్నాయో బట్టబయలైంది.

 

ఏపీలో ల్యాండ్ మైన్ పేలింది. భూఅక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదట్నుంచి ఆరోపిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో అడుగు ముందుకేసి ఆధారాలు, వివరాలు బయటపెట్టారు. రాజధాని ప్రాంతంలో తనకు కానీ తన కుటుంసభ్యులకు కానీ సెంటు భూమి కూడా లేదని చెప్పిన బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరికి బొత్స షాక్ ఇచ్చారు. సుజనా చౌదరితో పాటు మాజీ సీఎం చంద్రబాబు బంధువులకు ఎవరెవరికి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో వివరించారు.

 

అమరావతి రాజధాని ప్రాంతంలో తనకు కానీ, తన కుటుంబసభ్యుల పేరు మీద కానీ సెంటు భూమి కూడా లేదన్న ఎంపీ సుజనా చౌదరికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. సుజనా చౌదరి సమీప బంధువు జితిన్ కుమార్ కంపెనీ పేరు మీద చందర్లపాడు మండలంలో 110 ఎకరాలు ఉందని… సుజనా సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్య పేరుతో 14 ఎకరాలు ఉందని ఆయన వివరించారు. చంద్రబాబు వియ్యంకుడు వియ్యంకుడికి రాజధాని ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా 500 ఎకరాల భూములు కేటాయించారని బొత్స ఆరోపించారు. ఎకరం లక్ష రూపాయలకే ఇచ్చారని చెప్పారు. రాజధానికి కొద్ది దూరంలో ఉన్న ప్రాంతంలో అయినవారికి భూములిచ్చిన చంద్రబాబు వాటిని సీఆర్డీయే పరిధిలోకి తీసుకొచ్చారని బొత్స అన్నారు.

 

లోకేశ్ తోడల్లుడు తండ్రికి కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయని బొత్స చెప్పారు. రాజధాని విషయంలో అవినీతి జరిగిందనడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలని అన్నారు. రాజధాని అంటే కేవలం ఒక సామాజికవర్గానికి చెందినదిగా ఉండొద్దని… అన్ని ప్రాంతాల వారికి ఉండాలని బొత్స అన్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో అవినీతి జరిగిందని ఆరోపించిన బీజేపీ… ఇప్పుడెందుకు మాట మార్చిందో అర్థం కావడం లేదని బొత్స అన్నారు. అమరావతిలో భూముల ధరలు తగ్గాయో లేవో తెలియదు కానీ… రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం భూముల ధరలు పెరిగాయని బొత్స అన్నారు. అమరావతిలో కొన్ని మినహా అన్ని తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే అని మంత్రి బొత్స తెలిపారు. చంద్రబాబులా తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోమని తేల్చి చెప్పారు. రాజధాని పేరుతో జరిగిన అవినీతి, కుంభకోణాలను బయటపెడతామన్నారు.

 

బొత్స చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. రాజధానిలో తనకుకు భూములు లేవని.. బొత్సవి తప్పుడు ఆరోపణలని మరోసారి తేలిందన్నారు. రాజధానిలో భూములపై సవాల్ విసిరితే కృష్ణా జిల్లాలో ఆస్తుల లెక్కలు ఎలా చెప్తారని ప్రశ్నించారు. రాజధాని ప్రకటన చేసే దశాబ్దాలకు ముందే చందర్లపాడులో భూములున్నాయన్నారు. రాజధాని అంటే 29 గ్రామాల పరిధి అని మంత్రి బొత్స సత్యనారాయణకు తెలియదా అని ప్రశ్నించారు సుజనా. రాజధాని అంశాన్ని డైవర్ట్ చేసేందుకే తనపై ఆరోపణలు చేశారని.. తమ భూములు ఎప్పుడు కొన్నామో… ఎన్ని ఉన్నాయో రికార్డులు చూపిస్తానన్నారు. గుంటూరు జిల్లాలో రాజధాని ఉంటే కృష్ణా జిల్లాలో భూములపై ఆరోపణలు చేయడం ఏంటని నిలదీశారు. తప్పుడు పనులు చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. బొత్స పూర్తిగా లాజిక్ మిస్ అయ్యారని సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారు.

 
ఏపీ రాజధానిలో తనకి భూములు ఉన్నాయంటూ మంత్రి బొత్స చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే నందమూరి బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ స్పందించారు. చంద్రబాబు ఎకరా రూ.లక్ష కింద 500 ఎకరాలను కట్టబెట్టారని బొత్స చేసిన ఆరోపణలను శ్రీ భరత్ ఖండించారు. తనపై బురద చల్లడానికే ఆరోపణలంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తనపై ఆరోపణలు చేసినా ఊరుకున్నా కానీ.. ఎన్నికల తర్వాత కూడా తనపై బురద చల్లడం దారుణమన్నారు. తన పెళ్లికి ముందు జరిగిన వ్యవహారాన్ని.. తర్వాత పరిణామాలకు ముడి పెడుతున్నారని భరత్ వాపోయారు. అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని.. తనను బూచిగా చూపించి వేలాదిమంది రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ బేస్ పవర్ ప్లాంట్ కోసం 2007లో 498.39 ఎకరాలు తీసుకున్నామని శ్రీ భరత్ చెప్పారు. మంత్రి బొత్స చూపించిన 2012లో ఇచ్చిన జీవో.. ప్రాజెక్ట్ మొదలు పెట్టే సమయంలో ఏపీఐఐసీ ధర పెంచిందన్నారు. ఉద్దేశపూర్వకంగా రక్షణ స్టీల్ స్థలంపై హైకోర్టుకు వెళ్లారని చెప్పుకొచ్చారు శ్రీ భరత్.

 

మొత్తంగా ఏపీ రాజధానిలో భూ అక్రమాల వ్యవహారం దుమారం రేపుతోంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న వివాదంలోకి.. ఇప్పుడు బీజేపీ నేతలు ఎంటర్ అయ్యారు. ముందు ముందు ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Tags : Amravatiap capitalBJPBotsa satyanarayanainsider tradinglandssujana chowdaryTDP

Also read

Use Facebook to Comment on this PostMenu