04/17/19 12:57 PM

చంద్రబాబే సీఎం : జగన్ లాంటి వ్యక్తిని ఏపీ ప్రజలు ఎప్పటికీ కోరుకోరు

YS Jagan Never Become AP CM, Kodela Siva Prasad Rao

ఏపీలో ఎన్నికల మంటలు కొనసాగుతున్నాయి. పోలింగ్ ముగిసినా మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలూ పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అని, కాబోయే సీఎం తానే అని జగన్ కాన్ఫిడెంట్ ఉన్నారు. టీడీపీ నాయకులు మాత్రం.. మళ్లీ టీడీపీ గెలవడం ఖాయం అంటున్నారు. టీడీపీ సునామీ ఖాయమని ఆ పార్టీ నేత కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. జగన్ తన జీవితంలో సీఎం కాలేడని అన్నారు.

 

జగన్ దగ్గర ఉన్న వాళ్లలో చాలా మంది గత్యంతరం లేకనే ఆయన వద్ద ఉన్నారని కోడెల అన్నారు. జగన్ ప్రవర్తన, మాటలను తట్టుకుని వాళ్లు ఉంటున్నారంటే, టీడీపీలో ఖాళీలు లేకపోవడం వల్లనే అని అన్నారు. ‘నీ జీవిత కాలంలో ముఖ్యమంత్రివి కాలేవు. నీ ప్రవర్తన మార్చుకుంటే కనీసం, రాజకీయ నాయకుడిగా అయినా మిగులుతావు. లేకపోతే, ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయి’ అని కోడెల హెచ్చరించారు. ఆంధ్రులను తిట్టిన కేసీఆర్ తో జగన్ ఎలా కలుస్తారని మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తిని ఆంధ్రా ప్రజలు ఎప్పటికీ ఒప్పుకోరని అన్నారు. ఆంధ్రా ప్రజలు చైతన్యం, విజ్ఞత ఉన్నవాళ్లని, ఏపీకి ఏం కావాలో ప్రజలకు స్పష్టంగా తెలుసని కోడెల వ్యాఖ్యానించారు.

 

ఎన్నికల సందర్భంగా తనపై దాడి చేసి… తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని కోడెల మండిపడ్డారు. ఈసీ ఇలా పనిచేయడం 40 ఏళ్లలో ఇప్పుడే చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని చేసినా… ప్రజాస్వామ్యాన్ని ఓటర్లే కాపాడారని అన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై కోడెల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు అంబటి రాంబాబు తనకు పోటీనే కాదని… ఆయన పేరునే తాను ప్రచారంలో ఎక్కడా ఉపయోగించలేదని అన్నారు. అసెంబ్లీకి రాని వైసీపీ నేతలు జీతాలు మాత్రం తీసుకున్నారని కోడెల విమర్శించారు.

 

తనపై దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు బయటపెడితే… నిజం ఏంటో బయటపడుతుందని అన్నారు. రాష్ట్రం బాగుండాలి, మనం బాగుండాలనుకునే ఏ ఒక్కరూ కూడా జగన్‌కు ఓటేయరని కోడెల తెలిపారు. ఏపీని టీడీపీ స్వీప్‌ చేస్తుందని, జగన్‌ ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నారో ప్రజలకు తెలుసని కోడెల స్పష్టం చేశారు.

Tags : ap elections 2019cmkodela siva prasad raoTDPYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu