08/3/19 12:38 PM

నిమ్మగడ్డకు పట్టిన గతే ఆయనకూ పడుతుందా..?

Nimmagadda Arrest, Who Is Next

వాన్‌పిక్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విహారయాత్ర కోసం సెర్బియా వెళ్లిన నిమ్మగడ్డను అక్కడి పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ కి నిమ్మగడ్డ సన్నిహితుడు. దీంతో నిమ్మగడ్డ అరెస్ట్ వార్త వైసీపీ శ్రేణులను కలవరానికి గురి చేసింది. మరోవైపు ఈ అంశాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంటోంది. వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. నిమ్మగడ్డకు పట్టిన గతే మీకూ పడుతుందని జగన్ ని ఆయన పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారు.

 

వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను జూలై 27న సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమా(రాక్)కు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్ గ్రేడ్ లో నిమ్మగడ్డను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. వాన్ పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డ పై రస్ అల్ ఖైమా(రాక్) ఫిర్యాదు చేసింది. సెర్బియాకి విహారయాత్రకు వెళ్లిన నిమ్మగడ్డ అక్కడ పోలీసులకు చిక్కినట్లు సమాచారం.

 

వాన్‌పిక్ కేసులో ఆగస్టు 2న నిమ్మగడ్డ జైలు నుంచి విడుదలైనట్టు తెలుస్తోంది. అయితే దేశ రాజధాని బెల్‌గ్రేడ్ విడిచి వెళ్లరాదనే షరతులతో ఆయనను విడుదల చేశారట. నిమ్మగడ్డ బెయిల్‌పై బయటకొచ్చారా? విదేశాంగ శాఖ చొరవ తీసుకుందా? అనేది తెలియాల్సి ఉంది. వాన్‌పిక్‌ ప్రాజెక్ట్ వ్యవహారంలో పెట్టుబడులు పెట్టిన తమకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించారనే ఆరోపణలపై యూఏఈ ఫెడరల్‌ క్రిమినల్‌ కోడ్‌ కింద నిమ్మగడ్డ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడైన నిమ్మగడ్డను తమకు అప్పగించాలన్న రస్‌ ఆల్‌ ఖైమా(రాక్‌) అభ్యర్థన మేరకు 2016 సెప్టెంబర్ 5న ఇంటర్‌ పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.

 

ఈ నోటీసు జారీచేసిన తర్వాత బ్రిటన్‌, సింగపూర్‌ సహా పలు దేశాల్లో నిమ్మగడ్డ పర్యటించినా పట్టించుకోలేదు. తాజాగా, సెర్బియా టూర్ కు వెళ్లినపుడు అక్కడి పోలీసులు నిమ్మగడ్డని అదుపులోకి తీసుకుని, బెల్‌గ్రేడ్‌‌లోని ఉన్నత న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన నిర్బంధాన్ని అనుమతించిన కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్బంధం జులై 27 ఉదయం 8.20 గంటల నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. రెండు నెలలకోసారి పరిస్థితులను సమీక్షించి నిర్బంధ ఉత్తర్వులను పొడిగించే అవకాశం ఉంటుందని, దీనిని గరిష్ఠంగా ఏడాది వరకు కొనసాగించడానికి వీలుంటుందని పేర్కొంది.

 

ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసు, తమకు అప్పగించాలన్న రాక్‌ అభ్యర్థన తమ వద్ద ఉందని కోర్టు వెల్లడించింది. సెర్బియాలో నిందితుడికి నివాసం లేదని, రాగేటరీ లేఖల ఆధారంగా అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యేలోగా పారిపోవడానికి, తప్పించుకుని తిరగడానికి అవకాశం ఉన్నందున నిర్బంధంలోకి తీసుకోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడి వాదనలు వినకుండా తక్షణమే అరెస్ట్ చేయడానికి చట్టాలు అనుమతిస్తున్నాయని ఉత్తర్వులు జారీ చేసింది.

 

ప్రస్తుతం నిమ్మగడ్డను షరతులతో విడుదల చేసినట్టు సమాచారం. ఆయన జైలు నుంచి బయటకు వచ్చినా అక్కడి చట్ట ప్రక్రియ పూర్తయ్యేదాకా బెల్‌గ్రేడ్‌ నగరం నుంచి బయటికి వెళ్లడానికి అవకాశం ఉండదు. వాన్‌పిక్‌ వ్యవహారంపై సీబీఐ నమోదుచేసిన కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ ఏ3గా ఉన్నారు. ఈ కేసులో అరెస్టయిన ఆయనకు సీబీఐ కోర్టు షరతులతో కూడి బెయిలు మంజూరు చేసింది. 2018 జనవరి 8 నుంచి రెండేళ్లపాటు విదేశాలకు వెళ్లడానికి కోర్టు అనుమతించింది. తాజాగా సెర్బియా వెళ్లి ఆయన ఇరుక్కున్నారు.

 

అయితే… నిమ్మగడ్డ ప్రసాద్‌ని భారత్ కి రప్పించేందుకు వైసీపీ ఎంపీలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా వారు కోరుతున్నారు. సెర్బియాతో సంప్రదింపులు జరిపి.. నిమ్మగడ్డను సురక్షితంగా భారత్ కి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని విదేశాంగమంత్రి జైశంకర్ కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారట.

 

నిమ్మగడ్డ అరెస్ట్ వ్యవహారంలో జగన్ ‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మాటల దాడిని పెంచారు. నిమ్మగడ్డ ప్రసాద్ కు పట్టిన గతే జగన్ కు కూడా పడుతుందని టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ ద్వారా హెచ్చరించారు. “అయ్యా జగన్ రెడ్డి గారు అసలే బ్యాంకుల పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన వేలాది కోట్లను తిరిగి చెల్లించిన తర్వాత శ్రీరంగ నీతులు చెప్పమనండి. లేకపోతే నిమ్మగడ్డ కు పట్టిన గతే పడుతుంది” అని నాని ట్వీట్ చేశారు.

 

వాన్ పిక్ భూముల వ్యవహారంలో జగన్ తో పాటు నిమ్మగడ్డ కూడా నిందితుడు అని నాని చెప్పారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులు చెయ్యటం చేతకాకపోతే తాను చేస్తానని, నిమ్మగడ్డ వ్యవహారం జగన్ చూసుకోవచ్చని సెటైర్ వేసిన నాని.. ఇప్పుడు నిమ్మగడ్డ జైలుపాలైన అంశాన్ని, బ్యాంకులకు కుచ్చు టోపీ పెడితే పీవీపీ కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతూ అది మీకు కూడా అన్నట్టు జగన్ ను టార్గెట్ చేసి పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ”వాడ్రేవ్ అండ్‌ నిజాంపట్నం ఇండస్ట్రియల్‌ కారిడార్‌’… దీనినే సంక్షిప్తంగా ‘వాన్‌పిక్‌’ అని పిలుస్తారు. తీర ప్రాంత అభివృద్ధి పేరిట దివంగత సీఎం వైఎస్ హయాంలో 2005-2006లో వాన్‌పిక్‌ కోసం భూ సేకరణ చేపట్టారు. ఈ విషయంలో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

Tags : ap cmarrestjagan jerusalemkesineni naninimmagadda prasadTDPvanpicys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu