08/19/19 8:34 PM

ఏపీలో ప్రాణహాని రాజకీయాలు : ఎవరిని ఎవరు చంపుతారు?

Life Threat Politics Shake AP

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో ప్రస్తుతం ప్రాణహాని రాజకీయాల ట్రెండ్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్షం నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. మాకు ప్రాణహాని ఉందని పోటీలు పడి మరీ పోలీసులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అసలు ఎవరికి ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? ఎవరు ఎవరిని చంపుతారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.

 

మాజీ సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు హత్యకి కుట్ర జరుగుతోందని, ప్రాణహాని ఉందని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు భద్రత తగ్గించడం, ఆయన ఇంటిని డ్రోన్ కెమెరాలతో షూట్ చెయ్యడం.. ఇవన్నీ అందులో భాగమే అని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై పోలీసు పెద్దలకు ఫిర్యాదు కూడా చేశారు. ఏదో జరుగుతోంది.. చంద్రబాబుకి ప్రాణహాని ఉంది అని అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబుకి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. చంద్రబాబుకి ఏమన్నా అయితే.. సీఎం జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన హెచ్చరికలు చేశారు.

 

”చంద్రబాబు హత్యకు కుట్రలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో చంద్రబాబు ఇంటి ఫోటోలు తీసుకున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర మంత్రులు రెక్కీ చేశారు. దీనిపై అనుమానాలు ఉన్నాయి. బాబును‌ రక్షించుకునేందుకు అవసరమైతే సీఎం జగన్ ఇంటి ముందు ఆత్మహత్యకు సిద్ధం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న. చంద్రబాబు భద్రతపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కు లేఖ రాస్తానన్నారు. తమ అధినేతకు కేంద్ర రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

 

టీడీపీ నేతల ఆరోపణలు ఇలా ఉంటే.. వైసీపీ ఎమ్మెల్యే కూడా రంగంలోకి దిగారు. నాకు ప్రాణహాని ఉందని స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. టీం-లోకేష్, చెన్నై టీడీపీ ఫోరం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో తనమీద, సీఎం జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా టీం-లోకేష్ అనే గ్రూపులో నాని చౌదరి అనే టీడీపీకి చెందిన అతను పోస్టులు పెట్టాడని ఆర్కే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తరిమి తరిమి కొడతానని బెదిరిస్తున్నారని, ‘మీ నాయకుడు జగన్ జైలుకు పోవటం ఖాయమని’ బెదిరిస్తున్నారని, అసభ్యపద జాలంతో పోస్టులు పెడుతున్నారని ఆర్కే పోలీసులకు తెలిపారు.

 

ఇటీవల కృష్ణా నదికి వరదలు రావడంతో కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు నీరు చేరాయి. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా పరస్పర విమర్శలు చేసుకున్నారు. దీంతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ తరఫున ఆర్కే, టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేశారు. లోకేష్ మీద ఆర్కే విజయం సాధించారు. అప్పటి నుంచి మాటల యుద్ధం నడుస్తోంది. మొత్తంగా ఏపీలో ప్రాణహాని రాజకీయాల ట్రెండ్ నడుస్తోంది. ఇంకా ఎంతమంది నేతలు పోలీసులను ఆశ్రయిస్తారో చూడాలి.

Tags : alla Ramakrishna reddyBuddha venkannachandrababucm ys jaganlife threatnara lokesh

Also read

Use Facebook to Comment on this Post



Menu