03/14/19 11:23 AM

ఫ్రమ్ మంగళగరి : తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి చినబాబు

Nara Lokesh To Contest From Mangalagiri

ఊహాగానాలకు తెరపడింది. అనుమానాలు వీడాయి. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఈసారి డైరెక్ట్ అటాక్ కు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయన పోటీ చేయబోయే అసెంబ్లీ సెగ్మెంట్ కూడా కన్ఫామ్ అయ్యింది. ఏపీ రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అనేక లెక్కలు వేసుకున్న తర్వాత, చర్చలు జరిపిన తర్వాత, సమీకరణాలు చూసుకున్న తర్వాత.. లోకేష్ ను మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. లోకేష్ ను భావి సీఎంగా టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోకూడదు. అందుకే చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడారని తెలుస్తోంది.

 

భీమిలి నుంచి లోకేష్ పోటీ చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. గంటా శ్రీనివాసరావు స్థానంలో ఆయన బరిలో దిగుతారనే ప్రచారం జరిగింది. కానీ ఫైనల్‌గా మంగళగిరి నుంచి లోకేష్ అభ్యర్థిత్వం ఖరారైంది. రాజధాని ప్రాంతం కావడం, సామాజిక సమీకరణలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో సానుకూలత తదితర కారణాలతో లోకేష్‌ను మంగళగిరి నుంచి బరిలో దింపడమే సరైందని టీడీపీ నాయకత్వం భావించింది.

 

కాగా మంగళగిరి నుంచి 2014లో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి గెలుపొందారు. ఆయనకు 88,977 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవికి 88,965 ఓట్లొచ్చాయి. కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల గెలుపొందారు. ఆళ్లకు మంగళగరి వ్యాప్తంగా మంచి పేరుంది. పేదల కడుపు నింపడం కోసం రూ.4కే భోజనం అందించడం, రూ.10కే సంచి నిండా కూరగాయలు అందించడం తదితర కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు.

 

ఓవైపు అధికార టీడీపీతోనే తలపడుతూనే నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి తన పట్టును పెంచుకున్నారు. జగన్‌కు నమ్మిన బంటులా ఉన్న ఆయన పలు అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు. అమరావతిలో నిబంధనలు పాటించడం లేదంటూ పలు పిటిషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌లో డీజీపీ ఠాకూర్ స్థల ఆక్రమణ, ఓటుకు నోటు కేసు, సాధికార మిత్ర, సదావర్తి భూములు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, సివిల్ సర్వెంట్లకు భూముల కేటాయింపు, జగన్ పై కోడి కత్తి కేసు దర్యాప్తు.. ఇలా పలు పిటిషన్లు దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అడుగడుగునా ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించారు.

 

కానీ ఇటీవల ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో జగన్ టికెట్ ఖరారు చేయకపోవడంతోనే ఆయన కనిపించకుండా పోయారనే వార్తలొచ్చాయి. టీడీపీ కౌన్సిలర్ ఉడతా శ్రీను ఇటీవల వైసీపీలో చేరారు. చేనేత వర్గానికి చెందిన ఆయనకే మంగళగిరి టికెట్ దక్కుతుందనే వార్తలొచ్చాయి. ఒకవేళ మంగళగిరి నుంచి ఆళ్ల పోటీలో ఉంటే మాత్రం లోకేష్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

 

మంగళగిరి ప్రాంతంలో చేనేత కార్మికులు, ముస్లింలు, బీసీల ఓట్లు ఎక్కువ. వీరు ఎవరి వైపు మొగ్గితే విజయం వారినే వరించే అవకాశం ఉంది. చేనేత వర్గానికి చెందిన ఉడుత శ్రీనును ఆళ్ల కలుపుకొని పోగలిగితే.. మంగళరిలో లోకేష్‌కు గట్టిపోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్‌లో గ్రేటర్ అమరావతిగా రాజధాని ప్రాంతం మారనుండడం.. గ్రేటర్ అమరావతిలో తిరుగులేని నాయకుడిగా ఎదిగే ఛాన్స్ ఉండడంతో లోకేష్ కోసం మంగళగిరిని ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి లోకేష్…విజయం సాధించి చరిత్ర సృష్టిస్తారో లేదో తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

 

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్.. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. లోకేష్ కు దమ్ములేదని, ఓడిపోతారనే భయంతోనే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి చేపట్టారని విపక్షాలు విమర్శించాయి. ఆ విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చేలా లోకేష్ రెడీ అయ్యారు. రాజధాని నడబొడ్డున.. చూసుకుందాం రండి.. అని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. మరి లోకేష్ ను ఓడించడానికి ప్రతిపక్షనేత జగన్ ఎలాంటి స్కెచ్ వేస్తారో చూడాలి. లోకేష్ ని ఓడిస్తే టీడీపీపై దాన్ని ప్రభావం మాములుగా ఉండదు. అందుకే మంగళగిరిలో గట్టి అభ్యర్థిని నిలిపే యోచనలో జగన్ ఉన్నారని సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లనే బరిలోకి దింపుతారా.. కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారా అనేది చూడాలి.

Tags : Alla rama Krishna reddyap cm chandrababuASSEMBLY ELECTIONSmangalagirinara lokeshTDPys jaganysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu