10/31/16 11:41 AM
ఆంధ్రాలో ఐటీ సంస్థలకు అనువైన భవనాలేవీ..?

హైదరాబాద్, హైటెక్ సిటీ.. అది తాము చేసిన అభివృద్ధిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, సాఫ్ట్వేర్ సంస్థలు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు రావడానికి చంద్రబాబు చేసిన కృషి చాలానే ఉంది. అయితే, తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆంధ్రాకు కూడా హైదరాబాద్ స్థాయిలోనే ఐటీ సంస్థలు వస్తాయని ఆశించారు! ఎందుకంటే, చంద్రబాబు సీఎం కాబట్టి. అయితే, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు చెప్పుకోవాలి. ఆంధ్రాలో సంస్థలు ఏర్పాటు చేసేందుకు కొన్ని ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నా.. వాటికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేకపోతోందట! దాదాపు 30 కంపెనీలు తమ శాఖల్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. మరికొన్ని సంస్థలు కూడా విజయవాడలో ఆఫీసులు తెరవాలని చూస్తున్నాయి. అయితే, ఈ సంస్థల అవసరాలకు అనువుగా ఉండే భవనాలు లభించడం లేదట! ఆఫీస్ అవసరాలకు పనికొచ్చే భవనాలు విజయవాడలో ఎంత వెతికినా దొరకడం లేదని ఓ ప్రముఖ సంస్థకు చెందిన ప్రతినిధి వాపోతున్నారు! గత ఏడాది కాలంగా ఆఫీస్ భవనాల కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోందని ఆయా కంపెనీలవారు చెబుతున్నారు.
ఆంధ్రా ఏర్పడ్డ తరువాత విజయవాడలో పెద్ద ఎత్తున కొత్త నిర్మాణాలు మొదలయ్యాయి. దాదాపు 30 వేలకు పైగా అపార్ట్మెంట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఐటీ ఆఫీస్‌లకు అనువుగా ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టేందుకు బిల్డర్లు ముందుకు రావడం లేదు. ఈ అపార్ట్మెంట్లన్నీ సంప్రదాయబద్ధంగానే నిర్మిస్తున్నారు. ఒకవేళ ఈ భవనాలను ఆఫీస్‌ల కోసం తీసుకున్నా కూడా భారీ ఎత్తున మార్పులు చేయాల్సి ఉంటుందనీ, అదనపు ఖర్చు చాలా ఉంటుందనీ ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిస్థితి కేవలం విజయవాడలో మాత్రమే కాదు.. విశాఖపట్నంలో కూడా ఉందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. వైజాగ్‌లో ఐటీ కంపెనీలు పెట్టాలన్నా ఆఫీస్‌లకు పనికొచ్చే భవనాలు అక్కడ కూడా కనిపించడం లేదట! కేవలం ఐటీ సంస్థల అవసరాల కోసం కార్పొరేట్ ఆఫీస్ స్పేస్‌లను నిర్మించేందుకు బిల్డర్లు మొగ్గు చూపడం లేదు. ఒకవేళ అలా నిర్మించినా ఖాళీగా పెట్టుకోవాలేమో అనే భయం కొంత ఉంది. అందుకే, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు మాత్రమే భారీగా నిర్మిస్తున్నారు. వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంది. మరి, ఈ దిశగా చంద్రబాబు సర్కారు దృష్టి సారిస్తే బాగుంటుంది. అభివృద్ధి అంటే కేవలం అమరావతి నిర్మాణం ఒక్కటే కాదు కదా! విజయవాడకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆ ముప్ఫై సంస్థలకూ ఆఫీస్ స్పేస్ చూపిస్తే.. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది.
Tags : amaravatiandhra pradeshBacking offbuilding office Spaceschandrababu naiduhyderabadit companiesIT Companies in APOffice Spacereal estatevijayawadavisakhapatnam