03/24/19 1:38 PM

మోహన్ బాబుకి.. చంద్రబాబు మోసాలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి

Mohanbabu Targets Chandrababu.. Who Is Behind Mohanbabu

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయి. చంద్రబాబు, జగన్, పవన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ఆరోపణలతో రాజకీయాలను వేడెక్కించారు. ఇప్పుడు నటుడు మోహన్ బాబు వ్యవహారం.. ఏపీ పాలిటిక్స్ ను మరింత హీటెక్కించింది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ మోహన్ బాబు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు మోసం చేశారని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు. మరి మోహన్ బాబుకి.. చంద్రబాబు మోసాలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి? ఈ ఐదేళ్లు మోహన్ బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఎందుకు రోడ్డెక్కారు? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

 

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సీనియర్ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. 2 రోజుల కిందట తిరుపతిలో తన విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీకి దిగిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశంపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు కుటుంబరావు తీవ్ర విమర్శలు గుప్పించడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బకాయిల విషయంలో మోహన్‌బాబు రాజకీయాలు చేస్తున్నారని, దీని వెనుక రాజకీయ అజెండా ఉందని కుటుంబరావు చేసిన వ్యాఖ్యలకు మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ అంశంపై సీఎం చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేస్తూ మోహన్‌బాబు బహిరంగ లేఖను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

 

చంద్రబాబు పేరును ప్రస్తావించకుండానే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే తమపై కక్షసాధింపు మొదలుపెట్టాడని, ఆ గ్రేట్ అబద్ధాల కోరు గురించి చెప్పాలంటే ఒక గ్రంథం తయారవుతుందని అందులో పేర్కొన్నారు. 2013లో అతడు అధికారంలో లేకపోయినా ఎంతో గౌరవించి నా ఫంక్షన్స్, సినిమా ఓపెనింగ్స్ ఎన్ని జరిగాయో అన్నింటిలోనూ ఉన్నాడు.. కావాలంటే ఇంటర్నెట్‌లో చూసుకోండి అంటూ లేఖలో మండిపడ్డారు. అంతేకాదు, తన లేఖలో అనేక వివాదాస్పద అంశాలను కూడా మోహన్ బాబు ప్రస్తావించారు.

 

‘నేను అడిగింది మా విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బు.. అది అడిగితే అతడికి చెప్పే ధైర్యం లేక ఇద్దరు జోకర్లతో చెప్పిస్తున్నాడు. ప్రభుత్వం నీదైనప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని వందల వేల మంది నీ మోచేతి నీళ్లు తాగే వాళ్లుంటారు.. వాళ్లెవ్వరూ వద్దు ఓపెన్‌గా నువ్వే రా.. నీ స్టేటస్‌కి నేను తగనా, నిజానికి నా స్టేటస్‌కి నువ్వే అర్హుడు కాదు’ అని విమర్శించారు.

 

‘ప్రజలు ఇచ్చిన పదవిలో ఉన్నంత మాత్రాన గొప్పవాడిని అనుకుంటే ఎలా? అన్న ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు పార్టీని ఏమి చేశావో చెబితే బాగుండదు.. నన్ను రెచ్చగొడితే నీ చరిత్ర, అన్నయ్యకు జరిగిన ఘోరాలు, చేసిన మోసాలు అడగడుగునా అనుక్షణం బయటపెడతా. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చేయగలవు.. అది నన్ను చంపించడం అంతే.. ఇంతకంటే ఏమీ చేయలేవు.. నీకు ఆ రాజకీయాలు కూడా తెలుసని నాకు తెలుసు’. అంటూ ఘాటు పదజాలంతో లేఖాస్త్రం సంధించారు.

 

దివంగత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రద్దు చేస్తున్నానని చెప్పి ఎన్నికల్లోకి రాగలవా? అని చంద్రబాబుని మోహన్ బాబు నిలదీశారు. దీనికి టీడీపీ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మోహన్‌బాబు చెప్పెవన్నీ అసత్యాలని చెప్పారు. మోహన్ బాబు ఆరోపణల వెనుక పొలిటికల్ అజెండా ఉందని ఆరోపించారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మోహన్ బాబు.. ఎన్నికల సమయంలోనే ఎందుకు రోడ్డెక్కారని ప్రశ్నిస్తున్నారు?

Tags : arogyasrichandrababufee reimbursementmohan babuTDPvidyanekatanys jaganysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu