03/20/19 12:57 PM

జనసేనలోకి అన్న నాగబాబు : ఎంపీగా పోటీ

Nagababu To Join Janasena

ఎన్నికల వేళ జనసేన పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేనలోకి కీలక, ప్రముఖ వ్యక్తులు చేరుతున్నారు. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం సంచలనం అయింది. ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి పవన్ పార్టీలో జాయిన్ కానున్నారు. ఆయనే మెగా బ్రదర్ నాగబాబు.

 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు జనసేన పార్టీలో చేరుతున్నారు. నాగబాబు నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. నాగబాబు కొన్ని రోజులుగా తన యూట్యూబ్ ఛానెల్‌లో ‘మై షో నా ఇష్టం’ అనే ప్రోగ్రాం చేస్తూ టీడీపీ, వైసీపీ పార్టీలపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇప్పటికే జనసేన విశాఖ లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. అలాగే భీమిలీ నుంచి పంచకర్ల సందీప్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి (బాబు), పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టి.సి. వరుణ్ పోటీలో ఉంటారని పార్టీ అధినేత పవన్ ప్రకటించారు.

 

తమ్ముడి పార్టీకి ఇంతకాలం నైతికంగా మద్దతిస్తున్న నాగబాబు… ప్రత్యక్షంగా జనసేనలో చేరబోతుండటం.. ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపింది. సరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో… జనసేన వ్యూహాత్మకంగానే నాగబాబును ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రభావం ఉంటుందన్నది జనసేన అంచనా. పవన్ కళ్యాణ్ పోటీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జనసేనకు కలిసొస్తుందని… నాగబాబు బరిలో ఉంటే నరసాపురం లోక్‌సభ సీటును కూడా గెలవచ్చనే ప్లాన్‌తోనే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.

 

ప్రస్తుతం నర్సాపురం లోక్ సభ స్థానానికి టీడీపీ నుంచి వెంకట శివరామ రాజు బరిలో దిగగా… వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తున్నారు. పోటీ వీళ్లిద్దరి మధ్యే ఉంటుందని అంతా అనుకున్నారు. ఇప్పుడు వీరికి నాగబాబు తోడయ్యారు. మరి ఆ ఉద్దండులతో పోటీ పడి నాగబాబు గెలుస్తారో లేదో చూడాలి. నటుడిగా నాగబాబుకి మంచి ఇమేజ్ ఉంది. మెగా ఫ్యామిలీ మెంబర్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఇవన్నీ కలిస్తే… నాగబాబు గెలుపు నల్లేరు మీద నడకేనా? కాదా? అన్నది తెలియాలంటే.. మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

Tags : chiranjeevijanasenaloksabha electionsnagababunarsapurampawan kalyan

Also read

Use Facebook to Comment on this Post



Menu