04/19/19 6:13 PM

అదే నిజమైతే కాబోయే సీఎం పవన్ కల్యాణే

Janasena Will Form Government, Lakshminarayana Confidence

ఏపీలో పోలింగ్ ముగిసింది. 80శాతం పోలింగ్ నమోదైంది. పోటీ ప్రధానంగా రెండు పార్టీల మధ్యే ఉందని అంతా అనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చేది టీడీపీనా వైసీపీనా అని చర్చించుకుంటున్నారు. కాబోయే సీఎం చంద్రబాబు అని టీడీపీ నేతలు, కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలం అని టీడీపీ, వైసీపీ నాయకులు ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. అనూహ్యంగా ఈ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పవన్ కల్యాణ్ గెలిచినా చాలు అని అంతా అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో జనసేన నేత, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన జోస్యం ప్రజలను విస్మయానికి గురి చేసింది. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

ఇంతకీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే.. ఈ ఎన్నికల్లో జనసేకు 88 సీట్లు వస్తాయన్నారు. అంతేకాదు.. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. మే 23 తర్వాత ఫలితాలు వెల్లడయ్యాక జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీఎస్పీ, సీపీఐ, సీపీఎం మిత్రపక్షాలతో కలిసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు వెళ్లిన ఆయన.. స్థానికులతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వదని, ప్రభుత్వం ఏర్పాటుకు తమకు ఎవరి మద్దతు అవసరం లేదని లక్ష్మీనారాయణ అనడం విశేషం. పదవీ కాలం ఉండగానే ముందుగానే ఉద్యోగాన్ని వదిలేసి మంచి పని చేశానన్న ఆయన.. ప్రజల మధ్య సంతోషంగా ఉన్నానని తెలిపారు. సీబీఐ జేడీగా పని చేసి పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ జనసేన నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. విశాఖ పార్లమెంట్ స్థానానికి టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్, వైసీపీ నుంచి రియల్టర్, సినీ నిర్మాత ఎంవీవీవీ సత్యనారాయణ, బీజేపీ నుంచి పురందేశ్వరీ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

 

జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, 88 సీట్లు వస్తాయని లక్ష్మీనారాయణ అడనం హాట్ టాపిక్ గా మారింది. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు.. కానీ మరీ ఇంత కాన్ఫిడెన్సా? అని విస్మయం చెందుతున్నారు. ఆయనకు ఏ సంస్థ సర్వే చేసి పెట్టిందో కానీ.. మరీ 88 సీట్లు వస్తాయని చెప్పడం అసాధ్యం అంటున్నారు. సర్వేలన్నీ టీడీపీకి లేదా వైసీపీకి 90 నుంచి 100 సీట్లు వస్తాయని చెబుతుంటే.. లక్ష్మీనారాయణ ఇలా చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు. అసలు జనసేనాని పవన్ కల్యాణ్ గెలుపు మీదే చాలామందికి సందేహాలు ఉన్నాయని, అలాంటిది జనసేనకు అన్ని సీట్లు వస్తాయని చెబితే నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. మొత్తంగా లక్ష్మీనారాయణ చెప్పిన జోస్యం నిజం అవుతుందో లేదో తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

 

ఇక జనసేన అధికారంలోకి రావడమనే ముచ్చట ఎలాగున్నా.. ఎన్నికల్లో మాత్రం లక్ష్మీనారాయణ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొస్తున్నాయి. విశాఖ పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని.. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేసినప్పటికీ.. ఎంపీ ఓటు మాత్రం ఆయనకే వేయడానికి విశాఖవాసులు మొగ్గు చూపారని సమాచారం. సీబీఐ అధికారిగా క్లీన్ ఇమేజ్ ఉండటం లక్ష్మీనారాయణక ప్లస్ అయిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Tags : cbi ex jdchandrababujanasenaJd lakshmi narayanapawan kalyanTDPvisakhapatnamYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu