05/19/19 12:22 PM

చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి సర్వే : జగన్ సీఎం కాకుండా అడ్డుకోలేరు

Jagan Will Become AP CM, YSRCP Leaders

ఏపీ ప్రజలు మరోసారి టీడీపీకి పట్టం కట్టబోతున్నారని క్లూ ఇచ్చిన సర్వే స్పెషలిస్ట్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. మాటల దాడికి దిగారు. చంద్రబాబు ఏజెంట్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. లగడపాటి ఆంధ్రా ఆక్టోపస్ కాదని, ఆంధ్రా జలగ అని వైసీపీ ఎంపీ విజయసాయి ధ్వజమెత్తారు. చంద్రబాబు స్కెచ్‌లో భాగంగానే లగడపాటి ఈ పలుకులు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమ ఓటమిని ఈవీఎంలపై నెట్టేందుకే చంద్రబాబు ఇలా లగడపాటితో చెప్పిస్తున్నారని విజయసాయి అన్నారు. లగడపాటి చెప్పినా ఓడిపోతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణమని చెప్పేందుకే ఈ గోలంతా అని ఎద్దేవా చేశారు. లగడపాటి తన పేరును నారా రాజగోపాల్‌గా మార్చుకోవాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.

 

లగడపాటి రాజగోపాల్ సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బెట్టింగ్ ల కోసమే లగడపాటి సర్వేలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పిన లగడపాటి, ఇప్పుడు టీఆర్ఎస్ వైపు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం వెంకట్రామపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. అలాగే చిత్తూరు జిల్లాలో మూడు లోక్ సభ సీట్లతో పాటు మెజారిటీ అసెంబ్లీ సీట్లను దక్కించుకుంటామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయాన్ని, జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

 

ఏపీలో హంగ్ వచ్చే అవకాశం లేదని, ప్రజలు సైకిల్ ఎక్కేందుకే మొగ్గు చూపారని పరోక్షంగా టీడీపీ విజయం సాధించబోతోందని లగడపాటి శనివారం చెప్పారు. అలాగే, పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని లగడపాటి జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే.

Tags : ap electionschandrababu naiduLagadapati rajagopalpeddireddy ramachandra reddysurveytdp winvijayasai reddyYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu