07/9/19 8:42 PM

జనసేన భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ క్లారిటీ

Janasena Merge In BJP, Pawan Kalyan Reaction

ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కొదవు లేదు. దేశంలో ఎక్కడా లేని రసవత్తర రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ.. అటు జనసేన.. ఇటు బీజేపీ.. కాంగ్రెస్ సంగతి సరేసరి.. ఇలా ఇన్ని పార్టీల వ్యవహారాలతో ఏపీ రాజకీయాలు నిత్యం రంజుగా కనిపిస్తాయి. ఏపీలో పొలిటికల్ హీట్ ఎప్పుడూ ఉంటుంది. ఇకపోతే.. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కన్నా దారుణంగా ఓడిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేకు ఏపీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని పరాభవం ఎదురైంది. ఆఖరికి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. ఆ పార్టీ కేవలం ఒక చోట మాత్రమే గెలిచింది. అదీ రాజోలులో.

 

ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత.. జనసేన భవిష్యత్తుపై అందరికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. జనసేన ఉంటుందా? జెండా ఎత్తేస్తారా? అనే చర్చ జరిగింది. అన్న బాటలో తమ్ముడూ నడుస్తాడు.. జనసేనని జాతీయ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం జరిగింది. అది కూడా బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. బీజేపీలో జనసేన విలీనం వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. అమెరికాలో తానా సభలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన పవన్ కళ్యాణ్… అక్కడికి మరో చీఫ్ గెస్ట్ గా వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కారదర్శి రాంమాధవ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో అందరికి అనుమానాలు మొదలయ్యాయి. పవన్ మళ్లీ బీజేపీకి దగ్గర అవుతున్నారని, బీజేపీలో జనసేనని విలీనం చేస్తారనే వార్తలు వచ్చాయి.

 

ఈ ప్రచారంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాల్సి వచ్చింది. జనసేనని బీజేపీలో విలీనం చెయ్యను అని స్పష్టం చేశారు. పార్టీని తానే నడిపిస్తానని వెల్లడించారు. ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయని తెలిసే, ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుందని తెలిసే.. ఓటములు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసే.. పార్టీని పెట్టానని పవన్ స్పష్టం చేశారు. ప్రజల్లో మార్పు కోసం, యువత బంగారు భవిష్యత్ కోసం పార్టీని స్థాపించానని పవన్ తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీని కోరుతున్నానే తప్ప.. వ్యక్తిగతంగా ఆ పార్టీతో సమస్య లేదన్నారు. ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలని బలమైన కోరిక ఉంటే.. నేనే కాదు, ప్రస్తుత ప్రభుత్వం సహా ఎవరైనా సరే దాని కోసం పోరాడాల్సిందే అన్నారు. జనసేనను బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనేది అవాస్తవం అన్నారు. సొంత ప్రయోజనాలు చూసుకుంటే టీడీపీ, బీజేపీలతో ఎందుకు గొడవ పడతానని పవన్ ప్రశ్నించారు. గెలిచే సీట్లు తీసుకొని వారితో కలిసేవాడిని కదా అని వ్యాఖ్యానించారు. ఓటమిని తాను అవమానంగా భావించట్లేదని స్పష్టం చేశారు.

 

ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో తన ప్రయాణం మొదలైందన్నారు. దెబ్బలు తిన్నా, ఓడిపోయినా.. ఆ ప్రయాణం ఆగదు. 2024 వరకు జనసేన ఉంటుందా అని కొందరు అడుగుతున్నారు. వాళ్లందరికీ చెబుతున్నా.. నా మొదటి సినిమా పరాజయం పొందినప్పుడు ఇంతమంది అభిమానులను పొందుతానని ఎవరైనా ఊహించారా? జనసేనా కూడా అంతే’ అని పవన్‌ చెప్పారు. మొత్తంగా జనసేన విలీనం గురించి వస్తున్న వార్తలను పవన్ ఖండించారు.

Tags : amit shahBJPchandrababujanasenamergemodipawan kalyanRAM MADHAVtanaYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu