01/8/19 11:50 AM

ఈ బ్రహ్మాస్త్రం బీజేపీని మరోసారి గెలిపిస్తుందా

Reservations for Economically Weaker Upper Castes

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రకులాల్లోని పేదలకు సైతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాలో ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని చట్టంగా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయనున్నారు. ఆర్టికల్ 15,16ను సవరించనున్నారు. 8 లక్షల రూపాయల లోపు వార్షికాదాయం, 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి, వెయ్యి చదరపు అడుగుల లోపు సొంతిల్లు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

 

అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు కల్పించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ నాలుగేళ్లు మౌనంగా ఉన్న మోదీ సర్కార్.. ఎలక్షన్స్ టైమ్‌కి రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్లు 50శాతానికి మించడానికి వీల్లేదు అని మోదీ, అమిత్ షాలు పదే పదే చెప్పారు. ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసినా రిజర్వేషన్లు పెంచడానికి నో చెప్పారు. అలాంటి మోదీ.. ఇప్పుడు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రెడీ కావడం చర్చకు దారితీసింది. ఇది ఎలక్షన్ స్టంట్ అని, రాజకీయ లబ్ది కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల మీద ప్రేమతో చేసింది కాదని, రాబోయే ఎన్నికల్లో అగ్రవర్గాల ఓట్లను దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈ పావును కదిపిందని చెబుతున్నాయి.

 

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ రిజర్వేషన్ల బ్రహ్మాస్త్రం ఉపయోగించింది. మరి ఈ బ్రహ్మస్త్రం బీజేపీని మరోసారి గెలిపిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే మాత్రం బీజేపీకి ప్లస్ అవుతుందనే విశ్లేషణ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు విపక్షాలన్నీ ఒక్కటి అవుతున్నాయి. యూపీలో ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపాయి. ఓవైపు వ్యతిరేకత, మరోవైపు విపక్షాల ఐక్యత.. ఇలాంటి పరిస్థితుల్లో విజయం సాధించాలంటే బీజేపీకి అంత ఈజీ కాదు. అందుకే మోదీ రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారని చెబుతున్నారు. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే.. అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్ల కల్పించిన ఘనత బీజేపీకి దక్కుతుంది. అది కచ్చితంగా వారికి ప్లస్ అవుతుందని, ఇప్పటివరకు ఉన్న వ్యతిరేకత మొత్తం మాయం అవుతుందని, ఈ బ్రహ్మాస్త్రంతో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే అనాలసిస్ వినిపిస్తోంది.

 

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కులాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదు. అయితే ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రిజర్వేషన్ శాతం 60కి చేరనుంది. పెంచిన కోటా కారణంగా ఇతర వర్గాల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పోటీ పెరగడం ఖాయం. రిజర్వేషన్లు 50శాతం మించొద్దన్న సుప్రీంకోర్టు తీర్పుతో.. దేశంలో ప్రస్తుతం 49.5శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. ఇందులో ఎస్సీ 15శాతం, ఎస్టీ 7.5శాతం, ఓబీసీ 27శాతంగా ఉంది. అయితే కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న ఈబీసీ 10శాతం రిజర్వేషన్‌తో ఈ మొత్తం 59.5శాతంకు పెరుగుతుంది. ఈ పెంపుతో ఎవరి కోటాలో ఎలాంటి మార్పు లేకున్నా, విద్య, ఉద్యోగ అవకాశాల్లో పోటీ పరంగా అదనపు వ్యక్తులు వచ్చి చేరతారు.

 

అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వెల్ కమ్ చెబితే, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్రవర్గాల్లోని పేదలకు మంచి చేయాలని అనుకుంటే.. పథకాలు తీసుకొస్తే సరిపోతుందని, రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు సంక్షేమ పథకాలు తీసుకురావాలని మోదీ ప్రభుత్వానికి సూచించారు. దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకే రిజర్వేషన్లను తీసుకొచ్చారని గుర్తు చేస్తున్నారు. అగ్రవర్గాల్లోని పేదలపై అంత ప్రేమే ఉంటే వారి పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకునిరావొచ్చని హితవు పలుకుతున్నారు. రిజర్వేషన్లు అన్నవి న్యాయానికి ఉద్దేశించినదని, ఆర్థిక కారణాల ఆధారంగా రాజ్యాంగం రిజర్వేషన్లు ఇవ్వదని గుర్తు చేస్తున్నారు.

 

మోదీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించేవారూ లేకపోలేదు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం చాలా గొప్పదని కితాబిస్తున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటున్నారు. ఇది సమాజంలో కుల విద్వేషాలని కాస్త తగ్గించే చర్య అని విశ్లేషిస్తున్నారు.

Tags : BJPebc quotaeconomically weaker sectionselection stuntpm modipolitical anglereservation for poor upper castesRESERVATIONSupper castes

Also read

Use Facebook to Comment on this Post



Menu