02/4/19 11:43 AM

సెంటర్ వర్సెస్ స్టేట్ : ప్రధాని మోడీకి గట్టి షాక్ ఇచ్చిన ముఖ్యమంత్రి

Mamata Banerjee Gives Big Shock To Modi

దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సెంటర్ వర్సెస్ స్టేట్‌గా పరిస్థితి తయారైంది. సీబీఐ వర్సెస్ పోలీసులుగా మారింది. ప్రధాని మోడీ, సీఎం మమతా మధ్య వార్ మరింత ముదిరింది. ఫైర్ బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు ఉన్న మమతా బెనర్జీ సీఎం ఉన్న వెస్ట్ బెంగాల్‌లో చోటు చేసుకున్న పరిణామాలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు అడ్డుకుని నిర్భందించడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు కేంద్రం వైఖరికి నిరసనగా సీఎం మమతా బెనర్జీ దీక్షకు కూర్చోవడం రాజకీయ వర్గాల్లో మరింత హీట్ పెంచింది.

 

కేంద్రం తీరును నిరసిస్తూ ఆదివారం రాత్రి మమత ‘సత్యాగ్రహ’ ధర్నా చేపట్టారు. రాతంత్రా మెలకువగానే ఉన్న ‘దీదీ’ ఆహారం కూడా తీసుకోలేదు. దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేంత వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. సెంట్రల్ కోల్‌కతాలో ఆదివారం రాత్రి నుంచి దీక్ష చేస్తున్నారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ నిరసనగా మెట్రో ఛానెల్ ఎదుట ఆమె దీక్ష చేస్తున్నారు. మమతకు మద్దతుగా భారీ ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు దీక్షలో పాల్గొన్నారు. అసెంబ్లీ కార్య‌క‌లాపాలు తాను కూర్చొన్న చోట‌నే జ‌రుగుతాయ‌ని దీదీ ప్ర‌క‌టించారు. కేంద్ర ప్రభుత్వం చర్యకు నిరసనగా బెంగాల్ రాష్ట్రమంతటా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేయడానికి సిద్ధమయ్యారు.

 

శారద చిట్‌ఫండ్ స్కాం కేసు కేంద్రం, రాష్ట్రం మధ్య చిచ్చు రాజేసింది. ఈ కేసు దర్యాప్తులో కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యక్ష పోరుకు దిగాయి. కేసు దర్యాప్తులో భాగంగా కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అడ్డుకోవడం కలకలం రేపింది. సీబీఐ అధికారులను అడ్డుకోవడమే కాకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ వెంటనే పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ అధికారులు కమిషనర్ ఇంటికి వచ్చారన్న విషయం తెలుసుకున్న సీఎం మమతా బెనర్జీ తక్షణమే అక్కడికి వెళ్లారు. కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు మద్దతు ప్రకటించారు. మోడీ ప్రభుత్వం తమపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని మమత ఆరోపించారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మెట్రో సినిమా థియేటర్ వద్ద ధర్నాకు దిగారు.

 

రాజ్యాంగ పరిరక్షణ కోసం, సమాఖ్యా స్ఫూర్తిని కాపాడేందుకు తాను దీక్షకు దిగానని సీఎం మమత చెబుతున్నారు. తమపై రాజకీయ కక్ష సాధించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు. ఉత్తమ పోలీసు అధికారుల్లో రాజీవ్ కుమార్ ఒకరని ఆమె తెలిపారు. కేంద్రంపై గుర్రుగా ఉన్న మమతా బెనర్జీ.. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. సీబీఐని అజిత్ దోవల్ నడిపిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆడించినట్లు అజిత్ దోవల్ తల ఊపుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ సవాల్ విసిరారు.

 

కేంద్రంపై పోరుబాట పట్టిన మమతాబెనర్జీకి అనూహ్య మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీదీకి ఫోన్ చేశారు. పూర్తిస్థాయిలో అండగా ఉంటామని మద్దతు ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు దేవెగౌడ, స్టాలిన్, తేజస్వి యాదవ్, ఒమర్ అబ్దుల్లా తదితర నేతలు మమతాతో మాట్లాడారు. ఆమె దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో మోడీ వర్సెస్ దీదీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

 

మమతా బెనర్జీ తీరుపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. మమతా బెనర్జీ ఆరోపణలను వారు ఖండించారు. చిట్ ఫండ్ స్కాంలో నిజాలు వెలుగులోకి రాకుండా సీఎం మమతా బెనర్జీ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ అధికారులను అడ్డుకోవడం చట్టరిత్యా నేరం అన్నారు. దీనిపై కోర్టుకి వెళతామన్నారు. సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. కుంభకోణంలో తమ పేర్లు బయటపడకుండా కొత్త డ్రామాకు తెరతీశారని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.

 

కాగా, సీఎం మమతా బెనర్జీ దీక్షకు కూర్చోవడం 13 ఏళ్ల తర్వాత ఇదే. 13 ఏళ్ల క్రితం అప్పటి వామపక్ష ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. ఏకంగా 26 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె దీక్షకు కూర్చున్నారు.

Tags : cbi vs kolkata policemamata banerjeemamata banerjee dharnapm modistate vs centrewest Bengal cm

Also read

Use Facebook to Comment on this PostMenu