12/4/18 9:50 PM

కేసీఆర్‌కు కష్టమే..? లగడపాటి సంచలన సర్వే

Lagadapati Rajagopal Shocking Survey On Telangana Assembly Elections

లగడపాటి రాజగోపాల్. ఆంధ్రా అక్టోపస్‌గా పేరుంది. ఎన్నికల సర్వేలకు లగడపాటి కేరాఫ్. ఇప్పటివరకు ఆయన వెలువరించిన సర్వేలు దాదాపుగా నిజమయ్యాయి. దీంతో లగడపాటి సర్వేలకు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. సర్వేలు చేయడం మాత్రం మానలేదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ లగడపాటి రాజగోపాల్ తన సర్వేలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులు ఎనిమిది నుంచి పదిచోట్ల గెలుస్తారని చెబుతూ ఇటీవల లగడపాటి రాజగోపాల్ వెలువరించిన సర్వే ఫలితాలు కలకలం రేపాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ సర్వే ఉందని లగడపాటిపై టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వేడి చల్లారకముందే లగడపాటి రాజగోపాల్ మళ్లీ సర్వే ఫలితాలు అంటూ మీడియా ముందుకు వచ్చేశారు. ప్రస్తుతానికి హస్తానిదే హవా అని, టీఆర్ఎస్‌కు గడ్డు కాలమే అని బాంబు పేల్చారాయన.

 

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై లగడపాటి మరోసారి తన సర్వేలో పాక్షిక వివరాలు వెల్లడించారు. ఓటింగ్ శాతం పెరిగితే కూటమికి అవకాశముంటుందని, తగ్గితే హంగ్ వచ్చే అవకాశముందని జోస్యం చెప్పారు. యథాతథంగా ఉంటే ఎవరు వస్తారో చెప్పలేమన్నారు. అయితే, గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగితే అంచనాలు తారుమారు కావచ్చన్న విషయాన్ని గమనించాలని కోరారు. ప్రస్తుతం ప్రజానాడి కాంగ్రెస్ పార్టీ వైపు ఉందన్నారు. ఈసారి ఎన్నికలు పోటీపోటీగా జరుగుతాయని..వన్‌సైడ్‌గా మాత్రం ఉండవని స్పష్టం చేశారు. ఈసారి పోలింగ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఆసక్తికరమని పేర్కొన్నారు. ఓటింగ్ పెరిగితే ఫలితం ఓ రకంగా, తగ్గితే మరో రకంగా ఉంటుందని విశ్లేషించారు. పోలింగ్ సరళి కూడా ఫలితాలను మార్చివేస్తాయని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మరో ముగ్గురు గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి వినోద్ గెలుస్తారని లగడపాటి చెప్పారు. కాంగ్రెస్ రెబెల్‌గా బీఎస్పీ అభ్యర్థిగా మల్‌రెడ్డి రంగారెడ్డి పోటీ చేస్తున్నారు. జలంధర్ రెడ్డి టీఆర్ఎస్ రెబెల్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక వినోద్ టీఆర్ఎస్ రెబెల్‌గా బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి, బోథ్ నుంచి అనిల్ జాదవ్ గెలుస్తారని ఇదివరకు ఇద్దరి పేర్లను లగడపాటి చెప్పిన సంగతి తెలిసిందే. కొందరు ఓడిపోయే వారు కూడా ఉన్నారని, అందులో తన సన్నిహితులు కూడా ఉన్నారని.. కానీ ఓడిపోయే వారి గురించి తాను చెప్పడం లేదని లగడపాటి అన్నారు. ఓడిపోయే వారి గురించి చెప్పవద్దని వారు తనకు విజ్ఞప్తి చేశారని అందుకే చెప్పడం లేదని తెలిపారు. మిగతా ఫలితాలను తాను 7వ తేదీన సాయంత్రం చెబుతానని లగడపాటి వెల్లడించారు.

 

ఈ సందర్భంగా ఏ జిల్లాల్లో ఏ పార్టీ ఆధిక్యం సాధిస్తుందో కూడా లగడపాటి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగు జిల్లాల్లో (ఉమ్మడి) ప్రజాకూటమి ఆధిక్యంలో ఉంటుందని చెప్పారు. మూడు జిల్లాల్లో టీఆర్ఎస్, రెండు జిల్లాల్లో పోటా పోటీ ఉంటుందని చెప్పారు. ఖమ్మం, అదిలాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తుందని లగడపాటి వెల్లడించారు. అలాగే వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఉంటుందని.. కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పోటాపోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

 

ఇక హైదరాబాద్‌లో ఎక్కువ స్థానాల్లో ఎంఐఎం, ఆ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలుస్తాయన్నారు. బీజేపీకి గతంకన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో గత 45 రోజుల్లో ఈ సర్వే నిర్వహించామని, ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1200 నమూనాలు తీసుకున్నామని, అన్ని సామాజిక వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించామని లగడపాటి వివరించారు.

 

ఓటింగ్ ఎక్కువగా ఉంటే ప్రస్తుత జననాడి ప్రకారం ప్రజా కూటమిదే విజయమని అభిప్రాయపడ్డారు. అయితే గతంలో వచ్చినట్లు 68.5 శాతం ఓటింగ్ జరిగితేనే అని, ఓటింగ్ అటు ఇటు అయితే ఫలితాలు కూడా తారుమారు అవుతాయని చెప్పారు. యథాతథంగా పోలింగ్ శాతం ఉంటే ఫలితం ఎలా ఉంటుందో 7న చెబుతానని అన్నారు. అయితే ఈ రెండు రోజుల్లో కూడా మార్పులు చేర్పులు జరగొచ్చని, కాబట్టి 7న ఓటింగ్ శాతాన్ని బట్టి కచ్చితమైన ఫలితాలు చెబుతానని అన్నారు.

 

ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దేనని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ అదే విషయం చెప్పాయి. ఈ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలవడం ఖాయం అని, మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అలాంటి ఈ తరుణంలో లగడపాటి అనౌన్స్ చేసిన సర్వే వివరాలు చర్చనీయాంశంగా మారాయి.

 

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా అని తన సర్వేలో తేలినట్లు లగడపాటి చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. లగడపాటి సర్వే వివరాలపై టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అది చిలక జోస్యమని, దానిపై ఆగం కావొద్దని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణపై అన్ని రకాలుగా దాడి జరుగుతోందని మండిపడ్డారు. లగడపాటిది లంగ సర్వే అని సీఎం కేసీఆర్ కూడా తీవ్రంగా విమర్శించారు. అది బూటకపు సర్వే.. దానిని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు అని కేసీఆర్ స్పష్టం చేశారు.

Tags : ALLIANCECONGRESSKCRLagadapati rajagopallagadapati rajagopal sensational survytelangana assembly electionstrs

Also read

Use Facebook to Comment on this PostMenu