12/1/18 9:51 PM

ఏపీలోనూ కేసీఆర్ పోటీ చేస్తే.. చంద్రబాబుకి చుక్కలేనా..?

KTR Strong Warning To Chandrababu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి టీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వారం రోజులుగా మహాకూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అనవసరంగా తెలంగాణలో జోక్యం చేసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం ఏంటని విరుచుకుపడ్డారు. పుట్టలో వేలు పెడితే చీమ అయినా కుడుతుందని అన్నారు. అలాంటిది తెలంగాణలో వేలు పెట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి చూస్తామని.. అవసరమైతే ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రాలో పోటీ చేయడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెనుకాడబోరని సంకేతాలు పంపారు. కూకట్‌పల్లిలో కాపు సామాజికవర్గం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

చంద్రబాబు తన శక్తిని ఎక్కువగా ఊహించుకుంటున్నారని ధ్వజమెత్తిన కేటీఆర్.. ఆయనకు ఎలా బుద్ది చెప్పాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. ఇలాంటి నాటకాలు ఆడితేనే అమరావతి వరకు తరిమి కొట్టారని వ్యాఖ్యానించారు.

 

చంద్రబాబుకి బుద్ధి చెప్పటానికి ఏపీలో తాము కూడా పోటీ చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఏపీ పాలిటిక్స్‌లో టీఆర్ఎస్ వేలి పెడితే.. చంద్రబాబుకి నష్టమా.. లాభమా.. అసలు ఏపీలో టీఆర్ఎస్‌ను ఆదరిస్తారా అనే చర్చ మొదలైంది.

 

ఏపీలో టీఆర్ఎస్ కూడా ఎంట్రీ ఇస్తే.. చంద్రబాబు ఏమీ అనలేని పరిస్థితి. తెలంగాణ వాళ్లకు ఏపీలో ఏం పని? అని చంద్రబాబు నిలదీయలేరు. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంది కాబట్టి. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే తప్పులేనిది.. టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే తప్పా? అనే విమర్శలు వస్తాయి. ఈ కారణంగా ఏపీ రాజకీయాల్లోకి టీఆర్ఎస్‌ను చంద్రబాబు స్వాగతించాల్సిందే.

 

ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ వేలు పెట్టటం అంటే.. పోటీ చేయటమే. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం వస్తుంది అనేది కొందరి వాదన. తెలంగాణలో పార్టీని చంపుకుని ఏపీకే పరిమితం అయిన జగన్.. టీఆర్ఎస్ పాత్రను ప్రశ్నిస్తూ లోకల్ సెంటిమెంట్‌ను తీసుకురావొచ్చు. ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని, ఇది టీడీపీకి నష్టం చేయొచ్చనే విశ్లేషణ వినిపిస్తోంది.

 

ఏ విధంగా అయితే చంద్రబాబు ఏపీలో సీఎంగా ఉండే.. తెలంగాణ రాజకీయాల్లో తిరుగుతున్నారో.. రేపటి రోజున కేసీఆర్ కూడా జాతీయ ప్రయోజనాల పేరుతో కాంగ్రెస్ – బీజేపీ యేతర ప్రభుత్వం లక్ష్యంగా ఏపీలోని జగన్, పవన్ కల్యాణ్‌తో కలిసి పోరాడవచ్చు. ఉద్యమ నేతగా, తెలంగాణ సాధించిన లీడర్ గా ఏపీలోని ప్రతి ఒక్కరికీ కేసీఆర్ సుపరిచితులే. ఈ పరిచయం చాలు ఏపీలో వేలు పెట్టటానికి అంటున్నారు నెటిజన్లు. ఇక ఏపీలోనూ కేసీఆర్‌కు ఫ్యాన్స్ లేకపోలేదు. గతంలో కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆయనకు స్థానిక ప్రజల నుంచి లభించిన స్వాగతమే దీనికి నిదర్శనం.

 
మొత్తంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళతారనే సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే.. ఏపీలో టీడీపీ ప్రత్యర్థి పార్టీలను కలుపుకుని కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ లీడర్‌గా అవతారం ఎత్తినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags : KCRktrktr warns chandrababupawan kalyanTDPtrstrs in andhrapradeshys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu