05/19/19 10:00 AM

జగన్‌ ఓటమి ఖాయం : లగడపాటి రాజగోపాల్ జోస్యం నిజమవుతుందా

Lagadapati Sensational Survey, TDP Win Again

ఏపీలో మరోసారి గెలవబోయేది తెలుగుదేశం పార్టీనేనా? కాబోయే సీఎం చంద్రబాబేనా? జగన్ కి మరోసారి భంగపాటు తప్పదా? అంటే అవుననే అంటున్నారు ఆంధ్రా ఆక్టోపస్, సర్వే స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సర్వేలు చెయ్యడం లగడపాటికి అలవాటు. ఈసారి కూడా ఆయన తన సర్వేలతో వచ్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అనేది పరోక్షంగా క్లూ ఇచ్చారు. ఏపీ ప్రజలు సైకిల్ పై ప్రయాణం చేశారని లగడపాటి చెప్పారు. ఈ రకంగా మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుంది అని ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారు. ఇక తెలంగాణలో కారుదే జోరు అన్నారు. తెలంగాణలో కారు ప్రయాణం చేశారని చెప్పడం ద్వారా టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధిస్తుందని పరోక్షంగా వెల్లడించారు. ఎన్నికల ఫలితాలకు ముందు తన సొంత సర్వే ఫలితాలు వెల్లడించడానికి ఆయన తిరుపతిని వేదికగా ఎంచుకున్నారు. ఆదివారం తిరుపతిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది చెబుతానని లగడపాటి తెలిపారు.

 

శనివారం అమరావతిలో మీడియాతో లగడపాటి మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి అక్కడ కారు ప్రయాణాన్నే కోరుకున్నారని, ఏపీ అప్పుల రాష్ట్రం కాబట్టి… పరిస్థితుల కారణంగా ఏపీ ప్రజలకు సైకిలే కనిపించిందని లగడపాటి అనాలసిస్ చేశారు. ఎవరి పరిస్థితుల్లో వాళ్లు తమకు అందుబాటులో ఉన్న వాహనం ఎక్కేశారని ఫలితాల తీరుతెన్నులను చెప్పకనే చెప్పేశారు. ఏపీలో హంగ్ వచ్చే అవకాశాలు లేవని, గెలిచే పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందని లగడపాటి తేల్చి చెప్పారు. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం వస్తుందని… సమైక్య రాష్ట్రంలో కానీ, రెండు రాష్ట్రాల్లో కానీ తెలుగు ప్రజలు స్పష్టమైన తీర్పునే ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత వెల్లడించాల్సి ఉన్నందున ఆ తర్వాతే పూర్తి వివరాలు చెబుతానని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన అంచనాలు తప్పడానికి కారణాలు కూడా వివరిస్తానని అన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు.

 

ఏపీలో 90 శాతానికి పైగా ప్రజలు మూడు పార్టీలకే ఓటు వేశారని లగడపాటి చెప్పారు. ఏపీలో హంగ్ వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. గెలిచే పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందన్నారు. ఏపీ ప్రజలు ఎప్పుడూ ఇలాంటి తీర్పే ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా ఈ మాట చెబుతున్నానని వివరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత తిరుపతిలో ఎన్నికల ఫలితాలపై తాను చేసిన సర్వే పూర్తి వివరాలు వెల్లడిస్తానని లగడపాటి చెప్పారు. ఏపీ, తెలంగాణతో పాటు కేంద్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెబుతానన్నారు. అదే సమయంలో లగడపాటి కీలక విన్నపం చేశారు. తన సర్వే అంచనాలు ఆధారం చేసుకుని బెట్టింగ్ లు కాయొద్దని కోరారు. తాను చెప్పే ఫలితాలు రాజకీయం కోణంలో చూడొద్దన్నారు.

 

తనకు ఏ పార్టీతో సంబంధం లేదని లగడపాటి క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీకి అనుకూలంగా వ్యవహరిచండం లేదన్నారు. వైసీపీ అధినేత జగన్ కుటుంబం తనతో మరింత సన్నిహితంగా ఉంటుందన్నారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు.. జగన్ కుటుంబసభ్యులను తాను కలిశానని లగడపాటి వెల్లడించారు. టీడీపీ కన్నా వైసీపీ నేతలతోనే తనకు ఎక్కువ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తన సర్వేలపై విశ్వసనీయతకు ఇది తుది పరీక్ష అని లగడపాటి చెప్పారు. శాస్త్రీయంగా చేసిన సర్వేలో ఆదివారం అంకెలతో సహా చెబుతాను అని లగడపాటి అన్నారు. ప్రజల నాడి తెలుసుకోవడం తన హాబీ అని లగడపాటి చెప్పారు.

 

లగడపాటి సర్వే రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అని వైసీపీ నేతలు చాలా నమ్మకంగా ఉన్నారు. కాబోయే సీఎం జగన్ అని ధీమాగా ఉన్నారు. 100కు పైగా సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సర్వేల విషయంలో లగడపాటికి విశ్వసనీయత ఉంది. ఆయన చేసిన సర్వేలు చాలావరకు నిజమయ్యాయి. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నింపాయి. అదే సమయంలో ఫస్ట్ టైమ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆయన సర్వే తలకిందులైంది. కాంగ్రెస్, టీడీపీతో కూడిన మహాకూటమి గెలుస్తుందన్నారు. కానీ టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించింది. దాంతో లగడపాటి నవ్వుల పాలయ్యారు. ఆయన సర్వేలపై నమ్మకాలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి లగడపాటి చెప్పిన జోస్యం నిజమవుతుందా? మరోసారి టీడీపీ గెలుస్తుందా? వీటికి సమాధానాలు తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

Tags : ap electionschandrababu naiduKCRLagadapati rajagopalsurveytdp winTelanganaYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu