12/1/18 8:43 PM

కుల రాజకీయాలు వస్తే నాశనమే : పవన్ కళ్యాణ్ వార్నింగ్

Pawan Kalyan Fires On Caste Politics

కుల రాజకీయాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీలో బీహార్, ఉత్తరప్రదేశ్ తరహా కుల రాజకీయాలు వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని హెచ్చరించారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని అన్నారు. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ గొడవల్లో ప్రజలు చితికిపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పవన్ సమక్షంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. ప్రస్తుతం ఏపీలో ఓ రెండు కులాలను రెచ్చగొట్టి, మరో రెండు కులాలపై ఎగదోసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో అశాంతి తప్ప మరేది ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులాల కుంపటి లేకుండా పోవాలని పవన్ కోరారు. అవకాశవాద రాజకీయాలు పోయి.. ప్రజలకు సేవ చేయగలిగే రాజకీయ వ్యవస్థ రావాలని పవన్ ఆకాంక్షించారు.

 

జనసేన మాత్రం కుల రాజకీయాలకు దూరమన్నారు పవన్. ఇలాంటి కుల రాజకీయాలను అడ్డుకుంటారన్న ఉద్దేశంతోనే తాను 2014లో టీడీపీకి మద్దతిచ్చానని.. అయితే ఆ పార్టీ నేతలు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా వారిలో ఏమాత్రం మార్పురాలేదని పవన్ ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా, మహిళలపై దాడులతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మద్దతును కోల్పోయిందన్నారు. చంద్రబాబు జనసేన అభివృద్ధికి సాయం చేస్తారని తాను ఎప్పుడూ ఆశించలేదన్నారు.

 

రాష్ట్రంలో అవినీతిరహిత ప్రభుత్వం వస్తుందని మాత్రమే ఆశించానని.. అయితే రాష్ట్రమంతటా ఇప్పుడు తీవ్రమైన అశాంతి పరిస్థితులు, అవినీతి నెలకొన్నాయని పవన్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజన్ 2050 ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని పవన్ ధీమా వ్యక్తం చేశారు. దళితులకు పదవులు ఇస్తారు కాని.. అధికారాలు మాత్రం ఇవ్వకపోవడం ఏంటని పవన్ ప్రశ్నించారు.

 

చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఏ నియోజకవర్గానికి వెళ్లి చూసినా కనీసం వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆడపడుచులను కొట్టే నాయకులు ఎమ్మెల్యేలు కావడంతో, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని మండిపడ్డారు.

Tags : janasenapawan kalyanpawan kalyan on caste poltiicsravela kishor babu joins pawan

Also read

Use Facebook to Comment on this Post



Menu