09/5/19 9:39 PM

దారుణంగా పడిపోయిన జీడీపీ.. దీనికి కారణం ఎవరు..?

Modiji Is This AccheDin, GDP Growth Declines

రానున్న కాలం అంతా అచ్చేదిన్ అన్నారు. దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. అగ్రరాజ్యం అమెరికాని ఢీకొట్టబోతున్నామని చెప్పారు. అందరి జీవితాలు వెలిగిపోతాయన్నారు. కట్ చేస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. దేశ ఆర్థిక స్థితి తలకిందులైంది. మనం సాధించింది శూన్యం అని తేలింది. కేంద్రంలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ హయాంలో స్వల్ప వ్యవధిలోనే ప్రధాని మోడీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అతిపెద్ద కీలక నిర్ణయాలు చకచకా తీసుకున్నారు. ఇక బ్లాక్ మనీకి చెక్ పెట్టినట్టే అని గొప్పలు చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనం దేశానికి తిరిగొస్తుందని కబుర్లు చెప్పారు. కానీ.. ఫలితం మరోలా వచ్చింది.

 

దేశ ఆర్థిక స్థితిని సూచించే జీడీపీ వృద్ధి రేటు భారీగా క్షీణించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తొలి క్వార్టర్ లో దేశ స్థూల జాతీయ ఆదాయం వృద్ధిరేటు (జీడీపీ) 0.8 శాతం క్షీణించి 5 శాతంగా నమోదైంది. ఈ క్షీణతతో ఏడేళ్ల కనిష్ట స్థాయికి జీడీపీ పతనం అయ్యింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళుతున్న వేళ, వృద్ధి రేటు ఇలా భారీగా క్షీణించడం పట్ల ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని క్వార్టర్లుగా ఆటో, తయారీరంగం, రియల్ ఎస్టేట్ లాంటి పలు రంగాల్లో మాంద్యం జీడీపీ క్షీణతకు సూచికగా నిలిచింది. తయారీ రంగం కుదేలవడంతో పాటు చైనా, అమెరికా ట్రేడ్ వార్, బ్రెగ్జిట్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ లేకపోవడం, కొనుగోలు శక్తి తగ్గడం వంటి అంశాలు జీడీపీ తగ్గుదలకు సూచికగా నిలిచాయి. ఆర్బీఐ రెపో రేట్లు తగ్గిస్తున్నా బ్యాంకులు మాత్రం పారిశ్రామిక రుణాలను అందించడంలో ఆచితూచి వ్యవహరించడం ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతోంది.

 

దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగం మందగించిందని నిపుణులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా అలాగే జరుగుతోందని అంటున్నారు. పరిశ్రమల్లోని అనేక రంగాల్లో అభివృద్ధి రేటు అతి తక్కువ స్థాయికి చేరుకుంది. దేశం మాంద్యం వైపు వెళ్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండో త్రైమాసికంలో మందగమనంలో వెళ్లింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సెటైర్లు వేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన చిదంబరం.. బెయిల్ ఎందుకు రావడం లేదని మీడియా ప్రశ్నించగా .. దేశ స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందని.. అందుకే తనకు బెయిల్ రావడం లేదని ఎద్దేవా చేశారు.

 

జీడీపీ పడిపోవడంతో విపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని టార్గెట్ చేశాయి. దీనికి ప్రధాని మోడీ ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నాయి. ఇదేనా మీరు సాధించిన ఘనత అని ప్రశ్నిస్తున్నాయి. ఇవేనా అచ్చేదిన్ అంటే అని సెటైర్లు వేస్తున్నాయి. ఇన్నాళ్లు మోడీ చేసిందంతా మాయ అని.. జీడీపీ పడిపోవడంతో ఆయన బండారం బయటపడిందని కాంగ్రెస్ అంటోంది. మోడీ నిర్ణయాల కారణంగా ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.

 

ఆర్థిక మందగమనానికి ప్రధాని మోడీ అసంబద్ధ నిర్ణయాలే కారణం అని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధాని మోడీ చేతకాని తనం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవట్లేదని విమర్శించారు. జీడీపీ 5 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమన్న ఆయన… కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టిసారించాలని కోరారు. ఆర్థిక వ్యవస్థ పతనమవ్వడం తనకు చాలా బాధ కలిగిస్తోందన్నారు. నిజానికి దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా… కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్వహణ వల్ల అంతా తలకిందులైందన్నారు. తయారీ రంగం కష్టాల్లో ఉందన్న మన్మోహన్ సింగ్… నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. మోడీ పాలసీల వల్లే ఇలా జరిగిందన్నారు. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయనీ… మిగతా రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు.

 

మరోవైపు ఈ వ్యవహారంలో బీజేపీ మిత్రపక్షం శివసేన స్పందించింది. ప్రధానికి హితోపదేశం చేసింది. మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ మాటను వినాలని.. ఆయన సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని శివసేన కోరింది. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఆందోళన చెందాల్సిన పరిస్థితిలో ఉందంటూ మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలను శివసేన సమమర్థించింది. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే చర్యలు తీసుకోవాలని మన్మోహన్ సింగ్ సూచించారు. మన్మోహన్ సింగ్ కామెంట్స్ కు శివసేన మద్దతు పలికింది. జాతీయ సమస్య కాబట్టి.. మన్మోహన్ సింగ్ సూచనలను కేంద్రం పట్టించుకోవాలని.. ఆయన విలువైన సలహాలు తీసుకోవాలని శివసేన కోరింది. “దేశ ఆర్థిక వ్యవస్థ పతనం, కశ్మీర్ అంశం.. ఈ రెండు వేర్వేరు విషయాలు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేసే విషయంలో రాజకీయాలకు అవకాశం ఉండకూడదు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ లాంటి వారి సూచనలు దేశానికి చాలా అవసరం. దేశం కూడా మోడీ ప్రభుత్వాన్ని అదే కోరుతోంది” అని శివసేన వ్యాఖ్యానించింది.

 

మొత్తంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ మాటలు మాని చేతల్లో చూపించాలని అంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానేయాలని హితవు పలుకుతున్నారు. ఏ నిర్ణయైనా విపక్షాలతో చర్చించాలని, వారి సలహాలు సూచనలు అభిప్రాయాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. లేదంటే దేశానికి మరిన్ని సమస్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు.

Tags : BJPfallgdpgrowth ratemanmohan singhpm modiSHIVASENA

Also read

Use Facebook to Comment on this PostMenu