09/1/19 12:51 PM

పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో

Pawan Kalayan Sensational Comments On Jagan Govt

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. రాజధాని చుట్టూ నడుస్తున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది. రోజుకో నాయకుడి ఎంట్రీతో, పూటకో స్టేట్ మెంట్ తో రాజధాని రాజకీయం మలుపులు తిరుగుతోంది. తాజాగా రాజధాని రగడంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఏపీ రాజధాని గారి పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజధాని ఎక్కడికీ వెళ్లదు అని పవన్ తేల్చి చెప్పారు. రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాజధాని అమరావతే అని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ చేసిన కామెంట్స్ కాక పుట్టించాయి. రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయి. టీడీపీ శ్రేణుల్లో ఆనందం నింపాయి.

 

జగన్ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుంది అనే వార్తలతో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పవన్ రంగంలోకి దిగారు. రాజధాని ప్రాంతంలో రెండు రోజులు పర్యటించారు. స్థానికులు, రైతులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని రైతులకు పవన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఏకిపారేశారు.

 

ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చేస్తామంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు మీద కోపంత ప్రజలని శిక్షిస్తారా అని నిలదీశారు. ఓ కులం మీద కోపంతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతారా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారుతుందంటే ఎలా అని అడిగారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలని పవన్ హెచ్చరించారు. రోజులు మారుతుంటాయని, రేపు మరొకరు అధికారంలోకి రావొచ్చని పవన్ చెప్పారు. కాలం కలిసి వచ్చో లేక ఈవీఎంల ఘనతో తెలియదు కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిందని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తలుచుకుంటే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు, వైసీపీ ఓడిపోవచ్చు అని పవన్ వార్నింగ్ ఇచ్చారు. రాజధాని రైతులు భూములు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికి కానీ.. వ్యక్తులకు కాదని పవన్ స్పష్టం చేశారు.

 

అదే సమయంలో మంత్రి బొత్స పైనా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బొత్సకి మనసులో ఎక్కడో ఓ మూలన సీఎం కావాలనే కోరిక ఉందని అందుకే ఆయన రాజధాని గురించి ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారని పవన్ అన్నారు. బొత్స గారు.. జగన్ మాయలో పడకండి అని సూచించారు. బొత్స ఓ సీనియర్ నేత.. అలాంటి వ్యక్తి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం తగదన్నారు. ఏపీని అడ్డగోలుగా విభజించి పెద్ద పాపం చేసిన కాంగ్రెస్ నేత చిదంబరం.. ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నారన్న పవన్.. చిదంబరంకి పట్టిన గతే.. బొత్సకి కూడా పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. రాజధాని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవన్ అభయం ఇచ్చారు. రైతులకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. రాజధాని కోసం పోరాటం చేస్తుందన్నారు. రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీని కలుస్తానని పవన్ స్పష్టం చేశారు.

 

ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు పవన్. ప్రధాని మోడీ ఎంతో సమర్థవంతంగా కశ్మీర్ సమస్యని పరిష్కరించారని కితాబిచ్చారు. ప్రధాని మోడీ వ్యక్తితంగా తనకు తెలుసు అన్నారు. ఆయన కెపాసిటీ ఏంటో తనకు తెలుసని చెప్పారు. సీఎం జగన్.. అమరావతిని రాజధానిగా అంగీకరించకపోవడం అంటే.. ప్రధాని మోడీ, అమిత్ షాలను వ్యతిరేకించినట్టే అని పవన్ అన్నారు. కొంతకాలంగా బీజేపీని, మోడీని పవన్ విమర్శిస్తూ వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, తీరని అన్యాయం చేశారని, ఏపీ ప్రజల గొంతుకోశారని పలు సందర్భాల్లో బీజేపీ, ప్రధాని మోడీపై పవన్ నిప్పులు చెరిగారు. అలాంటి వ్యక్తి సడెన్ గా మోడీని ప్రశంసలతో ముంచెత్తడం విశేషం.

 

మొత్తంగా పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజధాని ఎక్కడికీ వెళ్లదు, ఎన్నికలు రావొచ్చు వైసీపీ ఓడిపోవచ్చు, చిదంబరంకి పట్టిన గతే బొత్సకి పడుతుంది.. ఇలా పవన్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. అయినా రాజధాని ఎక్కడికీ వెళ్లదు అని పవన్ అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడటానికి కారణం ఏంటి? అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. మరోవైపు పవన్ తీరు జనసేన శ్రేణుల్లో ఎంత ఆనందం నింపిందో తెలియదు కానీ.. టీడీపీ శ్రేణులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నాయి. రాజధాని విషయంలో తాము చేస్తున్న పోరాటానికి పవన్ రూపంలో మరో సపోర్ట్ దొరికిందని తమ్ముళ్లు ఆనంద పడుతున్నారు. పవన్ ను కలుపుకుని జగన్ ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.

Tags : amaravatiap capitalBotsa satyanarayanachandrababucm jaganjanasenapawan kalyanpm modi

Also read

Use Facebook to Comment on this PostMenu