04/28/19 8:40 PM

జ్ఞానోదయం అయిందా? ఏపీ రాజకీయాలపై కేటీఆర్ యూ టర్న్

KTR Interesting Comments On AP CM

ఏపీకి కాబోయే సీఎం ఎవరు? ఇప్పుడిది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజలనే కాదు రాజకీయ నాయకులను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్న. ఏపీలో అధికారం చేపట్టేది ఎవరో తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే. గెలుపుపై టీడీపీ, వైసీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. అంతిమంగా ఓటరు దేవుడు ఎవరిని కరుణించాడు అనేది మే 23న తేలనుంది. ఇకపోతే.. ఏపీ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేటీఆర్ ఇచ్చిన జవాబు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

మొన్నటివరకు ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. ఈసారి టీడీపీకి ఓటమి తప్పదని చెప్పారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెబుతారని, బాబుగారు దిగిపోవడం ఖాయం అని పదే పదే అన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, చంద్రబాబు అవినీతి పాలనకు చరమగీతం పాడతారు అని స్పీచ్ లు ఇచ్చారు. అలాంటి కేటీఆర్.. ఏమైందో కానీ.. సడెన్ గా యూటర్న్ ఇచ్చారు. ఆదివారం నెటిజన్లతో #askktr అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆన్ లైన్‌లో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఏపీ రాజకీయాలపై కూడా నెటిజన్లు కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగారు. ఓ వ్యక్తి ఏపీలో గెలుపు ఎవరిది? మే 23 తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏంటి ? అని ఓ ప్రశ్నను కేటీఆర్‌ను అడిగారు. దీనికి స్పందిస్తూ కేటీఆర్ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.

 

నా అభిప్రాయంతో పని లేదని, ఆంధ్రా ప్రజలు దానిని నిర్ణయిస్తారని తెలివిగా జవాబిచ్చారు. అంతేకాదు తనకు ఏపీ రాజకీయాలపై ఆసక్తే లేదన్నారు. ఏపీ సీఎం పదవికి జగన్ కరెక్ట్ గా సరిపోతాడని అని మీరు నిజంగా అనుకుంటున్నారా? అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా కేటీఆర్ స్పందించారు. ఏపీ ప్రజలు ఎలాంటి నిర్ణయం ఇస్తారో వేచి చూద్దామని సమాధానమిచ్చారు. 2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 2024 చాలా దూరంలో ఉందని కేటీఆర్ ఆన్సర్ ఇచ్చారు.

 

ఏపీ సీఎంని ప్రజలే నిర్ణయిస్తారు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం లేకపోలేదు. గతంలో ఎన్నోసార్లు చంద్రబాబుపై విమర్శలు చేసిన కేటీఆర్… ఇప్పుడు ఇలా అనడం ఏంటా అని డిస్కస్ చేసుకుంటున్నారు. జగన్‌కు మద్దతిస్తూ… కేటీఆర్, సీఎం కేసీఆర్ కూడా అనేక సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు హైదరాబాద్‌‌లో లోటస్ పాండ్‌కు వెళ్లి జగన్‌తో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు కూడా జరిపారు కేటీఆర్. ఏపీ రాజకీయాలపై ఓపెన్ గా మాట్లాడారు. కాబోయే సీఎం జగన్ అన్నట్టుగా కామెంట్స్ చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సడెన్ గా ఎందుకిలా అన్నాడు. ఏపీ సీఎంని ప్రజలే నిర్ణయిస్తారు అనడమే కాకుండా.. నాకు ఏపీ రాజకీయాలపై ఆసక్తి లేదని కేటీఆర్ చెప్పడం వెనుక మతలబేంటి అని రాజకీయ నేతలు డిస్కస్ చేసుకుంటున్నారు. కేటీఆర్ లో ఈ మార్పు రావడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తున్నారు. ఏపీలో పెరిగిన పోలింగ్ టీడీపీ గెలుపుకి సంకేతం అని, ఈ విషయం తెలిసే కేటీఆర్ యూటర్న్ తీసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబే అని తెలిసి.. కేటీఆర్ సైలెంట్ అయ్యారని చెబుతున్నారు.

Tags : ap cmap politicsask ktrchandrababu naiduktrtrsYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu