08/21/19 7:48 PM

జగన్ అంతా సెట్ చేసేశారా? ఏపీ రాజధాని మార్పు ఖాయమా..?

New Capital For Andhra Pradesh

ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు డ్రోన్ రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు టాపిక్ మారిపోయింది. రాజధాని మార్పు గురించి డిస్కషన్ మొదలైంది. ఏపీ రాజధాని మార్పు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతి కాదు దొనకొండ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. వైసీపీకి చెందిన కీలక నాయకులు ఇస్తున్న స్టేట్ మెంట్లు, అమరావతిలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే రాజధాని మార్పు ఖాయమే అనిపిస్తోంది.

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించబోతున్నారనే చర్చ.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. అమరావతిలో ఎక్కడి పనులు అక్కడ ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు… ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని.. చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నీళ్లన్నింటినీ బిగపట్టి ఒక్కసారిగా వదిలి.. రాజధాని గ్రామాల్లోకి నీరు వచ్చేలా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు టీడీపీ నేతలు చేశారు.

 

తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి, రాజధాని అంశాన్ని పర్యవేక్షిస్తున్న బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు డిస్కషన్ కు దారితీశాయి. ఏపీ రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదు అని బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, దీనిపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని బాంబు పేల్చారు. నిర్మాణ వ్యయం అమరావతిలో ఎక్కువ అవుతుందని మరో చోట అయితే తక్కువగా ఉందని.. దానికి తోడు అమరావతిలో ముంపు సమస్యలు ఉన్నాయని బొత్స చెప్పుకొచ్చారు. దీంతో ఏపీ రాజధాని షిఫ్ట్ అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

 

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. నిర్మాణాలపైన నియమించిన అధ్యయన కమిటీ నిర్మాణాలకు ఎక్కువగా ఖర్చు అవుతుందని తేల్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు వరదల ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నట్లు చెబుతున్నారు. వరదల నుంచి రక్షణ పొందాలంటే కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సిన అవసరం ఉందని, దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడితే ప్రజాధనం వృథా అవుతుందని బొత్స అంటున్నారు. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి బొత్స స్వరంలో మార్పు కనిపించడం విశేషం. రాజధాని అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించిందని, ఈ ప్రాంతం అంత సురక్షితం కాదని, ఓ పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని.. రేపు కేంద్రం ఆరా తీస్తే ప్రజలూ ప్రశ్నిస్తారని ఎంపీ విజయసాయి రెడ్డి సైతం ట్వీట్ చేశారు.

 

ఇలా వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరిగా చేస్తున్న కామెంట్స్ గమనిస్తే రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయమని అనిపిస్తుంది. పైగా సీఎం జగన్ కూడా వారి వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చెయ్యడం లేదు. దీంతో ప్రభుత్వం ఏదో సంచలన నిర్ణయం తీసుకోబోతుందనే సూచనలు కనిపిస్తున్నాయి.

 

అదే సమయంలో వైసీపీకే చెందిన కీలక నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాత్రం మరోలా చెప్పారు. బొత్స స్టేట్ మెంట్ కి పూర్తి భిన్నంగా స్పందించారు. రాజధాని మార్పు గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ప్రభుత్వానికి రాజధాని మార్చే ఆలోచనే లేదన్నారు. రాజధానిని మారుస్తాము అని వైసీపీ మేనిఫెస్టోలో ఏమైనా చెప్పామా అని ప్రశ్నించారు. రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని బొత్స అంటే.. రాజధానిని మార్చే ఆలోచన లేదని అంబటి అన్నారు. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలతో అసలు వైసీపీ నేతల మైండ్ లో ఏముందో అర్థం కాక జనాలు తలలు పట్టుకున్నారు.

 

అదే సమయంలో మరో వార్తా హల్ చల్ చేస్తోంది. అదే.. ఒక రాష్ట్రం రెండు రాజధానులు. ఈ కాన్సెప్ట్ ని కూడా వైసీపీ పరిశీలిస్తోందని సమాచారం. రాజధానిలో ముంపు ప్రాంతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని రాజధాని పరిధిని కుదించే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో మరో ప్రాంతాన్ని రెండో రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫారిన్ టూర్ నుంచి వచ్చాక సీఎం జగన్ దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం సీఆర్డీఏ పరిధి రాజధాని ప్రాంతంగా ఉంది. 23 గ్రామాల ప్రజలు రాజధానికి భూములిచ్చారు. ముంపునకు అవకాశం లేని ప్రాంతాన్ని మాత్రమే రాజధానిగా చేసి, మరో చోట రెండవ రాజధాని నిర్మించే అవకాశం ఉందని, కేంద్రంతో సంప్రదింపులు తర్వాత జగన్ ఈ ప్రకటన చేయవచ్చని చర్చించుకుంటున్నారు.

 

అదే సమయంలో రాజధాని మార్చడం అంత ఈజీ కాదనే వారూ లేకపోలేదు. రాజధానిలో సుమారు రూ. 37వేల కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపట్టారని గుర్తు చేస్తున్నారు టీడీపీ నాయకులు. రహదారుల నిర్మాణం 65 శాతం మేర పూర్తయ్యాయని చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారి కూడా తుది దశకు చేరుకుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాల్గో తరగతి ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి వంటి పలు కీలక నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక సచివాలయం టవర్ల నిర్మాణం కూడా ప్రారంభమైంది. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, మంత్రులు, ముఖ్యమంత్రి నివాసాలు, గవర్నర్ బంగ్లా వంటి నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ దశలో రాజధానిపై పునరాలోచన అనేది.. ప్రకటన చేసినంత తేలిక కాదని వారంటున్నారు.

 

రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలిచ్చారు. వారికి ఇచ్చిన ప్లాట్లను ఇప్పటికే సీఆర్డీఏ రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. లాటరీ విధానంలో రైతులకు వేరే భూముల్లో ప్లాట్లు వచ్చాయి. కొంతమంది రైతులు వాటిని విక్రయించారు. ఈ దశలో రాజధానిని మార్చాలన్నా కూడా సాధ్యం కాదని న్యాయనిపుణలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన కౌలు చెల్లించడం లేదు. కానీ రైతులు ఇంకా న్యాయపోరాటం దిశగా ఆలోచించలేదు. సహనంతో ఉన్నారు. ప్రభుత్వం కౌలు ఇవ్వబోమని ప్రకటించలేదు. అలా ప్రకటిస్తే..వారు కోర్టుకెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి అమరావతిని దొనకొండకో.. ఇంకో చోటకో మార్చాలన్నా… అది సాధ్యమయ్యే పని కాదని మాత్రం.. నిపుణలు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ ఇలా గందరగోళం సృష్టించి.. అమరావతిని ఓ మృతనగరంగా మార్చడాన్ని మాత్రం.. విజయవంతంగా పూర్తి చేయవచ్చంటున్నారు.

Tags : amaravatiap capitalbotsachandrababuchangecm jagandonakondaTDPtirupatiysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu