01/6/19 1:45 PM

చంద్రబాబు వల్లే ఘోరంగా ఓడిపోయాం

Komati Reddy Venkat Reddy Sensational Comments On Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరువు గంగలో కలిపేశారు. ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసేశారు. చంద్రబాబుతో పొత్తు అంటేనే భయపడేలా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవటానికి చంద్రబాబే కారణం అన్నారాయన. పొత్తుల వల్లే ఓడిపోయామని వాపోయారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా లాస్ అయ్యామన్నారు.

 

ఇతర పార్టీలతో పొత్తులు వద్దని తాను నెత్తి, నోరు బాదుకున్నా ఎవరూ వినలేదని కోమటిరెడ్డి వాపోయారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు అంటే.. వద్దే వద్దని తాను చెప్పానని అన్నారు. తెలంగాణలో టీడీపీ కేడర్ నామ మాత్రం అయ్యిందని అలాంటి పార్టీతో చేతులు కలపొద్దని చెప్పినా వినిపించుకోలేదన్నారు. టీడీపీతో పొత్తు వల్ల ఉద్యోగులు, యువత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని కోమటిరెడ్డి అనాలసిస్ చేశారు. ప్రజాకూటమి గెలిస్తే తెలంగాణలో మళ్లీ చంద్రబాబు పాలన వస్తుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటల్ని ప్రజలు బలంగా నమ్మారని చెప్పారు. సీట్లు పంచుకోలేని వాళ్లు.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే కనీసం 40 నుంచి 45 సీట్లు గెలిచి ఉండేదని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే పొత్తుల వల్ల ఘోరంగా ఓడిపోయామని ఆయన వాపోయారు. తన లాంటివారు కూడా ఓడిపోవడానికి పొత్తులే కారణమన్నారాయన. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవద్దని పార్టీ పెద్దలకు గట్టిగా చెప్పానని కోమటిరెడ్డి తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైకమాండ్ తనకు టికెట్ ఇస్తే నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కోమటిరెడ్డి భావిస్తున్నారు.

 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర పరాజయం తర్వాత తొలిసారి ఓ కాంగ్రెస్ నేత బాహాటంగా కూటమికి వ్యతిరేకంగా గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీని షాక్‌కు గురి చేశాయి. కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడేశాయి. చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తూ కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే సాహసం చేస్తారో లేదో తెలియాల్సి ఉంది.

Tags : CHANDRABBAUcongress tdp allianceKCRKomati reddy Venkat Reddypraja kutamisensational commentsTDPtelangana assembly electionstrs

Also read

Use Facebook to Comment on this Post



Menu