03/15/19 5:05 PM

రాజకీయ లబ్ధి కోసమేనా : వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే

Its Murder, Ys Vivekananda Reddy Postmorterm Report

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిది(68) సహజ మరణం కాదని హత్య అని పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. ఆయన ఒంటిపై 7 కత్తి పోట్లు ఉన్నట్టు గుర్తించారు. పదునైన కత్తితో దాడి చేసి చంపేశారని తేలింది. నుదుటిపై లోతైన రెండు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. తల వెనుక భాగంలో మరో గాయం.. తొడ, ఛాతి భాగంలో కూడా గాయాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.

 

వివేకానంద రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. శుక్రవారం(మార్చి 15) ఉదయం బాత్రూమ్ లో అనుమానాస్పద స్థితిలో వివేకా మృతిచెందారు. గుండెపోటుతో చనిపోయారని తొలుత చెప్పారు. కానీ ఆయన ఒంటిమీద ఉన్న బలమైన గాయాలతో అనుమానాలు మొదలయ్యాయి. రక్తపు మడుగులో వివేకా బాత్రూమ్ లో పడి ఉన్న తీరుతో ఆయన మరణంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు అయన డెడ్ బాడీని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహించారు. రిపోర్ట్ లో ఆయనది సహజ మరణం కాదు హత్యేనని తేలింది.

 

వివేకానందరెడ్డిది హత్యే అని తేలడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అనేక అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

వివేకాను చంపింది ఎవరు?
వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది?
తెలిసిన వారే చంపేశారా?
ఇంత దారుణంగా హత్యకు గురైతే తొలుత గుండెపోటు అని ఎందుకు చెప్పారు?
హత్య జరిగే సమయంలో ఆయన అరుపులు, కేకలు వేయలేదా?
ఆ సమయంలో వివేకా వ్యక్తిగత సిబ్బంది ఎవరూ లేరా?
వివేకా తలపై గాయాలు కనపడకుండా వస్త్రాలు ఎందుకు చుట్టారు?
వివేకా హత్యను సాధారణ మరణంగా చూపించే ప్రయత్నం జరిగిందా?
ఇది ఎవరి పాత్ర, ఇందులో పాత్రధారులు ఎవరు?
హత్య వెనుక రాజీకయ కోణం ఉందా?
రాజకీయ లబ్ది కోసమే హతమార్చారా?

 

వివేకాది హత్యే అని తేలడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మర్డర్ చేసిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని క్లూస్ లభించాయని కడప జిల్లా ఎస్పీ రాహుల్ తెలిపారు. తమకు లభించిన ఆధారాలతో విచారణ చేపట్టామన్నారాయన.

 

పోస్టుమార్టమ్ రిపోర్ట్ రాకముందే… వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై సిట్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో… దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరగాలని, దోషులను పట్టుకుని శిక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. వివేకా మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాక్షించారు.

 

వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో ఒంటరిగా ఉంటున్నారు. ఆయన కూతురు, అల్లుడు అమెరికాలో ఉంటున్నారు. తెల్లవారుజామున పని మనుషులు వెళ్లే చూసేసరికి వివేకా బాత్రూమ్ లో రక్తపుమడుగులో పడి ఉన్నారు. వివేకా పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఎన్నికల వేళ వివేకానంద రెడ్డి హత్య రాజకీయంగా సంచలనం రేపుతోంది. వైసీపీ, టీడీపీ నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ లబ్ది కోసం టీడీపీ నాయకులే చంపేశారని వైసీపీ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.

 

వివేకా కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. వైసీపీ అభ్యర్థుల ఎంపికలో జగన్ కు సహకారం అందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని గెలిపించాలని కృషి చేస్తున్నారు. నిన్న రాత్రి వరకు ఆయన ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. రాత్రికి ఇంటికి వచ్చి పడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. తెల్లవారుజామున బాత్రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్నారు.

Tags : politica murderpostmortem reportpulivendulaTDPys jaganys vivekananda reddy murderys vivekananda reddy passed awayysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu