01/21/18 3:51 PM

పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..!

Untitled-1 copy

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. క్రియా శీలక రాజకీయాల్లో మరింత యాక్టివ్ కానున్నారు. 2019 ఎన్నికలు టార్గెట్ గా.. జనసేనాని కసరత్తును ముమ్మరం చేశారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు, వారికి చేరువయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రాజకీయ యాత్రకు పవన్ శ్రీకారం చుట్టనున్నారు. అయితే అందరు నాయకుల్లా కాకుండా తన పొలిటికల్ టూర్ ను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు పవన్ కల్యాణ్.

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్ర వివరాలను ప్రకటించారు. రేపట్నుంచి తెలంగాణలో యాత్ర ప్రారంభమవుతుంది. తొలుత నాలుగు రోజులపాటు తెలంగాణలోని మూడు జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ తెలిపారు. తొలుత కొండగట్టు ఆంజనేయస్వామిని సందర్శించి అక్కడినుంచే యాత్ర ప్రారంభిస్తానన్నారు. తెలంగాణాలో ఎక్కడెక్కడ టూర్ చేయాలో తమ పార్టీ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పారు. 2009లో జరిగిన ప్రమాదం నుంచి తనను ఆంజనేయస్వామే కాపాడాడని… అందువల్ల తొలుత కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని… అక్కడ నుంచి యాత్రను ప్రారంభిస్తానని చెప్పారు.

 

మూడు, నాలుగు జిల్లాల నేతలతో సమావేశమైన తర్వాత కొండగట్టులో తన యాత్ర పూర్తి వివరాలను వెల్లడిస్తానని పవన్ తెలిపారు. వీలైతే పాదయాత్ర.. లేకపోతే బస్సుయాత్ర.. అవసరమైతే రోడ్ షో.. ఇలా వీలున్న మార్గాల్లో ప్రజల చెంతకు వెళతానని పవన్ పేర్కొన్నారు. ప్రత్యేకించి విరామం అనేది ఉండదని తెలిపారు. కేవలం ప్రజాసమస్యలను అధ్యయనం చేయడానికే ఈ యాత్రను చేపడుతున్నానని జనసేనాని తెలిపారు. పాదయాత్ర చేస్తే ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉండదని పవన్ అన్నారు. యాత్రలో భాగంగా ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు.

 

కాగా.. ఈ యాత్ర సందర్భంగా బహిరంగ సభలు ఉండవు. ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతూ.. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

 

‘మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి’ అంటూ పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ‘నా అప్రహిత రాజకీయ యాత్రను తెలుగునేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించనున్నాను. 2009 ఎన్నికలకు ప్రచారం చేస్తున్న తరుణంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి నేను ఇక్కడే క్షేమంగా బయటపడ్డాను. దానికి తోడు మా కుటుంబ ఇల వేల్పు ఆంజనేయ స్వామి కావడం కూడా ఇక్కడ నుంచి నా నిరంతర రాజకీయ యాత్రను ఆరంభించడానికి కారణభూతమైంది.

 

సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను’ అని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. అంతేకాదు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటూ ఆ దేవాలయ ఫొటోను కూడా పవన్ కల్యాణ్ పోస్ట్ చేయడం విశేషం.

 

కాగా.. పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత.. కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద పవన్ ఫ్యాన్స్ ఆయన ఫ్లెక్సీ కి పూజలు నిర్వహించారు. కొండగట్టు నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తానని పవన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ యాత్ర దిగ్విజయం కావాలని కోరుతూ వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

 

మరోవైపు పార్టీ ముఖ్యనేతలతో జరిపిన సమావేశంలో.. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జనసేనాని చర్చించారు. ఈ నెలాఖరులో పార్టీ సమన్వయకర్తల సమావేశాన్ని, మార్చి నెలలో పార్టీ ప్లీనరీని నిర్వహించాలని ఈ భేటీలో తాత్కాలికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Tags : announces datesjanasenakondagattu anjaneya swamy templepawan kalyanpawan kalyan political tourTelangana

Also read

Use Facebook to Comment on this Post



Menu