08/5/19 7:57 PM

దేశ చరిత్రలో సంచలనం : ఆర్టికల్ 370 రద్దు, రెండు ముక్కలైన జమ్మూకాశ్మీర్

Modi Sensational Decision, Article 370 Scrapped

దేశ చరిత్రలో సంచలనం నమోదైంది. ఏ ప్రధాని చేయని సాహసం మోడీ చేసి చూపించారు. ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ ని ఆయన టచ్ చేశారు. పంతం నెగ్గించుకున్నారు. దశాబ్దాలుగా రావణకాష్టంలా రగులుతున్న అంశానికి ఇక శాశ్వతంగా తెరదించే పరిష్కారం చూపించారు. ఇండియాకి బిగ్ ప్రాబ్లమ్ గా మారిన జమ్మూకాశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది.

 

ఊహించినట్టే జరిగింది. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని మోడీ సర్కార్ రద్దు చేసింది. దాంతో పాటే 35-ఏ రద్దయ్యింది. అంతేకాదు జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించారు. రెండు ముక్కలు చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ ఏర్పడనున్నాయి. కశ్మీర్ కి ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో.. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి హోదాని కోల్పోయింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్ అంశంపై నాలుగు బిల్లులు ప్రవేశపెట్టారు.

 

ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడం, ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం.. అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఇక జమ్మూకాశ్మీర్ లో కేవలం భారత జెండా మాత్రమే ఎగురుతుంది. జమ్మూకాశ్మీర్ శాంతిభద్రతలు కేంద్రం చేతిలోనే ఉంటాయి. జమ్మూకాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం అయ్యింది.

 

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజనతో పాకిస్తాన్ కుట్రలకు చెక్ పడిందని అమిత్ షా అన్నారు. స్థానిక యువతలో విద్వేష బీజాలు నాటి పెంచారని, పాకిస్తాన్ కుట్ర పూరితంగా సాగించిన చర్యలకు ఇక్కడి యువత బలయ్యారని చెప్పారు. ‘ఉగ్రవాదం’ అనే విషవృక్షాన్ని పెకిలించేందుకే కశ్మీర్ లో ఈ పరివర్తన ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టికల్ 370 రద్దుతో అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు.

 

ఈ ఆర్టికల్ ఉన్నంత వరకూ కశ్మీర్ యువత భారత్ లో కలవదని పాక్ నేత జియావుల్ హక్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. పాక్ ప్రేరేపిత వేర్పాటువాదుల వల్లే ఈ సమస్య తలెత్తిందని విమర్శించారు. ఆర్టికల్ 370 కోసం పట్టుబట్టే వారి పిల్లలు ఎక్కడున్నారో గుర్తుచేసుకోవాలని సూచించారు. వేర్పాటువాదుల పిల్లలంతా అమెరికా, ఇంగ్లాండు లలో చదువుకుంటున్నారని విమర్శించారు. జమ్ముకశ్మీర్ యువతకు మంచి భవిష్యత్తు అందించాలని అనుకుంటున్నామని, కశ్మీర్ లో ఉగ్రవాదం పోవాలంటే ఈ ఆర్టికల్ రద్దు తప్పదని స్పష్టం చేశారు.

 

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఈ ఆర్టికల్ ను కదిపే సాహసం చేయలేదని, ఒక తాత్కాలిక ఆర్టికల్ ను ఇలా ఎన్నాళ్లూ కొనసాగిస్తారని ప్రశ్నించారు. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసిన సంస్థాలన్నీ ఈరోజు భారత్ లో అంతర్భాగంగా ఉన్నాయని, ఆ సంస్థానాల్లో ఎక్కడి ఆర్టికల్ 370 అమల్లో లేవని అన్నారు. ఆర్టికల్ 370 వల్లే జమ్ముకశ్మీర్ విలీనం జరిగిందన్న వాదన తప్పదని, ఆ ఆర్టికల్ లేకుంటే భారత్ నుంచి జమ్ముకశ్మీర్ విడిపోతుందని అంటున్నారని అవన్నీ భ్రమలేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

 

ఆర్టికల్ 370, 35-A రద్దుతో జమ్ముకశ్మీర్ కు కచ్చితంగా లాభమే చేకూరుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 పేరుతో ఇప్పటి వరకూ అడ్డుగోడలు కట్టారని, ఇప్పటికైనా వాటిని తొలగిద్దామని అన్నారు. ఈ ప్రాంత యువతులు ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకుంటే వారు ఆస్తి హక్కు కోల్పోతున్నారని, అక్కడి మహిళలకు సాధికారత రావాలంటే ఈ ఆర్టికల్ రద్దు కావాలని అన్నారు. జమ్ముకశ్మీర్ లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని చెప్పారు. ఈ బిల్లులో న్యాయపరంగా ఎలాంటి లోపాలు లేవని, ఈ బిల్లు పూర్తిగా న్యాయ సమీక్షకు నిలబడుతుందని స్పష్టం చేశారు.

 

ఆర్టికల్ 370 రద్దుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. జమ్మూకాశ్మీర్ కి చెందిన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేసిందని, ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని పీడీపీ నేతలు అన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కులను మోడీ హరించారని, వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలు మాత్రం.. అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ఇక దీనిపై శత్రుదేశం పాకిస్తాన్ కూడా స్పందించింది. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ షాక్ తింది. ఇది అన్యాయం, అక్రమం అని ఓవరాక్షన్ చేసింది. జమ్మూకాశ్మీర్.. పాకిస్తాన్ దేశంలో భాగం అన్నట్టు మాట్లాడింది. దీనిపై ఐక్యరాజ్యసమితిలో పోరాటం చేస్తామని ప్రకటించింది.

 

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ పునర్ విభజనతో.. భవిష్యత్తులో ఏం జరగనుంది. బీజేపీ చెబుతున్నట్టు జమ్మూకాశ్మీర్ ప్రజలకి, దేశానికి మంచి రోజులు వచ్చినట్టేనా? తీవ్రవాదం సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా? పాకిస్తాన్ కుట్రలకు ఇక చెక్ పడినట్టేనా? దేశంలో శాంతిభద్రతలు వెల్లివిరుస్తాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటికి సమాధానం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఏది ఏమైనా ప్రధాని మోడీ చేసిన సాహసాన్ని ప్రశంసించాల్సిందే అని నెటిజన్లు అంటున్నారు. దేశ ప్రయోజనాల కోసం మోడీ పడుతున్న శ్రమ అభినందనీయమే.

 

ఆర్టికల్ 370 రద్దుతో ఇవన్నీ సాధ్యమవుతాయా?
* కశ్మీర్ లో పరిస్థితులు చక్కబడతాయా
* కశ్మీర్ లో రక్తపాతం అంతమవుతుందా
* కశ్మీర్ లో ఇన్నేళ్లు నెలకొన్న అస్థిరత, అశాంతి తొలగిపోతాయా
* దేశంలోని ఇతర ప్రాంతాలలాగే కశ్మీర్ లోనూ వేగంగా అభివృద్ది జరగుతుందా
* కశ్మీర్ లో అవినీతి పాలన అంతమవుతుందా
* మహిళలకు న్యాయం జరుగుతుందా
* కశ్మీర్ ను సాకుగా చూపి దేశమంతా ఉగ్రవాదాన్ని విస్తరించేదుకు పాకిస్తాన్ చేసిన కుట్రలకు చెక్ పడుతుందా

Tags : amit shaharticle 370Indiajammu kashmirjammu kashmir bifurcationmodipakistanrevokedterrorism

Also read

Use Facebook to Comment on this PostMenu